మౌల్వి అహ్మదుల్లా షా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మౌల్వి అహ్మదుల్లా 1857 ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు. తన తలను సమర్పించి మాతృభూమి రుణం తీర్చుకున్న వాడు . ఫైజాబాద్ తాలూక్‌దార్. అవథ్ సంస్థానాన్ని బ్రిటీష్ కంపెనీ సైన్యం ఆక్రమించుకొని ఫైజాబాద్ తాలూక్ దార్‌ని రద్దుచేసింది. దీంతో బ్రిటీష్ కంపెనీపై తిరుగుబాటు చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని మౌల్విని మిలిటరీ బ్యారక్స్ లో నిర్బంధించారు. స్వాతంత్ర్య తిరుగు బాటు సైనికులు ఫైజాబాద్‌ను అక్రమించుకుని బందీగా ఉన్న మౌల్వి అహ్మదుల్లాను తమ నాయకుడిగా చేసుకున్నారు. ఫైజాబాద్ లోని బ్రిటీష్ సైనికులందరినీ హతమార్చాలని తిరుగుబాటు సైనికులు యత్నించగా మౌల్వి వారిని వారించి,ఆంగ్లేయులను సురక్షితంగా పంపే ఏర్పాట్లు చేశారు. వేల సైనికులతో ఆంగ్లేయులు దాడికి తలపడ్డారు. మౌల్వి గాయపడ్డాడు.లక్నోలో యుద్ధ భూమికి తన సేనను తరలించాడు. అక్కడ వీరనారి బేగం హజరత్ మహల్, ఆమె కుమారుడు వలీ, మౌల్వికి స్వాగతం పలికారు. 1858 ఫిబ్రవరి 16న లక్నోలో జరిగిన పోరాటంలో మౌల్వి సైన్యం ఓటమిని ఎదుర్కొంది.బ్రిటీష్ వాళ్ళు మౌల్వీని ప్రమాద కరమైన వ్యక్తిగా ప్రకటించారు. బ్రిటీష్ కుట్రలను గ్రహించిన మౌల్వి అహ్మదుల్లా షాజహాన్ పూర్ వైపు సైన్యంతో సహా పారిపోయాడు. దీంతో మౌల్వి అహ్మదుల్లాను ప్రాణాలతో కానీ, హతమార్చి శవాన్ని కానీ కంపెనీకి అప్పగిస్తే రూ. 50 వేలు బహుమతి ఇస్తామని కంపెనీ దొరలు ప్రకటించారు. దీంతో డబ్బుకు కక్కుర్తి పడే కొందరు స్వదేశీయులు కూడా అహ్మదుల్లాను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.షాజహాన్ పూర్‌కు చేరుకున్న మౌల్వి అహ్మదుల్లా సైన్యంతో ఐదురోజుల పాటు పగలు, రాత్రి పోరు సలిపాడు. బ్రిటీష్ కంపెనీ ఫిరంగులతో పోరు సలపడంతో మౌల్వి సైన్యం పెద్దగా నష్ట పోయింది.మౌల్వి అయోధ్య - రోహిల్‌ఖండ్ సరిహద్దుల్లోని పావయాన్ రాజా జగన్నాథ్‌కు మద్దతుగా బయలు దేరాడు. ఏనుగుపై అహ్మదుల్లా పావయాన్ కోట వైపు వస్తుంటే, బ్రిటీష్ తొత్తు అయిన రాజా జగన్నాథ్ అహ్మదుల్లాపై కాల్పులు ఆరంభించాడు. దీంతో అహ్మదుల్లా గాయపడ్డాడు. దీంతో జాగీర్దార్ మౌల్వి అహ్మదుల్లా తలనరికి, బ్రిటీష్ అధికారులకు క్రూరంగా పళ్లెంలో పెట్టి పంపాడు. బ్రిటీష్ కంపెనీ అధికారులు రాజా జగన్నాధ్‌కు రూ. 50 వేల బహుమతి అందజేశారు. కాగా, రాజా జగన్నాథ్ మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయాడు.