Jump to content

రాజా భగవన్‌దాస్ బాగ్ ప్యాలెస్

వికీపీడియా నుండి
రాజా భగవన్‌దాస్‌ బాగ్‌ ప్యాలెస్‌
సాధారణ సమాచారం
రకంరాజభవనం
నిర్మాణ శైలిమొఘల్, పర్షియన్ శైలి
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది17వ వతాబ్ధం

రాజా భగవన్‌దాస్‌ బాగ్‌ ప్యాలెస్‌, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజభవనం. గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌కి సమీపంలోని తాళ్ళగడ్డ, కార్వాన్‌ ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని బర్మా టేకుతో నిర్మించారు.[1] కేవలం చెక్కతోనే కట్టిన వందల ఏళ్ళనాటి అపరూపమైన కట్టడాలలో ఒకటి మాల్వాల ప్యాలెస్‌ కాగా, రెండోది ఈ భగవన్‌ దాస్‌ ప్యాలెస్‌. వివాదాల కారణంగా 2002 ఆగస్టులో మాల్వాల ప్యాలెస్ కూల్చివేయబడగా, [2] పూర్తిగా చెక్కతో నిర్మించిన రాజభవనాల్లో నగరంలో మిగిలి ఉన్న ఏకైక రాజభవనం ఇది.[3]

చరిత్ర

[మార్చు]

17వ వతాబ్ధంలో మొట్టమొదటి నిజాం పాలనలో 26 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్యాలెస్‌ నిర్మాణం జరిగింది. కుతుబ్ షాహీ రాణిలలో ఒకరికి మహిళల క్వార్టర్స్‌గా ఇది నిర్మించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. భగవన్‌దాస్‌ ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేశాడు. మైసూరు సమీపంలోని శ్రీరంగపట్నంలో ఉన్న దరియా దౌలత్‌బాద్‌ నిర్మాణ శైలిలో దీని నిర్మాణం ఉంది. భగవాన్‌దాస్‌ పూర్వీకులు గుజరాత్‌కు చెందిన గుజరాతీ బనియాలు. వాళ్ళు మొఘలుల వద్ద సివిల్‌ కాంట్రాక్ట్‌లు, ఫారెస్ట్‌ కాంట్రాక్ట్‌లు చేసేవారు. ఔరంగజేబు వద్ద పనిచేసే కమ్రూద్దీన్‌కు వీరికి మంచి సంబంధాలుండేవి. ఔరంగజేబు తర్వాత బీజాపూర్‌ గవర్నర్‌గా ఉన్న కమ్రూద్దీన్‌ స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని 1720లో గోల్కొండకు వచ్చిన సమయంలో వారు కూడా ఇక్కడికి వచ్చి, వజ్రాల వ్యాపారంలో పేరు తెచ్చుకున్నారు. అప్పుడే షావుకారీ కార్వాన్‌లో వీరి కుటుంబం స్థిరపడిపోయింది.

నిర్మాణ శైలీ

[మార్చు]

ఇండో పర్షియన్‌, మొఘల్‌ శైలిలో దీని నిర్మాణం జరిగింది. కడీవర్క్‌, చెక్కమీద అందంగా చెక్కిన నగిషీలు, కిటికీలు ఉన్నాయి. లైమ్‌స్టోన్‌, చింత గింజలు, ఆకులు, కాయలతో చేసిన సహజ రంగులను వినియోగించడంతో ఇప్పటికీ వాటి రంగులు చెక్కుచెదరలేదు. ఈ ప్రాంగణంలో ఉన్న నాలుగు మెట్ల బావుల్లో ప్రస్తుతం ఒక్క బావి మాత్రమే కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో ఒక తోట ఉండేది. అందులో చాలా రకాల పూలచెట్లు, పండ్లచెట్లు ఉండేవి. విశాలమైన పచ్చదనం విస్తరించ ఉన్న ఈ తోటలోని ఆరు నీటిపారుదల బావులు, కందకాల నుండి చెట్లకు నీటిని పంపేవారు.

వారసత్వ హోదా

[మార్చు]

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ రెగ్యులేషన్ 13వ జాబితాలో చేర్చబడిన వారసత్వ ప్రదేశం ఇది. వారసత్వ నిర్మాణం ఉన్న భూమిని ప్రైవేట్ యజమానులు కూల్చివేయడానికి, విక్రయించడానికి అనుమతిలేదు.

పునరుద్ధరణ

[మార్చు]

ఈ దిగ్గజ చారిత్రక రాజభవనం రోజుai గడిచే కొద్దీ క్రమక్రమంగా కూలిపోతోంది. 2021, జనవరి 15న పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఈ ప్యాలెస్ ను సందర్శించి పునరుద్ధరణ చేయాల్సిన సమయం వచ్చిందంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ప్యాలెస్ ఒక ప్రైవేట్ ఆస్తి కాబట్టి, పునరుద్ధరణకు ముందు యజమానులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News, Hyderabad (21 January 2021). "అరుదైన కట్టడాలు.. కాపాడుకుంటేనే పది కాలాలు..." Archived from the original on 2021-09-20. Retrieved 19 September 2021.
  2. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (18 April 2018). "హైదరాబాద్‌ ఘన చరిత్రకు 12 కిటికీల ఈ కోట కూడా భాగమే." andhrajyothy. Archived from the original on 20 September 2021. Retrieved 19 September 2021.
  3. "Renovation of the only surviving historical wooden palace in Hyderabad". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-17. Retrieved 2021-09-20.
  4. The New Indian Express, Hyderabad (16 January 2021). "Revival of Hyderabad's wooden palace on cards". Archived from the original on 25 January 2021. Retrieved 20 September 2021.