రేజింతల్ సిద్ధి వినాయక దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేజింతల్ సిద్ధి వినాయక దేవాలయం
పేరు
స్థానిక పేరు:తెలంగాణ తొలి సిద్ధివినాయక దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సంగారెడ్డి జిల్లా
ప్రదేశం:రేజింతల్, న్యాల్కల్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వినాయకుడు
ప్రధాన పండుగలు:వినాయక జయంతి, వినాయక చవితి
నిర్మాణ శైలి:దేవాలయ నిర్మాణ శైలీ
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1800

రేజింతల్‌ సిద్ధి వినాయక దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామంలో ఉన్న వినాయక దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ‘సిద్ధివినాయక’ దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ దేవాలయంలోని వినాయకుడు, 1800వ సంత్సరంలోలో స్వయంభువుగా వెలిసాడని, ఇక్కడి స్వామి విగ్రహం ప్రతి సంవత్సరం నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతుందని చరిత్రకారుల అభిప్రాయం. గణపతిని దర్శించుకొని దేవాలయంలో ముడుపు కడితే వివాహం జరుగుతుందని, సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.[1]

చరిత్ర[మార్చు]

కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు సుమారు 20కిలో మీటర్ల దూరంలోని చింతల్‌గిరి గ్రామంలోని శివరాంభట్‌ అనే బ్రహ్మణుడు నిత్యం నియమ నిబద్ధతలతో వినాయక, వెంకటేశ్వర స్వాములను పూజిస్తూ సంధ్యావందనం, గాయత్రి జపం వంటి కార్యక్రవూలు చేసేవాడు. 217 సంవత్సరాల క్రితం శివరాంభట్‌ తిరుపతి తీర్థయాత్రకు చింతల్‌గిరి నుంచి రేజింతల్‌ గ్రామశివారు మీదుగా కాలిబాటనే వెళుతుండగా జహీరాబాద్‌ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోని రేజింతల్‌ గ్రామ శివారులోకి రాగానే పూజా సమయం కావడంతో అక్కడే పూజలు నిర్వహించాడు. శివరాంభట్ చేసిన పూజలకు ప్రసన్నుడైన వినాయకుడు, పుష్య శుక్ల చవితి తిథి రోజున స్వయంభువుగా వెలిశారని స్థల పురాణం. భూమిని చీల్చుకుని చిన్నమూర్తి రూపంలో ఉద్భవించాడని ఇక్కడి విజయ గ్రంథం ఆధారంగా తెలుస్తోంది.[2]

విగ్రహం పెరుగుదల[మార్చు]

ఈ సిద్ధి వినాయ విగ్రహంలో ప్రతి సంవత్సరం కొంతమేర పెరుగుదల కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతిష్టాపన సమయంలో రెండున్నర అడుగుల ఎత్తు మూడడుగుల వెడల్పు ఉన్న సిద్ధి వినాయక విగ్రహం, ప్రస్తుతం అయిదున్నర అడుగుల ఎత్తు ఆరడుగుల వెడల్పుతో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడాలేనివిధంగా దేవాలయంలో వినాయకుడి ముఖం దక్షిణం వైపు ఉంది. ఇక్కడి వినాయకుడికి చందన లేపనం చేస్తారు.

ఉత్సవాలు[మార్చు]

ఇక్కడి వినాయకుడిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం వినాయక జయంతి ఉత్సవాలతోపాటు వినాయక చవితి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చిన పుష్య శుక్ల చవితిని పురస్కరించుకుని పుష్య శుద్ధ పాడ్యమి నుంచి ఐదురోజులపాటు జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఈ వేడుకలు సహస్ర మోదకాలతో 451 గణేశ హవనాలూ, శతచండీ హవనం, సపాద లక్ష గణేశ గాయత్రీ హవనాలతో నిర్వహిస్తారు.[3]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-08-31). "తెలంగాణ‌లో స్వయంభువుగా గ‌ణేశుడి ఆల‌యాలు ఇవే." Namasthe Telangana. Archived from the original on 2022-08-31. Retrieved 2022-08-31.
  2. "కోరికలు సిద్ధించే గణపతి". Sakshi. 2016-09-04. Archived from the original on 2022-08-31. Retrieved 2022-08-31.
  3. "ఘనంగా ముగిసిన సిద్ధి వినాయకుని జయంతి ఉత్సవాలు". ETV Bharat News. 2020-01-02. Archived from the original on 2022-08-31. Retrieved 2022-08-31.