రాజ్ బహదూర్ గౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజ్ బహదూర్ గౌర్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి తరం కమ్యూనిస్టు నేత, కార్మిక సంఘాల నాయకుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపురాలో జన్మించారు. హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రుడైన తొలితరం వైద్యుల్లో ఆయన ఒకరు. నిజాం రాజ్యంలో అప్పట్లో అందరి మాదిరిగానే తప్పనిసరిగానే ఉర్దూ మీడియంలో చదువుకున్న గౌర్, ఉర్దూ సాహిత్యాభిమానిగా మారారు. నిజాం సర్కారు దాష్టీకాలను సహించలేక తిరగబడ్డ యువకులతో చేయి చేయి కలిపి ముందుకు నడిచారు.[2] మగ్దూం మొహియుద్దీన్, జావేద్ రిజ్వీ తదితరులతో కలసి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు. నిజాం సర్కారు ఆ సంస్థను నిషేధించింది. హైదరాబాద్‌లో కమ్యూనిస్టు పార్టీ వేళ్లూనుకోవడంలో కామ్రేడ్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించింది. నిబద్ధత గల కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తెలంగాణ సాయుధ పోరాటంతో సహా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. మగ్దూంతో కలసి పలు కార్మిక సంఘాలను స్థాపించారు. అవన్నీ సంఘటితమై శక్తిమంతమైన ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌గా రూపుదిద్దుకున్నాయి. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌లో దాదాపు 70 వేల మంది సభ్యులు ఉండేవారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఏఐటీయూసీలో విలీనమైంది.[3][4]

రాజ్యసభ సభ్యునిగా[మార్చు]

ఆయన నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడినందున నిజాం పోలీసుల చేతిలో నానా యాతన అనుభవించారు. ఆయన జైలు నుండి తప్పించుకొని అజ్ఞాతంలోకి పోయి రాజకొండ అడవులలో తలదాచుకున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసారు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన తర్వాత కూడా ఆయన జైలులోనే మగ్గాల్సి వచ్చింది. ఈయన జైలులో ఉండగానే 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనను విడుదల చేయాలని రాజ్యసభకు ఎన్నికైన తర్వాత భారత ప్రభుత్వం ఆదేశించింది. 1951లో విడుదలయ్యారు.[5]

ఉర్దూ భాషకు చేసిన సేవలకు గాను 1991లో రాజ్ ‘బహదుర్‌షా జాఫర్’ అవార్డు పొందారు. పురస్కారంతో పాటు పాతికవేల రూపాయలు అందుకున్నారు. అందులో అప్పులు పోగా మిగిలిన పదివేల రూపాయలను మగ్దూం ట్రస్ట్‌కు అందజేశారు. మగ్దూంను తలచుకోని రోజు రాజ్ జీవితంలో లేదు.[6]

మరణం[మార్చు]

ఆయన 2011 అక్టోబరు 7న తుదిశ్వాస విడిచారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]