Jump to content

రాణి శంకరమ్మ

వికీపీడియా నుండి

రాణి శంకరమ్మ ఆందోల్‌ సంస్థానాన్ని (పాపన్నపేట సంస్థానం) పాలించిన మహారాణి. తెలంగాణ వీర వనిత.

ఆందోల్ గడీ ముఖద్వారం

చరిత్ర

[మార్చు]

ఆమె సంగారెడ్డి సమీపంలోని గౌడిచర్లలో సంగారెడ్డి, రాజమ్మ దంపతులకు 1702లో జన్మించింది.[1] వారు శంకరమ్మకు యుక్త వయస్సు వచ్చాక ఆందోల్‌ సంస్థానాన్ని పాలించే రాజు నర్సింహ్మరెడ్డికి ఇచ్చి వివాహం చేసారు. ఆందోల్‌ సంస్థానంలో నమ్మకంగా పనిచేస్తూనే సిద్ధిఖీ సోదురులు రాజుకు వెన్నుపోటుపొడిచి రాజ్యం కైవసం చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారు ఒక రోజు రాజు నర్సింహ్మరెడ్డిపై విష ప్రయోగం చేసి అంతమొందించారు. అయినా రాణి శంకరమ్మ తన నాయకత్వ లక్షణాలతో భర్త మరణానంతరం ఆందోల్‌ సంస్థానాన్ని సుభిక్షంగా పాలించింది. రాణి శంకరమ్మను అప్పటి నైజాం రాజు, మరాఠా పేష్వాల పై యుద్ధం చేయాలని ఆదేశించాడు. ఒకపక్క భర్త నర్సింహ్మరెడ్డి మరణించిన వేదన, మరోపక్క సామంత రాజ్యం అయినా తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి కత్తిదూసింది. ఆరవీరభయంకరంగా ఉండే మరాఠా పేశ్వాలను ఏమాత్రం వెనుకంజ వేయకుండా ధైర్యసహాసాలతో రాణి శంకరమ్మ మట్టికరిపించింది. జయకేతనం ఎగురవేసిన తనను నిజాంరాజు రాయభగీన్‌ అనే బిరుదుతో సత్కరించాడు.[2]

ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునే రాణి శంకరమ్మ తన పేరుతో శంకరంపేట, తండ్రి పేరుతో సంగారెడ్డి తల్లిపేరుతో రాజంపేట, సేనాపతి మీరెల్లి పాపాన్న పేరు మీద పాపన్నపేట గ్రామాలను నిర్మించి రాజ్యాన్ని విస్తరించింది. వయసు మీద పడగానే పాలనా బాధ్యతలు దత్తపుత్రుడు సదాశివరెడ్డికి అప్పగించింది. ఆ రోజుల్లో నిజాం రాజు అలీఖాన్‌ దగ్గర ఆందోల్‌ సంస్థానానికి చెందిన మంత్రి మీరాలం పెత్తనం చెలాయించేవాడు. 1774లో శంకరమ్మ తమ సంస్థానంలో మంత్రి మీరాలం సృష్టిస్తున్న అల్లర్ల గురించి నిజాం రాజుకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి తిరిగివస్తుండగా మంత్రి మీరాలం సైనికులతో ఆమెపై దాడి చేయించి తీవ్రంగా గాయపరిచాడు. అప్పటికే వృద్ధురాలైన శంకరమ్మ మనస్తాపం చెంది కొంత కాలానికి చనిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. "సంగారెడ్డి జిల్లా".
  2. "Warrior: తెలంగాణ వీరవనిత రాణి శంకరమ్మ.. రాయభగీన్‌ బిరుదుతో సత్కరించిన నిజాం | Prabha News". web.archive.org. 2023-03-07. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)