Jump to content

పాపన్నపేట సంస్థానం

వికీపీడియా నుండి
ఆందోల్ గడీ ముఖద్వారం

పాపన్నపేట సంస్థానం, నిజాం పరిపాలన కాలం నాటి హైదరాబాదు రాజ్యంలో ఉండినటువంటి పద్నాలుగు ప్రముఖ సంస్థానాలలో ఒకటి. ఇది చాలా పురాతన సంస్థానం, నిజాం రాజ్యంలోని సంస్థానాల్లోకెల్లా పెద్దది.[1] ఈ సంస్థానాన్ని ఆందోల్ సంస్థానం, మెదక్ సంస్థానం అని కూడా వ్యవహరించబడినది. పాపన్నపేట సంస్థానాన్ని బహుమనీ సుల్తాను ఫిరోజ్ షా కాలంలో స్థాపించినట్లు మెదక్ రాజుల చరిత్ర, వంశవృక్షావళి చెబుతున్నది. అవిభాజిత మెదక్ జిల్లా మొత్తం ఈ సంస్థానంలో భాగంగా ఉండేది. అందువలన ఇది మెదక్ సంస్థానం అని కూడా వ్యవహరించిబడినది. అయితే క్రమేణా క్షీణించి మెదక్ మండలంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమతమైంది. ఈ సంస్థానపు పూర్వ చరిత్ర తెలుసుకోవటానికి సరైన ఆధారవస్తువులు లేవు.[1] మొదక్ పాలకలు తమ సంస్థానంలో సంగారెడ్డి, వెలమకన్నె, రామాయంపేట మొదలైన చోట్ల పెద్ద పెద్ద కోటలు కట్టించారు. ఈ సంస్థానానికి మూలపురుషుడైన రామినేడుకు, 1400 - 1450 కాలంలో, మెదక్‌ ప్రాంతాన్ని పాలిస్తున్న పద్మనాయక రాజుల పతనం తర్వాత, బహుమనీ సుల్తాను తాజుద్దీన్ ఫిరోజ్‌షా కల్పగూరు పరగణాను కానుకగా ఇచ్చాడు.

రాణీ శంకరమ్మ

[మార్చు]

ఈ సంస్థానాన్ని పరిపాలించిన రాయబేగం రాణీ శంకరమ్మ వంశపు పన్నెండవ తరానికి చెందినది.[1] రాణీ శంకరమ్మ భర్త రాజా వేంకట నరసింహారెడ్డి. అందోల్ రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించాడు. ఆందోల్‌ సంస్థానంలో నమ్మకంగా పనిచేస్తూనే సిద్ధిఖీ సోదురులు రాజుకు వెన్నుపోటుపొడిచి రాజ్యం కైవసం చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారు ఒక రోజు రాజు నర్సింహ్మరెడ్డిపై విష ప్రయోగం చేసి అంతమొందించారు. అయినా రాణి శంకరమ్మ తన నాయకత్వ లక్షణాలతో భర్త మరణానంతరం ఆందోల్‌ సంస్థానాన్ని సుభిక్షంగా పాలించింది. రాణి శంకరమ్మను అప్పటి నైజాం రాజు, మరాఠా పేష్వాల పై యుద్ధం చేయాలని ఆదేశించాడు. ఒకపక్క భర్త నర్సింహ్మరెడ్డి మరణించిన వేదన, మరోపక్క సామంత రాజ్యం అయినా తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి కత్తిదూసింది. ఆరవీరభయంకరంగా ఉండే మరాఠా పేశ్వాలను ఏమాత్రం వెనుకంజ వేయకుండా ధైర్యసహాసాలతో రాణి శంకరమ్మ మట్టికరిపించింది. జయకేతనం ఎగురవేసిన తనను నిజాంరాజు రాయభగీన్‌ (ఆడ సింగము వంటి రాణి) అనే బిరుదుతో సత్కరించాడు.[2] రాయె బాగన్ అన్న బిరుదు ప్రజలవాడుకలో రాయబేగంగా మారినది.[1] శంకరమ్మకు మగసంతానం లేనందున దోమకొండ సంస్థానపాలకులైన రాజన్న చౌదరి మనవడు, రంగవ్వ, రాజరాజేశ్వరుల కుమారుడైన సదాశివారెడ్డిని దత్తతుకు తెచ్చుకున్నది. ఈ రంగవ్వ రాణీ శంకరమ్మ చెల్లెలు.

రెండవ సదాశివారెడ్డి

[మార్చు]

సంస్థానాధీశుల్లో రెండవ సదాశివారెడ్డి ప్రముఖమైనవాడు. అనేక జానపదగేయాలు సదాశివారెడ్డి గాథలను సుప్రసిద్ధం చేశాయి. శంకరమ్మ కాలంలో సంస్థానం పూర్వవైభవాన్ని పొందడానికి కృషిచేసింది. పీష్వాలతో యుద్ధం ముగిసి, శాంతి నెలకొనిన తర్వాత ఈమె కాశీయాత్రకు వెళ్ళింది. తిరిగివచ్చేసరికి, సంస్థానంలో కుట్రలు పెరిగి అధికారము కుట్రదారుల చేతుల్లోకి వెళ్ళింది. రాణీ శంకరమ్మ ఈ కుట్రదారులను చంపించి సదాశివారెడ్డికి పట్టంగట్టింది. సదాశివారెడ్డి భార్యలు గద్వాల సంస్థానపు ఆడపడచులు. ఈయన భార్య పార్వతమ్మ వీరపత్నిగా అనేక యుద్ధాలలో భర్తతోపాటు పాల్గొని ఆయన్ను అనేక పర్యాయాలు కాపాడింది. 1795 ప్రాంతంలో నిజాం కుటుంబంలో వారసత్వపోరు వలన జరిగిన ఘర్షణలలో సామంతుడిగా సదాశివారెడ్డి ప్రధాన పాత్రవహించి, నిజాం తనయుని పక్షాన నిలబడి అనేక యుద్ధములలో నిజాం సైన్యాన్ని ఎదురొడ్డి ఓడించాడు. చివరకు మోసముచేత సదాశివారెడ్డి దంపతులను నిజాం బంధించి చంపించినాడు. సదాశివారెడ్డి తమ్ముడు సంగారెడ్డి పటంచెఱువు సంస్థానమునకు పాలకుడుగా ఉన్నాడు. సదాశివారెడ్డి కుమారుడు నరసింహారెడ్డి.[1]

1795లో అలీ ఝా తన తండ్రి నిజాం అలీఖాన్ పై సదాశివారెడ్డి సహాయంతో తిరుగుబాటు చేశాడు. నిజాం అలీఖాన్ ఫ్రెంచి సైనికాధికారి రేమండ్‌ను తిరుగుబాటు అణచడానికి పంపించాడు. నిజాం సైన్యం దండయాత్రకు వచ్చి చిక్రిన్ గ్రామం వద్ద గుడారాలు వేసుకుని ఉన్నారు. సదాశివారెడ్డి తన సైన్యం కంటే ముందుగా ఆ సైనిక స్థావరానికి లొంగిపోవటానికి వెళ్ళాడు. అయితే ఆయన్ను అనుమానంతో దర్బారులో ఉండగా బంధించారు. అదే సమయంలో, ఔరంగాబాదుకు పారిపోయిన అలీ ఝా, తన సైన్యాన్ని మీర్ ఆలంకు అప్పగించి హైదరాబాదుకు తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో మరణించాడు. సదాశివారెడ్డి అలీ ఝాకు సహాయం చేసాడన్న నెపంతో మెదక్ సంస్థానాన్ని రేమండ్‌కు ఇచ్చారు. బ్రిటీషువారు మెదక్‌ను రేమండ్‌కు ఇవ్వటాన్ని నిరసించినా, అది లెక్కచేయకుండా రేమండ్ మెదక్ సంస్థానాన్ని తన అదుపులోకి తీసుకొని సాలీనా పదహార లక్షలు పేష్కరు చెల్లించేట్లు ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం 1798లో రేమండ్ చనిపోయే వరకు కొనసాగింది.[3][4]

వారసత్వ పోరు

[మార్చు]

20వ శతాబ్దపు ప్రారంభంలో ఈ సంస్థానాన్ని రాజా వేంకటదుర్గారెడ్డి సంస్థానాధీశుడిగా ఉన్నాడు. 1900, ఏప్రిల్ 2న[5] ఆయన అకాలమరణంతో సంస్థానం చిక్కుల్లో పడింది. ఆయన మరణించిన తర్వాత సంస్థాన పాలనా బాధ్యత కోర్ట్ ఆఫ్ వార్డ్సు తీసుకున్నది. వేంకటదుర్గారెడ్డి మరణించే సమయానికి ఆయన భార్య రాణీ లక్ష్మాయమ్మకు 16 సంవత్సరాలు. ఆమెకు ఒక సంవత్సరం వయసున్న బాలిక రాణీ శంకరమ్మ. సంస్థాన వారసత్వం దుర్గారెడ్డి కూతురు శంకరమ్మకు పుట్టబోయే మగసంతానానికి చెందాలని, అప్పటి దాకా సంరక్షణ బాధ్యతలు రాణీ లక్ష్మాయమ్మ చూడాలని నిజాం ప్రభుత్వం ఫర్మాను జారీచేసింది.[5] 1909లో రాణీ శంకరమ్మ, రాణీ లక్ష్మాయమ్మ తమ్ముడైన వెంకట ప్రతాపరెడ్డిని పెళ్ళిచేసుకుంది. శంకరమ్మ 1920లో మెజారిటీ వయసుకు (21 సంవత్సరాలు) వచ్చింది. కానీ నిజాం ప్రభుత్వం ఆమెకు సంతానం లేనందున కోర్ట్ ఆఫ్ వార్డ్సు సంరక్షణ తీసివేయలేదు. 1927లో నిజాం ప్రభుత్వం మైనారిటీ తిరిన వారసులున్న అన్ని సంస్థానాలను సంరక్షణనుండి విడుదల చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో, 1928లో శంకరమ్మ భర్త వెంకట ప్రతాపరెడ్డి అనారోగ్యంతో నిస్సంతుగా మరణించాడు. రాణీ లక్ష్మాయమ్మ అప్పుడు ప్రస్తుతానికి సంరక్షణ కొనసాగించాలని నిజాం ప్రభుత్వాన్ని కోరింది. ఇక తమకు సంతానం కలిగే అవకాశం లేదని తల్లీకూతుల్లిద్దరూ దత్తత తీసుకొనే అనుమతిని కోరారు. ఎవరు దత్తత తీసుకొవాలనే విషయంపై తల్లీకూతుళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి.[5] చివరకు రాణీ లక్ష్మాయమ్మ, 1934లో పన్నేండల్ల వయసున్న రామచంద్రారెడ్డిని దత్తతు తీసుకుంది. వ్యాజ్యాలు, ప్రతివ్యాజ్యాలు, అభ్యర్ధనలు, ప్రత్యభ్యర్ధనలు అంతటితో ఆగలేదు. 1947లో రామచంద్రారెడ్డి మైనారిటీ తీరింది కానీ వారసత్వ పోరు ఇంకా కొనసాగుతున్నందున సంస్థాన పాలన కోర్ట్ ఆఫ్ వార్డ్సు చేతిలోనే ఉన్నది. 1948 హైదరాబాదు పోలీసుచర్య తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది.[5]

సంస్థానాధీశులు

[మార్చు]
  1. రామినాయుడు[6]
  2. అల్లమరెడ్డి చౌదరి (1547)[6]
  3. సదాశివారెడ్డి (1632 - 1650) - రామినాయుడు నుండి ఐదవ తరంవాడు. ఆందోల్ రాజధానిగా పాలించాడు.[7]
  4. రాణీ లింగాయమ్మ (1680 - 1692) - సదాశివారెడ్డి కూతురు. సదాశివపేటను నిర్మించింది[8]
  5. రామదుర్గ వెంకట నరసింహారెడ్డి (1720 - 1760)
  6. రాణీ రెండవ లింగాయమ్మ (1760 - 1764)
  7. రాయబగన్ రాణీ శంకరమ్మ (1764 - 1774)
  8. రాజా రెండవ సదాశివారెడ్డి (1774 - 1795) - రాణీ శంకరమ్మ దత్త పుత్రుడు
  9. రాజా వేంకట దుర్గారెడ్డి ( - 1900)
  10. రాణీ వేంకట లక్ష్మాయమ్మ (1900 - ) - నామమాత్రపు సంరక్షురాలిగా పాలించింది
  11. రాజా రామచంద్రారెడ్డి బహదూర్ ( - 1948) - చివరి జమీందారు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 దోణప్ప, తూమాటి (1969). ఆంధ్రసంస్థానములు:సాహిత్యపోషణ. ఆంధ్రవిశ్వకళా పరిషత్తు. pp. 224–227. Retrieved 27 August 2024.
  2. "Warrior: తెలంగాణ వీరవనిత రాణి శంకరమ్మ.. రాయభగీన్‌ బిరుదుతో సత్కరించిన నిజాం | Prabha News". web.archive.org. 2023-03-07. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Chaudhuri, Nani Gopal (1964). British relations with Hyderabad (1798-1843). University of Calcutta. pp. 34–36. Retrieved 1 September 2024.
  4. Regani, Sarojini (1963). Nizam-British Relations, 1724-1857. New Delhi: Concept Publishing Company. pp. 173–175. Retrieved 1 September 2024.
  5. 5.0 5.1 5.2 5.3 "Raja Ram Chandra Reddy & Anr vs Rani Shankaramma & Ors on 11 February, 1956". indiankanoon.org. Supreme Court of India. Retrieved 31 August 2024.
  6. 6.0 6.1 Census of India, 1961, Volume 2. India. Office of the Registrar. 1962. p. 33. Retrieved 1 September 2024.
  7. "Medak or Papannapet Samsthanam". Telangana360.com. Retrieved 1 September 2024.
  8. Avala, Buchi Reddy. "Sadasivapet A unique ancient town". The Hans India. Retrieved 31 August 2024.