రుబ్బురోలు
రుబ్బురోలు నీటిలో నానబెట్టిన లేదా మెత్తటి ఆహార పదార్థాలను పచ్చడి లేదా ముద్ద చేయడానికి ఉపయోగించే సాధనం. దీనిని ఒకే ఒక రాతి ఫలకం నుండి తయారుచేస్తారు. ఇది వేల సంవత్సరాల క్రితంనాటి నుంచి మనిషి నిత్యజీవితంలో కీలక సాధనాంగా మారిపోయిన రాతి పనిముట్టు.
రోకలి ఉపయోగించి పదార్థాలను దంచటం ద్వారా పదార్థాలను కావలసిన రీతిలోకి మార్చడానికి, పొత్రం లేక రుబ్బురాయిని ఉపయోగించి రుబ్బటం ద్వారా అవసరమయిన వస్తువులపై ముఖ్యంగా ఆహార పదార్థములను ఒత్తిడి కలిగించి కావలసిన రీతిలోకి మార్పు చేసుకోవడానికి రోలు ఉపయోగపడుతుంది. రోలు చాలా బరువుగా నిశ్చలంగా ఉంటుంది. దీనిని రాయితో తయారుచేస్తారు. భూమిపై నిశ్చలంగా ఉన్న ఈ రోటిలో అవసరమయిన వస్తువులు వేసి వాటిపై రోకలితో పైకి కిందకి ఆడించడం లేక దంచడం ద్వారా లేదా రోకలిని అటు ఇటు కదుపుతూ నూరటం ద్వారా ఒత్తిడిని కలిగించి వస్తు రూపాన్ని కావలసిన విధంగా మలచుకుంటారు. అలాగే రుబ్బురాయిని గుడ్రంగా తిప్పుతూ లేక అటు ఇటు కదుపుతూ రుబ్బటం ద్వారా వస్తు రూపాన్ని కావలసిన విధంగా మలచుకుంటారు.
ధాన్యాన్ని, బియ్యాన్నేకాక, పప్పుదినుసులను పిండి చేసేందుకు, ఆయుర్వేద మూలికలను నూరేందుకు వీటిని ఉపయోగించేవారు. ఆయుర్వేద వైద్యంలో ఇప్పటికీ విరివిగానే ఉపయోగిస్తున్నారు. రోలు, తిరగలి వాడకం వల్ల శరీరం గట్టిగా ఉండేది. వ్యాయామంలా ఆరోగ్యానికి తోడ్పడేది. ఈ వ్యాయామం వల్ల అరవై ఏళ్లు పైబడినవారూ ఎంతో ఉత్సాహంగా పనులు చేసుకునేవారు.
నేటికీ వివాహ వేడుకలలో వధువును తయారుచేసే సమయంలో, పసుపు కొమ్ములను రోట్లో దంచడం చూస్తుంటాం.
దీని తయారీకి నల్లరాయి రకానికి చెందిన రాళ్లు మాత్రమే వాడతారు. ఒక రోలు తయారు చేయడానికి అడుగున్నర మందం ఉన్న రాయి అవసరం. ఎంత పరిమాణంలో అవసరమో అంతవరకూ సమ్మెట సాయంలో రాయిని బద్దలు కొట్టి, తర్వాత సుత్తి, ఉలి సాయంతో రాయికి ఒక ఆకారాన్ని తెస్తారు. ఇది తయారు చేసేటప్పుడు ఉలి కొట్టే సమయంలో సుత్తి చేతివేళ్లుకు తగిలే ప్రమాదం ఉంది. అలాగే రాయి తుంపర్లు కళ్లకు తగిలితే చూపును శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది. [1]
గ్రైండర్ ప్రవేశంలో రుబ్బురోలు ప్రాముఖ్యత తగ్గిపోయినది. ఆధునికత సంతరించుకున్న జీవన విధానం శారీరక శ్రమను తగ్గించేస్తుంది. మిక్సర్లు, గ్రైండర్ల రూపంలో రాతి పనిముట్ల వినియోగం తగ్గిపోయేట్లు చేస్తున్నాయి.
ప్రమాదాలు
[మార్చు]అనుభవం లేకుండా ఉపయోగించిన చేతివేళ్ళు రోటిలో పడి నలిగిపోతాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- రోలు, రోకలి, తిరగాలి,ఇసురు రాయి
మూలాలు
[మార్చు]- ↑ "రోలు.. తిరగలి.. సన్నికల్లును గుర్తుచేస్తున్నారు! - Prajasakti". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-07.