Jump to content

ముత్తా వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
సతీ సమేతంగా ముత్తా వెంకటసుబ్బారావు

ముత్తా వెంకట సుబ్బారావు (18 జూలై 1878 - 30 డిసెంబరు 1960) (ముర్తయ్య శెట్టి) మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి .

బాల్య జీవితం, విద్య

[మార్చు]

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆకివీడులో జూలై 18 1878 న జన్మించాడు. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడైనాడు. తరువాత మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

విద్యాభ్యాసం అనంతరం ఆయన సి.వి.కుమారస్వామి శాస్త్రి వద్ద జూనియర్ లాయరుగా పనిచేసాడు. 1903లో ఆయన స్వంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. నవంబరు 1 1921 న మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైనాడు. ఆ విధంగా నియమింపబడిన మొదటి భారతీయుడాయన.[1] ఆయన "1936 న్యూ యియర్ ఆనర్స్" జాబితాలో "నైట్ బాచిలర్"గా నియమితులైనాడు.[2][3]

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ఒకసారి కలకత్తా మెయిలులో మొదటి తరగతి కంపార్టుమెంటులో ప్రయాణిస్తుండగా గూడూరులో ఒక బ్రిటిషు మిలిటరీ అధికారి కంపార్టుమెంటులో ఎక్కుతున్నందున సుబ్బారావును దిగిపొమ్మని చెప్పాడు. తనకు టిక్కెట్టు ఉందని తనను దిగిపొమ్మనడం తప్పని, ఆ దొర రెండోవైపు కూర్చోవచ్చని చెప్పినా వినకుండా ముత్తా వెంకట సుబ్బారావుని కిందకు ఈడ్చేశారట. అంతటితో ఆగకుండా సీటు క్రిందవున్న నల్లపెట్టెను బూటుకాలుతో తన్నాడట. ఆ పెట్టెను బూటుకాలితో తన్నాడట. ఆ పెట్టెకు అమర్యాద జరిగితే తీవ్ర నేరమని చెప్పినా పెడచెవిన పెట్టిన ఆ మేజర్ దాన్ని కాలుతో తంతే ఆ పెట్టె మూత వూడిపోయి మద్రాసు హైకోర్టు రాజలాంఛనాలు కిందపడ్డాయి. వెంటనే వాటిని ధరించి అది కోర్టని ప్రకటించి మేజర్‌ను క్షమాపణ చెప్పమని కోరాడట. అయినా ఖాతరు చేయని మేజర్‌ను తనకు జరిగిన అవమానానికి క్షమించి, న్యాయస్థానాన్ని అగౌరవ పరచినందుకు ఏడేళ్ళు కఠిన కారాగార శిక్ష విధించాడట. దీంతో లొంగిపోయిన ఆ సేనాని తర్వాత లండన్ ప్రీవీ కౌన్సిలుకి అప్పీలు చేసుకున్నాడు. అయితే విచారణ జరిపిన ప్రీవీ కౌన్సిల్ ముత్తా విధించిన శిక్ష తక్కువని చెప్పి దానికి మూడు రెట్లు 21 సంవత్సరాలను శిక్షగా విధించారు.[4]

సంఘసేవ

[మార్చు]

ఆయన 1928లో ఆండాళమ్మ అనే వితంతువును ఆదర్శ వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరం ఆ దంపతులు "మద్రాస్ సేవా సదన్" అనే సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ 10,000 రూపాయల పెట్టుబడితో 8 మంది అనాథ బాలికలతో ప్రారంభమయ్యింది. కాలక్రమేణా ఆ సంస్థ 10,000 మంది స్త్రీలకు, బాలికలకు ఆశ్రయం కల్పించిన అతి పెద్ద సేవా సంస్థగా ఎదిగింది. అంతే కాకుండా ఈ మద్రాస్ సేవా సదన్ లేడీ ఆండాళ్ వెంకట సుబ్బారావు హయ్యర్ సెకండరీ స్కూలును, సర్ ముత్తా వెంకట సుబ్బారావు సంగీత సభను నడుపుతున్నది.[5]

మూలాలు

[మార్చు]
  1. The London Gazette, 8 November 1921
  2. The London Gazette, 1 January 1936
  3. The London Gazette, 24 April 1936
  4. Fri, 31 March 2017 ఆంధ్రజ్యోతి epaper andhrajyothy com,
  5. "లేడీ ఎం.వి.ఆర్.స్కూలు". Archived from the original on 2017-08-12. Retrieved 2017-04-23.