లామకాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lamakaan (لامکاں)
స్థాపనMarch 2010
రకంCultural center
కార్యస్థానం
  • రోడ్ నెం.1, బంజారా హ్ల్స్, హైదరాబాదు, భారతదేశం
సేవా ప్రాంతాలుహైదరాబాదు
నినాదంDo what you will, with it
జాలగూడుhttp://www.lamakaan.com/

లామకాన్ (English :Lamakaan |Urdu: لامکاں‎) అనేది హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలో జివికే మాల్ ఎందురుగా వున్న ఒక స్వేచ్ఛాయుత సాంస్కృతిక బహిరంగ వేదిక. లాభాపేక్షలేకుండా నిర్వహింపబడుతున్న ఈ సంస్థ వివిధ రకాల సంగీత, సాహిత్య సాంస్కృతిక, నాటక రంగాలు లాంటి వివిధరంగాలకు చెందిన కార్యక్రమాలకు వేదికగా వుంటోంది.బంజారాహిల్స్ రోడ్ నంబర్:1లో వెంగళరావు పార్కు సమీపంలోని జివికే మాల్ కు ఎదురుగా వున్న చిన్నగల్లీలో ఉంది

చరిత్ర

[మార్చు]

లామకాన్ లో కార్యక్రమాల నిర్వహణ మార్చి 2010 నుంచి ప్రారంభం అయినది. దీనిని ప్రారంభించిన వారు అషార్ ఫర్హాన్ (Ashhar Farhan) హుమెరా అహ్మద్ (Humera Ahmed) బిజు మాధ్యూ (Biju Mathew), ఎలాహే హిప్టూల (Elahe Hiptoola) లు

‘లామకాన్’ అంటే ఇల్లు కానిదని అర్థం. ఒకప్పుడు అది ఇల్లే. ఇప్పుడది ఇల్లంటే ఇల్లే కాదు, సకల కళానిలయం. మకాన్ అంటే ఒక కుటుంబానికి పరిమితమైపోతుందని భావించారేమో ఆ ఇంటి యజమాని. అందుకే దానికి ‘లామకాన్’గా నామకరణం చేశారు

‘లామకాన్’ ఒక సాంస్క్రుతిక బహిరంగ వేదిక కాకముందు, అది ఒక నివాసం. అప్పుడు కూడా దానిపేరు లామకానే. లామకాన్ అంటే ఇల్లులేని వారు అని అర్థం. ఇల్లు లేకపోవడం అంటే నిరాశ్రయత కాదు. సర్వవ్యాపిత్వం అని. ఇస్లామ్‌లో అల్లాకు ఉన్న అనేక నామాలలో లామకాన్ కూడా ఒకటి. నిరాకారుడైన దైవం స్థావరుడు కాదు. అన్నిటా ఉండే మహాశక్తి. జంగమతత్వానికి దగ్గరగా కనిపించే అద్భుతమైన భావన అది.లా మకాన్ నిజానికి ఒక కళాకారుడి కలల మకాన్. పెయింటర్, ఫొటోగ్రాఫర్ మొయిద్ హసన్ ఎంతో ముచ్చటగా ఈ ఇల్లు కట్టుకున్నారు. ఆయన సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీ చిత్రాలను కూడా తీసేవారు. మొయిద్ హసన్ జీవించి ఉండగా, ఈ ఇల్లు నిత్యం కళాకారులు, సాహితీవేత్తలతో కళకళలాడుతుండేది. భాగ్యనగరానికి ఆభరణాల వంటి మహాశిలలను ధ్వంసం చేయకుండా, వాటిని గర్భీకరించుకుంటూ, కళాత్మకంగా, నిరాడంబరంగా నిర్మించుకున్న ఆ నివాసం మొయిద్ హసన్‌ది. హైదరాబాదీ శిలా రక్షణ ఉద్యమకారుడు, ఛాయాగ్రాహకుడు, డాక్యుమెంటరీల నిర్మాత, చిత్రకారుడు మొయిద్ హసన్. ఉర్దూ రచయిత్రి జిలానీ బానో సోదరుడు ఆయన. తన తండ్రి స్నేహితుడైన హైదరాబాద్ అద్భుత కవి మగ్దూం మొహియుద్దీన్ ఒడిలో బాల్యకౌమారాలు గడిపిన అదృష్టవంతుడు.

ఉత్తరాది నుంచి దశాబ్దాల కిందట వలసవచ్చిన హసన్ కుటుంబం, హైదరాబాద్‌ను ప్రాణప్రదంగా ప్రేమించింది. మఖ్‌మల్ బట్టలో చుట్టి కుట్టిన ఒక చిన్న హైదరాబాదీ శిలను చూపిస్తూ, అభివృద్ధి చేస్తున్న విధ్వంసం గురించి, జనజీవనంలో వస్తున్న శైథిల్యం గురించి హసన్ వేదనతో మాట్లాడేవారు. నిజాం నిరంకుశ పాలనపై ఆయనకు ఎంతటి వ్యతిరేకతో, హైదరాబాద్ చరిత్రపై, తెహజీబ్ పై ఆయనకు అంత మక్కువ. కర్కోటకుడని పేరుపొందిన ఏడో నిజాం హయాంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదనే విషయం ఆయన చెపుతుండేవారు. వాస్తవాలను కమ్మివేసిన అభిప్రాయాల పొరలను తొలుచుకుని చూడకపోతే చరిత్రను అర్థం చేసుకోవడం కష్టమని హసన్ హెచ్చరిస్తూ వుండేవారు.

సాంస్కృతిక కేంద్రంగా

[మార్చు]

2004లో హసన్ చనిపోయారు ఆ తర్వాత వారి బలమైన ఆకాంక్షలు నిరాకరించలేని గుర్తింపును సాధించుకున్నాయి.ఆయన అభిమతాన్ని గుర్తించిన వారసులు, ఆయన నివసించిన ఇంటిని ఒక ఊరుమ్మడి సాంస్కృతిక వేదికగా మలిచారు. మంచితనాన్ని పంచుకునే ఏ ప్రయత్నానికయినా ఉచితంగా దొరికే వేదిక ‘లామకాన్’. రామ్మోహన్ హోలగుండి ప్రదర్శించిన నాటకాలో, మానవహక్కుల వేదిక ‘సోంపేట’ మీటింగో, కవి శివారెడ్డి కవిత్వాలాపనో, కచేరీలో, ఆటపాటలో బంజారాహిల్స్ రాళ్లలోపల పూలు పూయిస్తున్నట్లు నిర్వహింపబడుతుంటాయి.

అందుబాటులో క్యాంటీన్

[మార్చు]

వేడివేడి చాయ్ సమోసాలు అందుబాటులో వుండటం ఇక్కడి మరో ప్రత్యేకత వీటి మధ్య కొత్త మెహఫిళ్లను తీర్చిదిద్దబడుతున్నట్లుంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లో అన్నీ చౌకగానే దొరుకుతాయి. ఆకలేసినప్పుడు క్యాంటీన్‌లో కూర్చుని, ఏవైనా తింటూ కబుర్లాడుకోవచ్చు.

కేంద్రం అలంకరణల వెనక కారణాలు

[మార్చు]

హసన్ వెలుగునీడల మర్మం తెలిసినవాడేమో, సత్యాసత్యాల మధ్య ఉండే పొరలను విప్పితున్నట్లు తన మనసులోని మాటను ఇలా చెప్పేవారు. ట్యూబ్‌లైట్‌లు నిర్జీవ దీపాలని. నీడలు రాని దీపం వృథా అన్నారు. అందుకే ఆయన ఇంట్లో అన్నీ గుండ్రటి ఫిలమెంట్ బల్బులే వాడేవారు.

సమయం, ప్రవేశం

[మార్చు]

ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకూ సందర్శకులకు వీలుగా తెరిచే వుంటుంది.కళాకారులనే కాదు, ఇక్కడకు ఎవరైనా రావచ్చు, ఇక్కడ వైఫై కూడా ఉచితంగా అందుబాటులో వుంచుతారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లామకాన్&oldid=3981147" నుండి వెలికితీశారు