Jump to content

రబ్ నే బనాదీ జోడీ

వికీపీడియా నుండి
రబ్ నే బనా దీ జోడీ
రబ్ నే బనా దీ జోడీ పోస్టరు
దర్శకత్వంఆదిత్య చోప్రా
రచనఆదిత్య చోప్రా
నిర్మాతయష్ రాజ్ ఫిలింస్
తారాగణంషారుఖ్ ఖాన్
అనుష్క శర్మ
వినయ్ పాఠక్
ఛాయాగ్రహణంరవి కె. చంద్రన్
సంగీతంసలీమ్-సులేమాన్
పంపిణీదార్లుయష్ రాజ్ ఫిలింస్
విడుదల తేదీ
12 డిసెంబరు 2008
సినిమా నిడివి
167 ని
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్INR 16 కోట్లు ($3.58 మిలియన్)
బాక్సాఫీసుRs. 86.78 Crores

రబ్ నే బనాదీ జోడీ (Hindi: - रब ने बना दी जोड़ी), అంటే దేవుడు కలిపిన జంట. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందించ బడ్డ ఒక హిందీ హాస్య ప్రేమ కథా చిత్రం. దీని ఉప శీర్షిక తెలుగులో అర్థం ప్రతి సాధారణ జంటలోనూ ఒక అసాధారణ ప్రేమ కథ ఉంటుంది.

అమృత్‌సర్ లోని పంజాబ్ పవర్ లో చిరుద్యోగి అయిన సురిందర్ సాహ్నీ ఒంటరి, సిగ్గరి, మితభాషి, సహృదయుడు. అమృతసర్ జంక్షన్ లో వధూ సమేతంగా రైలు దిగే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. రైలు దిగే సమయంలో ఆసరాకి అందించిన తన చేయిని వధువు (అనుష్క శర్మ) అందుకోకున్నా నొచ్చుకోక, సరిపుచ్చుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇరుగు-పొరుగు నూతన వధూవరులను చూసి గుస గుసలాడుకొంటూండగా తటాలున తలుపులను బిగించేస్తాడు సురిందర్. తనని ఎంతో అభిమానించే ఉపాధ్యాయుని కూతురు తానియా పెళ్ళికి వెళ్ళిన సూరికి ఒక పెద్ద సమస్య ఎదురౌతుంది. స్వతంత్ర ఆలోచనలు ఉన్న తానియాకి తన తండ్రి ఎప్పుడూ పొగుడుతున్న సూరి వ్యక్తిత్వం అంతగా రుచించదు. తమ ప్రేమని పెద్దలతో ఒప్పించిన తానియా పెళ్ళిలో దురదృష్టవ శాత్తూ వరుడు, అతని కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారు. గుండె పోటుతో మరణశయ్య పైనున్న తానియా తండ్రి కూతురిని ఒప్పించి, సూరి చేతిలో పెడతాడు. చేసేది లేక సురిందర్, కన్నీళ్ళతో తానియా ఆ పెళ్ళిని అంగీకరిస్తారు.

తన భార్యని అపురూపంగా చూసుకోవాలనుకొన్న సూరి, తన పడక గదిని తానికి ఇచ్చి తాను మాత్రం సామానులు భద్రపరిచే గదిలో పడుకొంటుంటాడు. తాని అంటే మనసులో ప్రేమ ఉన్నా, దానిని తనతో చెప్పటానికి సంశయిస్తుంటాడు. భార్య స్థానం పై గౌరవమున్న తాని, తన సహధర్మ చారిణిగా మాత్రమే ఉండగలనని, కానీ తనని ఎన్నటికీ ప్రేమించలేనని సూరితో చెబుతుంది. కనీసం తనకు సహధర్మ చారిణిగా ఉండటానికి తానికి అభ్యంతరం లేదు అని తెలుసుకొన్న సూరి తానికి అనుకూలంగానే ప్రవర్తిస్తుంటాడు. తానికి నాట్యం, ప్రేమకథా చిత్రాలు అంటే ఇష్టం ఉండటంతో తరచూ ఇద్దరూ కలిసి సినిమాలకి వెళ్తుంటారు. హీరో చేసే సాహస కృత్యాలు, చెప్పే సంభాషణలని తాని బాగా ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇంటి పట్టునే ఉంటూ ఏమీ పాలుపోని తాని బొంబాయి నుండి వచ్చిన 'డ్యాన్సింగ్ జోడీ' అనే నాట్య శిక్షణా సంస్థలో నాట్యం నేర్చుకోవటానికి సూరి అంగీకారంతో చేరుతుంది.

క్షౌరశాల నడుపుతున్న తన స్నేహితుడు బల్విందర్ (బాబీ) ఖోస్లా (వినయ్ పాఠక్) తో సినిమా హీరోలంటే తానికి బాగా ఇష్టమని, వారిలా తనని మార్చేసి తన ప్రేమని పొందేలా ఏదైనా చేయమని బాబీని ఉద్రేకంగా కోరతాడు సూరి. బాబీ సూరికి కేశాలంకరణ చేస్తాడు. కళ్ళజోడుని మారుస్తాడు. నవతరం యువకులు ధరించే టీ-షర్టు, జీన్స్ ప్యాంటుని ఇస్తాడు. తాని ఇష్టపడే హీరో పాత్ర "రాజ్ కపూర్"గా సూరి తన పేరును మార్చుకొంటాడు. 'డ్యాన్సింగ్ జోడీ' లో విద్యార్థిగా చేరతాడు. కలయో నిజమో వైష్ణవ మాయో అన్నట్టు తానికి సహ నాట్యకారునిగా ఎన్నుకోబడతాడు. ఈ కాలం అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో తెలియని సూరి, తన అత్యుత్సాహంతో మొదట తాని చిరుకోపాలకి గురి అయినా మెల్లగా తానిని మచ్చిక చేసుకోవటంలో సఫలీకృతుడౌతాడు. రక్షా బంధన్ నాడు 'డ్యాన్సింగ్ జోడీ'లోని అమ్మాయిలందరూ తమ సహ నాట్యకారులకి రాఖీలు కట్టటం నచ్చని తాని, సూరిని స్త్రీ పురుషుల మధ్య, సోదర బంధానికే గానీ స్నేహ భావానికి చోటు లేదా అని ప్రశ్నిస్తుంది. సంతోషించిన రాజ్, కొంత కాలం తర్వాత ఆమెకి తన ప్రేమని ప్రకటిస్తాడు. ఈ హఠాత్పరిణామానికి సిద్ధంగా లేని తాని తాను ఇంకొకరి భార్యనని, రాజ్ ప్రేమని అంగీకరించలేని తన నిస్సహాయత తెలుపుతుంది.

తానిలో అంత:స్సంఘర్షణ మొదలవుతుంది. ఒక వైపు ప్రేమ లేని పెళ్ళితో చీకటి మయమైన తన జీవితం, మరొక వైపు చావుబ్రతుకుల్లో ఉన్న తన తండ్రికిచ్చిన మాట. సూరి పరిస్థితి కూడా అంతే. బాధాకరమైన తన భార్య జీవితాన్ని మార్చేయాలని ఆరాటం, రాజ్ ని ఇష్టపడి తానియా వెళ్ళిపోతే, మళ్ళీ తనని పలకరించే ఒంటరితనం. ఒక రోజు రాజ్ వద్దకి వెళ్ళి తన ప్రేమని తాను అంగీకరిస్తున్నానని తాని తెలుపుతుంది. తమ నాట్య ప్రదర్శన పోటీలు జరిగిన తర్వాతి రోజునే తాము పారిపోదామని రాజ్ తానిని ఒప్పిస్తాడు. రాజ్ నే కానీ సూరిని ప్రేమించట్లేదని తెలిసిన బాబీ, తానికి నిజం చెప్పేసి, తనకి ఆమె పట్ల ఉన్న ప్రేమని చెరిపివేయమని సలహా ఇస్తాడు.

నాట్య ప్రదర్శన పోటీలు జరిగే రోజున తానీని (పోటీలో, జీవితంలో) విజయం వరించాలని కోరుతూ సువర్ణ దేవాలయానికి తానితో బాటు వెళ్ళి పూజలు చేయిస్తాడు సూరి. తమ వివాహం భగవంతుని తలంపు అని తాని అక్కడే తెలుసుకొంటుంది. సూరిలో ఉన్న ఉదార మనస్తత్త్వం, అతని నిగర్వి వ్యక్తిత్వంలో ఉన్న గొప్పదనం తానియాకి అప్పుడే అర్థం అవుతాయి. తాము పారిపోదామన్న సలహాని కొట్టి పారేస్తున్నందుకు తనని క్షమించమని, తాను సూరితోనే ఉంటాననీ రాజ్ తో చెప్పటం, తానికి సూరి అంటే ఎంత ప్రేమో తెలుపుతుంది. కన్నీటి పర్యంతమైన రాజ్, నాట్యపోటీకి రాడు. అతను వస్తాడని ఎదురు చూస్తున్న తాని, రాజ్ బదులుగా సూరి సహ నాట్యకారునిగా రావటంతో నిర్ఘాంతపోతుంది. కలిసి చేసే నాట్యంలో సూరి - రాజ్, ఇద్దరూ ఒక్కడే అని తెలుసుకొని, పోటీ జరిగిన తర్వాత సూరి ప్రేమని తాను అంగీకరిస్తున్నాని తెలిపుతుంది. నాట్యపోటీల్లో సూరి-తాని జంటే విజేతలుగా నిలవటం, తానికి జపాన్ అంటే ఇష్టం కావటంతో సూరి అంతకు మునుపే ఒక సుమో వీరునితో తలపడి ఆ దేశ యాత్రకి టిక్కెట్లను గెల్చుకొని ఉండటం, వారు తమ ప్రేమ యాత్రకి బయలుదేరటంతో చిత్రం సుఖాంతమౌతుంది.

విశేషాలు

[మార్చు]
  • సూరిగా షారుఖ్ వేషధారణ. ఫుల్ స్లీవ్స్ చొక్కా, ఫార్మల్ ప్యాంటు, స్పోర్ట్ షూస్, కళ్ళ జోడు, నున్నగా దువ్విన తలతో సగటు మనిషిగా కనిపించటం. అంత అమాయకుడిగా కనిపించిన సూరి, బాబీ చేసిన మేకప్ తో అత్యంత ఆధునికంగా కనిపించి, రెండు పాత్రలలోనూ హాస్యాన్ని పండించటం. సూరిగా, రాజ్ గా షారుఖ్ చిరునవ్వును వేర్వేరు విధాలుగా పలికించటం.
  • "హమ్ హై రాహీ ప్యార్ కే" గీతంలో షారుఖ్ రాజ్ కపూర్, దేవానంద్, షమ్మీ కపూర్ రాజేష్ ఖన్నా, రిషీ కపూర్ లను అనుకరించటం.
  • తాము వెళ్ళిన హిందీ సినిమాలో హీరో, "రాహుల్, నామ్ తో సునా హీ హోగా?" (రాహుల్, నా పేరు మీరు వినే ఉంటారు?) అని అడిగినపుడు తాని సంతోష పడటం. ఇది దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే చిత్రంలో షారుఖ్ సంభాషణ.
  • బాబీగా వినయ్ ఖోస్లా నటన. షారుఖ్ తో సరి సమానంగా వినోదాన్ని పండిస్తుంది.

సంభాషణలు

[మార్చు]
  • భార్యగా తన గౌరవాన్ని మాత్రమే కాపాడగలననీ, తనని ప్రేమించలేననీ తానియా అన్నప్పుడు, ఇస్ సే జ్యాదా ప్యార్ నా హీ హమే ఆదత్ హై, నా హీ జరూరత్ (ఇంత కన్నా ఎక్కువ ప్రేమ నాకు అలవాటూ లేదు, అవసరమూ లేదు) అని సూరి చెబుతాడు.
  • తానియా (తన సహ నర్తకి అయినందుకు) ని రాజ్ తనని "తాని పార్ట్నర్"గా వ్యవహరిస్తుంటాడు. (డ్యాన్స్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కావటం మూలాన).
  • ఈ రోజుకిక సెలవు అని కథానాయిక ముక్తసరిగా చెబితే, అది బాగోలేదని, హమ్ హై రాహీ ప్యార్ కే, ఫిర్ మిలేంగే, చల్తే చల్తే అనాలి అనీ, తానికి ఆ ఊతపదాన్ని రాజ్ వేషంలో సూరి అలవాటు చేస్తాడు. ఈ మూడు మాటలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలు.

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "తుఝ్ మే రబ్ దిఖ్ తా హై"  రూప్ కుమార్ రాథోడ్ 04:44
2. "హౌలే హౌలే"  సుఖ్ విందర్ సింగ్ 04:25
3. "డ్యాన్స్ పె ఛాన్స్"  సునిధి చౌహాన్, లభ్ జంజువా 04:22
4. "ఫిర్ మిలేంగే చల్తే చల్తే"  సోనూ నిగం 06:36
5. "తుఝ్ మే రబ్ దిఖ్తా హై (విషాదం)"  శ్రేయా ఘోషల్ 01:43
6. "డ్యాన్సింగ్ జోడీ"  ఇన్స్ట్రుమెంటల్ 03:59

లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. IANS. "Shah Rukh's Rab Ne Bana Di Jodi sees heavy booking". IBNLive. Archived from the original on 2009-02-08. Retrieved 2008-12-02.