Jump to content

మోచర్ల రామచంద్రరావు

వికీపీడియా నుండి
మోచర్ల రామచంద్రరావు

సర్ మోచర్ల రామచంద్రరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు.[1]

రామచంద్రరావు పశ్చిమ గోదావరి జిల్లా బాదంపూడి గ్రామంలో 1868లో జన్మించాడు. ఈయన బావ మద్రాసులో ఉండటం వల్ల 12 ఏళ్ల వయసులో మద్రాసుకు వచ్చాడు. ట్రిప్లికేన్ లోని హిందూ ఉన్నత పాఠశాలలో చేరి 17 వ ఏట ఉత్తీర్ణుడయ్యాడు. 21 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టాను, ఆ తరువాత రెండేళ్లకు లా కళాశాల నుండి న్యాయవాదిగానూ ఉత్తీర్ణుడైనాడు.[2]

మద్రాసు నగరంలో ప్రాక్టీసు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో, స్వగ్రామంలో తండ్రి మరణించడంతో పశ్చిమగోదావరికి తిరిగివచ్చి, 1894 నుండి 1905 వరకు 11 ఏళ్లు రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆ పదకొండేళ్లలో తరచూ కోర్టు గదులకు వెళుతూ, అప్పట్లో మద్రాసులో ప్రముఖ న్యాయవాది ఆండ్రూ లైంగ్ వద్ద సహాయకునిగా కూడా పనిచేశాడు. రాజమండ్రిలో ఈయన ప్రాక్టీసు పెద్ద ఎత్తున వస్తున్న జమిందారీ కేసులతో విజయవంతంగానే సాగుతుండేది. బాగా వృద్ధి చెంది సంపాదన తెచ్చిపెట్టింది. అయితే గోదావరి జిల్లా రెండుగా విడిపోయినప్పుడు, ఏలూరులో స్థిరపడి అక్కడ బార్ అసోషియేషన్ అధ్యక్షునిగా పదిహేనేళ్లకు పైగా పనిచేశాడు. అక్కడే నగరపాలిక యొక్క తొలి ఛైర్మన్ గా ఎన్నికై పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగాడు. ఏలూరులో ఈయన చేసిన సేవలకు స్మారకార్ధంగా ఒక పేటకు రామచంద్రరావు పేట అని నామకరణం చేశారు. జిల్లా రాజధాని నిడుదవోలుకు బదలుగా ఏలూరును చేయటానికి రామచంద్రరావే ప్రధాన కారణం. ఈయన కొన్నాళ్ళు ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా బోర్డులకు అధ్యక్షునిగా పనిచేశాడు. మోచర్ల రామచంద్రరావు 1914-4-10 నుండి 1919-11-15 వరకు విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం నకు తొలి అధ్యక్షుడిగా ఉన్నాడు[3].

ఈయన జాతీయ కాంగ్రెస్‌లో మితవాద వర్గంలో ఉండేవాడు. మద్రాసు రాష్ర్ట శాసన సభకు మూడుసార్లు ఎన్నికయ్యాడు. పదవిలో ఉన్న కాలంలో ప్రజలకు అండగా ఉంటూ రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి సాగించాడు. 1924లో సాధారణ శాసన నిర్మాణ సభ సభ్యుడిగా నియమితులయ్యారు. 1927లో సంస్థానంలో ప్రజల తరపున ఇంగ్లాండు రాయబారిగా వెళ్లాడు. రిజర్వు బ్యాంకు గవర్నరుగా అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యుడిగా పనిచేశాడు. ఆయన ఆంధ్రోద్యమ నాయకుల్లో ఒకరు. 1916లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఆయన కార్యదీక్షత, నమ్రత, సేవానిరతిని గుర్తించిన ఆంధ్ర ప్రజలు ఆయనకు ‘దక్షిణ దేశపు గోఖలే’గా ప్రశంసించారు.

మోచర్ల 1936 మే నెలలో తన 68వ యేట మద్రాసులో పరమపదించాడు. సంతాపసభలో రైట్ హానరబులు వి.ఎస్.శ్రీనివాసశాస్త్రి ఈయనను దక్షిణభారత గోఖలేగా అభివర్ణించాడు.

మూలాలు

[మార్చు]
  1. C., Hayavadana Rao (1915). Wikisource link to :en:The Indian Biographical Dictionary (1915)/Ramachendra Rao, Honourable Mocherla. వికీసోర్స్. 
  2. Perumal, Nilkan (January 1949). Sir Mocherla Ramachandra Rao (Triveni Journal ed.). Retrieved 15 September 2024.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-11-16. Retrieved 2022-11-16.