రాజా వెంకటప్ప నాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజా వెంకటప్ప నాయకుడు
రాజా
1857లో షోరాపూర్ సాంప్రదాయక చిత్రకళాశైలిలో చిత్రించిన సురపురం సంస్థాన జమీందారు రాజా నల్వాడి వెంకటప్ప నాయకుని ముఖచిత్రం
సంస్థానాధీశుడు
పరిపాలన1853 - 1858[1]
జననం1834
మరణం1858
రాజవంశంసురపురం నాయక వంశం
తండ్రికృష్ణప్ప నాయకుడు[1]
తల్లిఈశ్వరమ్మ[1]
మతంహిందూమతం

నాలుగవ రాజా వెంకటప్ప నాయకుడు లేదా నల్వాడి లక్ష్య (?–1858), ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని, యాద్గిర్ జిల్లాలో ఉన్న సురపుర సంస్థానానికి చివరి పాలకుడు. ఈయన బ్రిటీషు ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని అంగీకరించక, 1857 భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటీషు పాలనపై తిరుగుబాటు చేశాడు.[2] ఈయన దక్షిణాది రాజులను బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా ఏకం చేసి, జట్టు, జామ్‌ఖండీ, ముధోల్, నారాగుండ్, కొప్పళ్ మొదలైన రాజ్యాలతో కలిసి కూటమిని ఏర్పాటుచేశాడు.[3][1]

జీవిత చరిత్ర

[మార్చు]

సురపుర సంస్థానంను బోయ నాయకుల వంశం పరిపాలించేది. ఈ వంశం వారు ఔరంగజేబును సైతం ఎదిరించి పోరాడారు. వెంకటప్ప నాయకుడు తండ్రి కృష్ణప్ప నాయకుడు, ఆయన చిన్నతనంలోనే మరణించగా, బ్రిటీషు ప్రభుత్వం ఫిలిప్ మెడోస్ టైలర్ అనే రచయితను, సంస్థానపు సంరక్షకుడిగా నియమించారు.[4] వెంకటప్ప నాయకుడు ఆంగ్లవిద్యను అభ్యసించాడు. మెడోస్ టైలర్ ఈ విధంగా యువరాజుకు చాలా సన్నిహితుడయ్యాడు. యువ వెంకటప్ప నాయకుడు ఈయన్ను "అప్పా" అని పిలిచేవాడు..

వెంకటప్ప నాయకుడు, 1853లో స్వయంగా పరిపాలన సాగించడం మొదలుపెట్టినప్పుడు, విద్యావంతుడై ఉండి, తనపై బ్రిటీషు పెత్తనం చికాకుగా భావించాడు. పైలాపచ్చీసు వయసులో ఉన్న వెంకటప్ప నాయకుడు, 1857 డిసెంబరులో పీష్వా నానా సాహెబుకు ఒక రాయబారి ద్వారా వర్తమానం పంపించాడు. బ్రిటీషు ప్రభుత్వానికి వెంకటప్ప 1858 ఆగష్టు 8న తిరుగుబాటు చేయటానికి పన్నాగం పన్నుతున్నాడని నివేదికలు అందాయి. అలాగే కొల్హాపూరు, ధార్వాడ్, బెల్గాంలలోని బ్రిటీషు సైనికదళాలను తిరుగుబాటు చేయడానికి ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. బెల్గాం సైన్యంలో ప్రభుత్వ వ్యతిరేకతా బీజాలను నాటడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను 1858, ఫిబ్రవరి 2 న గుర్తించారు. వీరిని వెంకటప్ప, జామ్‌ఖండి రాజా పంపించారని తెలిసింది. 1857లో ఈస్టిండియా కంపెనీ అధికారుల మందలింపులు లెక్కచేయకుండా, తన సేనలో అరబ్బులను, రోహిల్లాలను చేర్చుకున్నాడు. కాప్టెన్ మాల్కం ఒక దళాన్ని సురపురం వద్ద, మరో దళాన్ని సింథనూరు వద్ద నియమించాడు.[ఆధారం చూపాలి]

కాప్టెన్ మాల్కం, యువ జమీందారు వెంకటప్పకు తగిన సలహాలిచ్చి నచ్చజెప్పడానికి కాంప్‌బెల్‌ను పంపించాడు. ఫిబ్రవరి 7న, సురపురం వద్ద ఉన్న బ్రిటీషు సైన్యంపై వెంకటప్ప మనుషులు దాడి చేసి అనేకమంది సైనికులను చంపారు. ఆ తర్వాత రోజు, బ్రిటీషు సురపురం కోటపై దాడిచేశారు. మద్రాసునుండి కల్నల్ హ్యూస్ నేతృత్వంలోని సైన్యాన్ని కూడా రప్పించారు. వెంకటప్ప మనుషులు సురపురం కోటపై దాడిచేసి, అనేకమంది బ్రిటీషు సైనికులను హతమార్చారు.

దగ్గరలో లింగసుగూర్ వద్ద ఉన్న కంటోన్మెంటు (చావని) నుండి అదనపు బలగాలను తెప్పించారు. అయితే పెద్ద బ్రిటీషు సైనికదళాన్ని ఎదుర్కొనేంత శక్తి సురపురం సంస్థానానికి లేదు. సురపురంలో బ్రిటీషువారి గూఢచారి, వాగంగేరి భీంరావు, హైదరాబాదుకు వెళ్ళి మొదటి సాలార్‌జంగ్ సహాయం కోరమని వెంకటప్పకు సలహా ఇచ్చాడు. వెంకటప్ప కోటనుండి తప్పించుకొని హైదరాబాదు చేరాడు. ఆ తర్వాత రోజు భీంరావు కోటతలుపులు తెరిచి బ్రిటీషు సైన్యాన్ని కోట లోపలికి తెచ్చాడు. ఈ విధంగా సురపురాన్ని ఎటువంటి ఘర్షణ లేకుండా ఆధీనంచేసుకున్నారు.

హైదరాబాదులో సాలార్ జంగ్, వెంకటప్పను బంధించి బ్రిటీషు వారి హస్తగతం చేశాడు.[5] ఈయనను న్యాయస్థానంలో ప్రశ్చించి, యావజ్జీవకారగార శిక్ష విధించారు. జైల్లో మెడోస్ టైలర్, వెంకటప్పను కలిసినప్పుడు ఈ విధంగా అన్నాడు:

నాకు జీవించాలని ఆశలేదు. శిక్షపడితే, నేరస్తునిలాగా ఉరితీయవద్దు. ఫిరంగికి ముందుకట్టి వీరమరణం పొందాలి. నేను పిరికివాణ్ణి కాదు.

వెంకటప్పపై చాలా అభిమానమున్న మెడోస్ టైలర్, గవర్నరు జనరల్‌తో మాట్లాడి, యావజ్జీవశిక్షను, నాలుగేళ్ల కారాగారశిక్షగా మార్పించాడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత, తిరిగి సంస్థానాధికారులు పొందేట్టు కూడా ఉత్తర్వు జారీ చేయించాడు. వెంకటప్పను కర్నూలు కోటకు తరలించి అక్కడ తన ఇద్దరు రాణులతో పాటు నిర్భంధించాలని భావించారు. కర్నూలుకు తీసుకెలుతుండగా, ఒక ఉదయం తనకు కాపలా ఉన్న సైనికులు కాలకృత్యాలు తీర్చుకోవటానికి బయటికి వెళ్ళినపుడు, వెంకటప్ప సైనికులు వదిలి వెళ్ళిన రివాల్వరును తీసుకొని, కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణంపై అనేక చర్చలున్నప్పటికీ, కొంతమంది చరిత్రకారులు, వెంకటప్పను ఒక బ్రిటీషు అధికారి వెనుకనుండి పొడిచి చంపి, హైదరాబాదుకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న అంబర్‌పేటలో పూడ్చిపెట్టారని నమ్ముతున్నారు.[5]

అభివృద్ధి పనులు

[మార్చు]

రాజా వెంకటప్ప నాయకుడు అనేక చెరువులు, ఆనకట్టలు, బావులు, నీరందించే స్థలాల నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. సురపురం కోట వద్ద ఉన్న మందాకిని చెరువు, కలువ చెరువు నిర్మాణం ఈయన కాలంలోనే జరిగినది. ఈయన నేల, భూమి సంరక్షణ, అటవీకరణపై తగిన చర్యలు తీసుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 B.R, Gururaja (10 August 2022). "Piety with Beauty". Deccan Herald. Retrieved 20 September 2022.
  2. Karnataka State Gazetteer: Dharwad District (including Gadag and Haveri Districts) (PDF). Office of the Chief Editor, Karnataka Gazetteer. 1993. p. 685.
  3. 3.0 3.1 Seema Purushothaman (2019). Agrarian Change and Urbanization in Southern India. Springer Singapore. p. 217. ISBN 9789811083365.
  4. Chisholm, Hugh, ed. (1911). "Taylor, Philip Meadows" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 26 (11th ed.). Cambridge University Press. p. 472.
  5. 5.0 5.1 Dr. Shivakumar V. Uppe (2022). Brief Cultural History of Basavakalyana. Ashok Yakkaldevi. p. 82. ISBN 9781387847860.