వయోవృద్ధ పౌరుల నిర్వహణ, రక్షణ , సంక్షేమ చట్టం - 2007
ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, మొదలగు వ్యవస్థలకు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం పెట్టింది పేరు.[ఆధారం చూపాలి] అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది కుటుంబ వ్యవస్థ. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ గతంలో అత్యంత ఉన్నత స్థితిలో వుండేది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యవస్థకు మంచి గుర్తింపు, ఆదరణ ఉండేది.[ఆధారం చూపాలి] ఒకే కుటుంబంలో వందలాది సభ్యులతో అనగా, తాత ముత్తాతలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఇలా సుమారు మూడు తరాల వారు కలిసి ఒకే కుటుంబంగా కలిసి మెలిసి జీవనం సాగించే వారు. అలనాడు- ఉమ్మడి కుటుంబం, కలసి వుంటే కలదు సుఖం, వంటి నానుడులు ఆ సందంర్బంగా పుట్టినవే.
కాలక్రమంలో పాశ్చాత్య కుటుంబ వ్యవస్థ భారతదేశ కుటుంబ వ్యవస్థలో ప్రవేశించి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయి ఎవరికి వారే యమునా తీరే, చిన్న కుటుంబం చింత లేని కుటుంబం వంటి నానుడులకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ క్రమంలో ఉమ్మడి కుటుంబంలో తమ అనుభవంతో, అంతవరకు పెద్దరికం వహించిన వయోవృద్ధులు, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై వీధిన పడ్డారు. అంతవరకు కుటుంబానికి నాయకత్వం వహించి అన్ని విషయాలలో తమ అనుభవాన్ని, నేర్పునూ మిళితం చేసి తమ కుటుంబాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఈ పెద్దలు, వార్థక్యంలో జవసత్వాలుడిగి, సంపాదించే శక్తి లేకపోవడంతో, మిగతా కుటుంబ సభ్యులకు భారంగా అనిపించారు. [అభిప్రాయం కదూ? ] వారి పోషణ తమకు భారమని తలచిన కుటుంబ సభ్యులు ఇంటినుండి గెంటివేయడం చేతనో, లేదా ఈ వృద్దులు తమంతట తామే కుటుంబం నుండి బయటికి వచ్చేయడమో జరిగి వారు రోడ్డున పడే పరిస్థితులు కలిగి నిరాదరణకు గురవుతున్నారు. కొంత మంది వృద్ధులు ఈ వయస్సులో అన్ని జవసత్వాలుడిది ఏమి చేయలేక, తాము ఎలాగైనా రాలిపోయే వారమే గదా అని, తమ పిల్లలైనా బాగుంటే చాలుననుకునే ఉదాత్త భావంతో ఇతర కుటుంబ సభ్యులు ఎంత నిరాధరణకు గురి చేసినా విధిలేని పరిస్థితుల్లో భరిస్తూ చావలేక బ్రతకలేక కాలంవెళ్ళదీస్తున్నారు. ఈ వయో వృద్ధులు తమ జీవిత కాలంలో ఎంత సంపాదించినా వారి పిల్లలు, ఆ ఆస్తినంతా తమ పేరున బలవంతంగా వ్రాయించుకొని దిక్కులేని వారిని చేసి ఇంటినుండి బయటికి గెంటివేస్తున్నారు.[అభిప్రాయం కదూ? ]
సమాజంలో మనసున్న మనుషులు కొంతమంది అలాంటి దిక్కులేని వయోవృద్ధులను చేరదీసి వారి పోషణను తమ బాధ్యతగా తీసుకొని వారి చరమ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి స్వచ్ఛందంగా దోహదపడుతున్నారు. ఇలాంటి స్వచ్ఛంద సేవకులు ఎందరుంటే రోడ్డున పడ్డ వయోవృద్ధులందరిని ఆదుకోగలరు? అందుకే భారత ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రమైన సామాజిక రుగ్మతగా భావించి ప్రభుత్వం తరపున "తల్లితండ్రులు, వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ, సంక్షేమ చట్టం 2007" అనే చట్టాన్ని తీసుకొచ్చింది.[1] ఈ చట్టం చాల సమగ్రంగా, విధిలేక రోడ్డున పడ్డ వయోవృద్దులకు వరంగా, జవ సత్వాలుడిగి, వృద్ధులైన తమ తల్లిదండ్రులను స్వార్థబుద్ధితో నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదికి గెంటివేసే ప్రబుద్ధులకు చెంపపెట్టుగా, వారి ఈ దుశ్చర్యలకు తగిన శిక్ష పడే విధంగా ఈ చట్టాన్ని రూపొందించింది. ప్రభుత్వం చేసిన ఈ చట్టం ఎంతటి మహోన్నత మైనదైనా, వయో వృద్ధులకు వరదాయిని ఐనా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన మనుషులకు, మనసులకు, మానవీయతకు అత్యంత విలువనిచ్చే పుణ్యభూమి అయిన ఈ భారతదేశంలో ఇటువంటి చట్టం చేయడానికి దోహద పడిన పరిస్థితులు ఏర్పడడం ఎంత శోచనీయం?[అభిప్రాయం కదూ? ]
చట్టం లోని వివరాలు
[మార్చు]ఇందులకు నిర్దేశించబడిన అంశాల కొరకు ఈ "తల్లిదండ్రుల, వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ, సంక్షేమ చట్టం - 2007" చట్టాన్ని భారతప్రభుత్వం పార్లమెంటు ద్వారా ఆమోదించింది.[2]
నిర్వచనాలు
[మార్చు]- "తల్లి లేదా తండ్రి” అనగా వయోవృద్ధ పౌరులైనను లేక కాకున్నను తండ్రి లేదా తల్లి అది జన్యుపరమైనను, దత్తతపరమైనను లేక మారు తండ్రి లేదా సందర్భానుసారం సవతి తల్లి అని అర్ధము.
- “వయోవృద్ధ పౌరుడు” అనగా భారతదేశ పౌరుడై ఉండి, అరువది సంవత్సరములు లేదా అంతకు పైబడిన వయస్సు కలిగిన ఎవరేని వ్యక్తి అని అర్ధము.
- "సంతానము” అను పదములో కుమారుడు, కుమార్తె, మనుమడు , మనుమరాలు చేరి ఉండును. అయితే మైనరు చేరి ఉండరు.
- “బంధువు” అనగా సంతానములేని వయోవృద్ధ పౌరుల ఎవరేని శాసనిక వారసుడు అని అర్ధము. అతడు మైనరు కాకూడదు , వారి మరణము తరువాత వారి ఆస్తిని స్వాధీనములో నుంచుకొను లేదా వారసత్వము కలిగియున్నవాడై ఉండవలెను.
- “భరణ పోషణ” అను పదములో ఆహారము, దుస్తులు, నివాసము, వైద్య సదుపాయము , చికిత్సకు సంబంధించిన ఏర్పాటు చేరి ఉండును.
- “సంక్షేమము” అనగా వయోవృద్ధ పౌరులకు అవసరమైన ఆహారము, ఆరోగ్య రక్షణ, వినోద కేంద్రములు , ఇతర సౌకర్యములను సమకూర్చుట అని అర్ధము.
మూలాలు
[మార్చు]- ↑ "భారత రాజపత్రము" (PDF). లెజిస్లేటివ్, భారత ప్రభుత్వం. Archived (PDF) from the original on 2021-04-29. Retrieved 2021-04-29.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2021-09-22. Retrieved 2022-06-19.