వాడుకరి:Chaduvari/వికీపీడియా అంటే..
వికీపీడియా గురించి 2005 అక్టోబరు 21 న రాసిన వ్యాసం ఇది. ఈ పాఠ్యాన్ని ఇతర వ్యాసాల్లో వాడారు.
వికీపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. అనేక భాషల్లో వికీపీడియా నిర్మితమౌతోంది. తెలుగు వికీపీడియాను ముద్దుగా తెవికీ అని కూడా అంటారు. వికీపీడియా మనందరిదీ. ఇక్కడ ఎవరైనా రాయవచ్చు, ఇతరులు రాసిన దాన్ని సరిదిద్దవచ్చు. అలాగే మీరు రాసిన దాన్ని ఇతరులు సరిదిద్దుతారు. ఇక్కడ అందరూ సమానమే! సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అయితే నిర్వహణా పరమైన కొన్ని పనులు చేసేందుకు గాను, కొందరు నిర్వాహకులు ఉంటారు. అనుభవశాలురైన సభ్యులే నిర్వాహకులుగా నియమితులతారు. వీరిని ఎన్నుకునేది కూడా తోటి సభ్యులే! వికీపీడియాలోని ముఖ్యాంశాల గురించి మీరీ పేజీలో చూడవచ్చు.
కొత్తవారికి
[మార్చు]కొత్త సభ్యుడు: వికీపీడియా అంతా గందరగోళంగా ఉంది. నేనూ ఇక్కడ రాయాలంటే ఏం చెయ్యాలి, ఎలా రాయాలి?:
వికీపీడియను: నిజమే, కొత్తలో వికీపీడియా కొంత గందరగోళంగానే ఉంటుంది. (పాతబడ్డాక కూడా కొత్త కొత్తగానే ఉంటుంది) ఈ గందరగోళంలోంచి దారి చూసుకుని ముందుకు పోయేందుకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాను. అటూ ఇటూ చూడకుండా కింది లింకులను పట్టుకుని వెళ్ళి పోండంతే!
- ముందుగా కొన్ని వ్యాసాలను చదవండి. ఆ వ్యాసాల ఆకృతిని పరిశీలించండి. ఎలా మొదలుపెడుతున్నారు (ఉపోద్ఘాతంతో), ఎలా ముగిస్తున్నారు (మూలాలు వనరులతో) వగైరాలను గమనించండి. ఉదాహరణకు ఈ వ్యాసాలు చూడండి: కలివికోడి, పొందూరు, మంచుమనిషి, మానవ పరిణామం, యోగా, ఛందస్సు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఈ వ్యాసాల్లో తప్పులేమైనా ఉన్నాయేమో గమనించండి. తప్పులు సరిదిద్దవచ్చు. అది మీ హక్కు అని మీకు చెబుతున్నాను. త్వరలోనే అది మీ బాధ్యత అని తెలుసుకుంటారు. అయితే, దిద్దుబాట్లు చెయ్యబోయే ముందు...
- వికీలో ఓ ఖాతా సృష్టించుకోండి: పేజీకి పైన కుడిపక్కన ఉన్న లింకును చూడండి, ఇక సృష్టించుకోండి.
- ..కున్నాక, లాగినవండి
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోండి. మీరు ఇంగ్లీషులో టైపు చేసుకుంటూ పోతుంటే, వికీపీడియా తెలుగులోకి మార్చుకుంటూ పోతుంది.
- లాగినయ్యాక, పేజీకి పైన, కుడివైపున ఉన్న మీ పేరును నొక్కితే మీ వాడుకరి పేజీకి వెళ్తారు. అక్కడ వికీకి సంబంధించినంత వరకూ మీగురించి క్లుప్తంగా రాసుకోవచ్చు
- ఆ లింకు పక్కన ప్రయోగశాల అనే లింకు కుడా ఉంటుంది. ఆ పేజీలో మీకు కావలసిన ప్రయోగాలు చేసుకోవచ్చు.
- అక్కడ తెలుగులో రాయడం సాధన చెయ్యండి. రాయడానికి అలవాటు పడ్డాక, ఇక మొదలుపెట్టండి.
- ముందుగా..
- మీ ఊరి పేరుతో వెదకండి. (వెదకడానికి పేజీలో పైన కుడిపక్కన వెతుకుపెట్టె ఉంటుంది, చూడండి.) నాకు తెలిసి మీ ఊరి పేరిట పేజీ ఉండే ఉంటుంది; లేకపోయే అవకాశం పది శాతం కూడా లేదు. ఆ పేజీలో ఉన్న సమాచారాన్ని చదవండి. కొత్త సమాచారాన్ని చేర్చాలని అనిపిస్తే చేర్చెయ్యండి, వెనకాడకండి. తప్పు జరుగుతుందేమోనని భయపడకండి. తప్పులను సరిచేసుకుందాం. కానీ ఏకంగా సమాచారమే తప్పు కాకుండా చూసుకోండి.
- పేజీకి ఎడమవైపున ఉన్న లింకులను చూసారా? కొన్ని లింకులను గురించి చెబుతా నిక్కడ:
- వికీపీడియాలో ఏ పని ఎలా చెయ్యాలో సహాయసూచిక చెబుతుంది.
- వికీపీడియాలో ఏం జరుగుతోందో ఇటీవలి మార్పులు చెబుతుంది.
- వికీపీడియాలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చర్చించవచ్చు రచ్చబండ లో.
- వ్యాసాల్లో వ్యావహారిక భాష వాడాలి. శిష్ట వ్యావహారికం వాడరాదు. సరళ గ్రాంథికం, శిష్ట గ్రాంథికం అసలే కుదరదు. కొన్ని ఉదాహరణలిక్కడ. ఈనాడు, ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, నవతెలంగాణ, ఆంధ్రప్రభ లాంటి ప్రామాణిక దినపత్రికలు ఎలా రాస్తున్నాయో చూడండి. వాటిని అనుసరించండి.
ఏం వాడకూడదు | ఏం వాడాలి |
---|---|
వచ్చెను | వచ్చాడు, వచ్చారు, వచ్చింది |
మూలము | మూలం |
కలదు, కలవు | ఉంది, ఉన్నాయి |
కారణములు కలవు | కారణాలున్నాయి / కారణాలు ఉన్నాయి |
గమనిస్తూ ఉండాల్సినవి
[మార్చు]- పేజీ నుండి బయటికి పోయే లింకులు
- అగాధ పేజీలు
- బాగా తక్కువ అంతర్గత లింకులున్న పేజీలు
- పేజీకి వచ్చే (ఇన్‌కమింగ్) లింకులు: అనాథ పేజీలు
- పేజీ సైజు: మొలకలు
- మూలాలు: మూలాల్లో దోషాలున్న పేజీలు
ఎడమవైపున ఉండే లింకులు
[మార్చు]ఈ పేజీకి ఎడమ పక్కన గల మార్గదర్శకము, అన్వేషణ, పరికరాల పెట్టె లను చూడండి. వికీపీడియాలోని ఏ పేజీకి వెళ్ళినా మీకు ఈ లింకులు కనిపిస్తాయి. వీటి గురించి చూద్దాం:
మార్గదర్శకము
[మార్చు]ఇందులో కింది లింకులు ఉంటాయి.
- మొదటి పేజీ
- వికీపీడియా మొదటిపేజీకి లింకు ఇది.
- సముదాయ పందిరి
- వికీపీడియాలో ప్రస్తుతం ఏమేం పనులు జరుగుతున్నాయి, ఏమేం చెయ్యాలని అనుకుంటున్నారు ఇలాంటి విషయాలకు సంబంధించిన విశేషాలు ఇక్కడ చూడవచ్చు.
- ప్రస్తుత ఘటనలు
- జరుగుతున్న చరిత్ర లోని విశేషాల సమాహారం ఇది.
- ఇటీవలి మార్పులు
- ఈ మధ్య కాలంలో వికీపీడియాలో జరిగిన అన్ని మార్పులను చూపించే జాబితా ఇది.
- యాదృచ్ఛిక పేజీ
- ఈ లింకును నొక్కినపుడు వికీపీడియా ఏదో ఒక పేజీని ఎంపిక చేసి మీకు చూపిస్తుంది.
- సహాయము
- వికీపీడియాకు సంబంధించి మీకు ఏమైనా సహాయం అవసరమైతే ఈ లింకును నొక్కి తెలుసుకోవచ్చు.
- విరాళములు
- వికీపీడియా పూర్తిగా ప్రజల విరాళాల పైనే ఆధారపడుతుంది. విరాళం ఇవ్వదలచిన వారు ఈ లింకు నొక్కి, అక్కడి సూచనలను అనుసరించి తమ విరాళాన్ని ఇవ్వవచ్చు.
అన్వేషణ
[మార్చు]అన్వేషణ పెట్టె కింద రెండు మీటలున్నాయి: వెళ్ళు, అన్వేషణ. వెళ్ళు నొక్కినపుడు, మీరు అన్వేషణ పెట్టెలో రాసిన పదాలతో ఏదైనా పేజీ ఉంటే నేరుగా ఆ పేజీని తెరచి చూపిస్తుంది. లేకపోతే లేదని చూపిస్తుంది. అన్వేషణ నొక్కినపుడు, పెట్టెలో రాసిన పదాలు కలిగిన అన్ని పేజీల జాబితాను చూపిస్తుంది.
పరికరాల పెట్టె
[మార్చు]వ్యాసాలలో రచనలు చెయ్యడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసేందుకుగాను అవసరమైన పరికరాలను ఈ పెట్టెలో పొందుపరచాము.
- ఇక్కడికి లింకున్న పేజీలు
- ఈ లింకును నొక్కినపుడు ప్రస్తుత పేజీకి లింకులు కలిగిన వికీపీడియాలోని ఇతర పేజీల జాబితాను చూపిస్తుంది.
- సంబంధిత మార్పులు
- ఈ లింకు నొక్కినపుడు ఈ పేజీకి సంబంధించిన పేజీల్లో ఇటీవల జరిగిన మార్పుల జాబితాను చూపిస్తుంది.
- ఫైలు లోడింగ్
- బొమ్మల లాంటి ఫైళ్ళను అప్‌లోడు చేసేందుకు అవసరమైన సాధనం ఇది.
- ప్రత్యేక పేజీలు
- వికీపీడియాలో వ్యాసం పేజీలు కాక, అనేక ఇతర రకాల పేజీలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేక పేజీలు ఒకటి. ఈ లింకును నొక్కినపుడు అన్ని ప్రత్యేక పేజీల జాబితాను చూడొచ్చు.
- ముద్రణా వెర్షన్
- ఈ లింకును నొక్కినపుడు, ప్రస్తుత సదరు పేజీని ముద్రించుకునేందుకు వీలైన కూర్పును చూపిస్తుంది.
- శాశ్వత లింకు
- వికీపీడియాలోని వ్యాసాలను మీరు ఇతర చోట్ల (వికీపీడియాకు బయట) యథేచ్ఛగా ఉదహరించవచ్చు. అయితే మీరు ఉదహరించిన తరువాత, సదరు వ్యాసంలో మార్పులు చేర్పులు జరగవచ్చు. మీరు ఉదహరించిన విషయం మారిపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఉదహరించిన విషయానికి ప్రస్తుతం ఉన్న కూర్పుకూ పొంతన ఉండకుండా పోవచ్చు. దీన్ని నివారించేందుకు ఈ "శాశ్వత లింకు" సౌకర్యాన్ని కల్పించాము. దీన్ని నొక్కినపుడు పేజీ URL కు ఒక సంకేతం చేరుతుంది. వికీపీడియా బయట మీరు చేసే రచనలో మీరు ఈ URL నే ఉదహరిస్తారు. మీ పాఠకులు దాన్ని నొక్కినపుడు వారికి పూర్వపు కూర్పే కనపడుతుంది తప్ప, కొత్తగా చేరిన మార్పులు కనపడవు.
- Cite this article
- వికీపీడియాకు బయట వ్యాసాలను ఉదహరించే వివిధ పద్ధతులను ఈ లింకు వివరిస్తుంది.
ఇతర భాషలు
[మార్చు]కొన్ని పేజీల్లో ఈ లింకులు కూడా కనిపిస్తాయి. ఇతర భాషల్లో ఇదే వ్యాసానికి గల లింకులను ఇక్కడ చూడవచ్చు.
పేజీ గురించి
[మార్చు]వికీపీడియాలో ఒక్కో వ్యాసం ఒక్కో పేజీలో ఉంటుంది. కొన్ని పెద్ద వ్యాసాలను ఒకటి కంటే ఎక్కువ పేజీలుగా విభజించవచ్చు. మీరు ప్రస్తుతం చూస్తున్న ఈ పేజీని గమనించండి..
పేజీకి అన్నిటి కంటే పైన: మీరు లాగిన్ అయి ఉంటే మీ పేరు, చర్చ, అభిరుచులు, వీక్షణ జాబితా, మీ మార్పులు చేర్పులు, నిష్క్రమణ లింకులు ఉంటాయి. ఈ లింకులన్నిటినీ కలిపి, మీ ఎకౌంటు సమాచారం గా భావించవచ్చు. నా గురించి చర్చ లింకు ద్వారా మీతో ఇతరులు చేసిన చర్చ పేజీకి వెళ్ళవచ్చు. మీరు లాగిన్ అవకపోతే, లాగిన్ అవండి లేదా ఎకౌంటు సృష్టించుకోండి అనే లింకు వస్తుంది.
దానికి దిగువన పేజీలోని వ్యాసం మొదలవుతుంది. పేజీకి పై అంచున ఉన్న టాబులను చూడండి. ఈ పేజీలోని వ్యాసానికి సంబంధించి మీరు ఏమేం పనులు చెయ్యవచ్చో అక్కడి లింకులు సూచిస్తాయి. అక్కడ ఉన్న టాబుల వివరాలివి:
వ్యాసము: మీరు ప్రస్తుతం ఈ టాబులోనే ఉన్నారు. ఇక్కడ విషయానికి సంబంధించిన వ్యాసం ఉంటుంది. వ్యాస విషయానికే ఇక్కడ ప్రాధాన్యత. వ్యాసం గురించిన మీ అభిప్రాయాలు ఇక్కడ రాయరాదు. సభ్యుల పేర్లు, ఇతర వివరాలు ఇక్కడ రాయరాదు. ఇతరులను సంబోదిస్తూ రాయడం కూడా ఈ పేజీలో నిషిద్ధం. వ్యాసంలో ఏదేని విషయం తప్పని మీకు నిర్ధారణగా తెలిస్తే, నిర్మొహమాటంగా దాన్ని సరిదిద్దండి.
చర్చ: ఈ వ్యాసానికి సంబంధించి, సభ్యుల అభిప్రాయాలు, వాదనను ఇక్కడ చూడవచ్చు. వ్యాసంలో ఏదేని విషయం తప్పని మీకు అనిపిస్తే, అది ఖచ్చితంగా తప్పేనని మిరు నిర్ధారించుకోలేకపోతే, ఆ విషయాన్ని ఈ చర్చా పేజీలో రాయవచ్చు. ఈ చర్చ వ్యాస విషయానికి సంబంధించిన చర్చమాత్రమే, ఇక్కడ వ్యక్తిగత చర్చలు కూడవు.
మార్చు: తరువాతి టాబు - మార్చు. వ్యాసంలోగానీ, చర్చలో గానీ ఏదైనా రాయదలిస్తే ఈ టాబును నొక్కాలి. రచన చేసేందుకు వీలుగా మీకో ఎడిట్ బాక్సు కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని ఆ ఎడిట్ బాక్సులో చూడవచ్చు. మీరు చెయ్యదలచిన మార్పులు, చేర్పులు చేసి భద్రపరచగానే, ఆ మార్పులు సంబంధిత (వ్యాసం లేదా చర్చ) పేజీలో కనిపిస్తాయి. మార్చు టాబుకు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీని మారుస్తున్నారా, లేక చర్చ పేజీని మారుస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత టాబులు తెరుచుకుని ఉంటాయి, గమనించండి.
చరితం: ఇక తరువాతది చరితం. వ్యాసం పేజీలోగానీ, చర్చా పేజీలో గాని ఇప్పటి వరకు జరిగిన మార్పు చేర్పుల జాబితా ఇది.ఎవరెవరు, ఏయే మార్పులు, ఎప్పుడెప్పుడు చేసారో తెలిపే చక్కటి జాబితా ఇది. చరితం టాబుకు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీ చరితం చూస్తున్నారా, లేక చర్చ పేజీ చరితం చూస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత టాబులు తెరుచుకుని ఉంటాయి, గమనించండి.
తరలించు: తరువాతి టాబు, తరలించు. వ్యాసంలో మార్పులు చెయ్యాలనిపిస్తే ఎలా మార్పులు చెయ్యాలో చూసాం. కానీ వ్యాసం పేరు తప్పైతే, దాన్ని మార్చడం ఎలా? వ్యాసం పేరు అంటే పేజీ పేరు. అంటే పేజీ పేరును మార్చాలన్నమాట! దానికి వీలు కల్పించేదే ఈ తరలించు. దీన్ని నొక్కినపుడు, ఈ పేజీని ఏ పేజీకి తరలించాలో అడుగుతూ ఒక పెట్టె కనబడుతుంది. ఆ పెట్టెలో కొత్త పేజీ పేరు రాసి మీటను నొక్కగానే వ్యాసం కొత్త పేజీకి తరలిపోతుంది. వ్యాసం పేరు కూడా ఆటోమాటిగ్గా మారిపోతుంది.
వీక్షించు/వీక్షించవద్దు: ఇక చివరి టాబు - వీక్షించు లేదా వీక్షించవద్దు. ఒకసారి నొక్కితే వీక్షించు అవుతుంది, మరోసారి నొక్కితే వీక్షించవద్దు అవుతుంది. వీక్షించేటపుడు ఆ పేజీలో జరిగిన మార్పులు జరిగిఉంటే, ఇటీవలి మార్పులు లో ఆ పేజీ పేరు బొద్దు అక్షరాలతో కనిపిస్తుంది. వద్దనుకుంటే మామూలుగా కనపడుతుంది.
నేం స్పేసులు
[మార్చు]- ఈ నేంస్పేసులేంటి?
- వికీపీడియా అనేది ప్రజలే స్వయంగా తయారుచేస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వం. ఈ బృహత్తర కార్యంలో ఎవరైనా పాల్గొనవచ్చు. సార్వజనీనమైన ఈ పనిలో సాఫ్ట్‌వేరు గురించి ఏమాత్రం తెలీనివారు కూడా పాలుపంచుకుంటారు. కాబట్టి, వికీపీడియా అనేది ఎవరైనా తేలికగా పనిచెయ్యగలిగేలా ఉండాలి. ఈ సౌలభ్యాన్ని సాధించేందుకు వికీపీడియాను అనేక విభాగాలుగా విభజించారు. ఆ విభాగాలే నేంస్పేసులు. పేజీ పేరుకు ముందు ఈ నేం స్పేసు వస్తుంది. ఉదాహరణకు Wikipedia:5 నిముషాల్లో వికీ అనే పేజీలో Wikipedia అనేది నేం స్పేసు పేరు. ఏ నేం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన సర్వస్వం వ్యాసమని అర్థం, అవి మొదటి నేం స్పేసుకు చెందుతాయి. వికీపీడియాలో కింది నేంస్పేసులు ఉన్నాయి.
- మొదటి: వికీపీడియాలోని విజ్ఞాన సర్వస్వం పేజీలన్నీ ఇందులో ఉంటాయి. పేజీ పేరుకు ముందు ఏమీ ఉండదు.., పదం పేరే పేజీ పేరవుతుంది.
- చర్చ: పై పేజీలకు సంబంధించిన చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
- సభ్యుడు: సభ్యుల స్వంత పేజీలు ఇందులో ఉంటాయి. సభ్యులు తమ వివరాలను ఇక్కడే రాసుకుంటారు.
- సభ్యునిపై చర్చ: సభ్యులకు సంబంధించిన చర్చా పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి.
- Wikipedia: వికీపీడియా అంతర్గత విషయాల కోసం ఈ నేంస్పేసు ప్రత్యేకించబడింది.
- Wikipedia చర్చ: వికీపీడియా అంతర్గత విషయాలపై చర్చ కోసమిది.
- బొమ్మ: ఈ నేంస్పేసులో బొమ్మలు ఉంటాయి.
- బొమ్మపై చర్చ: బొమ్మల పేజీలపై చర్చా పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి.
- మీడియావికీ: వికీపీడియాను నడిపించే సాఫ్టువేరు మీడియావికీ. దీనికి సంబంధించిన పేజీలు ఈ నేం స్పేసులో ఉంటాయి
- మీడియావికీ చర్చ: మీడియావికీ పేజీలపై చర్చా పేజీలు ఈ నేం స్పేసులో ఉంటాయి.
- ప్రత్యేక: కొన్ని ప్రత్యేక పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి. ఈ పేజీలను సభ్యులు సృష్టించేవి కావు.. సాఫ్ట్‌వేరే వీటిని సృష్టిస్తుంది.
- మూస: మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకొనగల మూసలను ఈ నేంస్పేసులో తయారు చెయ్యాలి.
- మూస చర్చ: మూసలకు సంబంధించిన చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
- సహాయము: వికీపీడియాలో పనిచెయ్యడం ఎలా అనే విషయమై సహాయం పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి
- సహాయము చర్చ: సహాయం పేజీలపై చర్చ పేజీలు ఇందులో ఉంటాయి.
- వర్గం: వికీపీడియాలోని పేజీలను అనేక వర్గాలుగా విభజించాము. ఒక్కో పేజీ ఒకటి లేదా అంతకంటే వర్గాలకు చెందవచ్చు. ఈ వర్గాల పేజీలు ఇక్కడ ఉంటాయి
- వర్గం చర్చ:వర్గాల చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
ఎలా రాయాలి
[మార్చు]తెలుగు వికీపీడియాలో తెలుగులో మాత్రమే రాయాలి. తెలుగులో రాసేందుకు అవసరమైన సమాచారం కొరకు, Wikipedia:Setting up your browser for Indic scripts పేజీని చూడండి.
దిద్దుబాటు విధానం
[మార్చు]ఇప్పటికే ఉన్న వ్యాసంలో మార్పు చేర్పులు చెయ్యాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకటి, పైనున్న టాబుల్లోని మార్చు లింకును నొక్కడం. ఈ పద్ధతిలో మొత్తం వ్యాసమంతా మార్పుకు సిద్ధమౌతుంది. రెండో పద్ధతి.. వ్యాసంలోని ఏదో ఒక విభాగాన్ని మాత్రమే సరిదిద్దడం. వ్యాసంలోని ప్రతి విభాగానికి పక్కన మార్చు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కినపుడు కేవలం సదరు విభాగం మాత్రమే మార్పుకు సిద్ధమౌతుంది.
క్లుప్తంగా దిద్దుబాటు చేసే విధానం ఇలా ఉంటుంది.
- దిద్దుబాటు చెయ్యదలచిన పేజీ లేదా విభాగపు "మార్చు" లింకును నొక్కండి.
- దిద్దుబాటు పేజీ ప్రత్యక్షమౌతుంది.
- అక్కడ మీరు చెయ్యదలచిన మార్పులు చెయ్యండి.
- మీరు చేసిన మార్పులను వివరిస్తూ ఒక చిన్న సారాంశాన్ని కిందనున్న పెట్టెలో రాయండి.
- మీరు చేసింది చిన్న మార్పయితే, చిన్నమార్పు పెట్టెను టిక్కు చెయ్యండి.
- ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేర్చాలనుకుంటే.. ఆ పెట్టెను కూడా టిక్కు చెయ్యండి.
- పేజీని భద్రపరచేముందు, సరిచూడు మీటను నొక్కి, మీరు చేసిన మార్పులను ఒక్కసారి సరిచూసుకోండి.
- అంతా బాగుందనుకుంటే, భద్రపరచు మీటను నొక్కి, మీ మార్పులను భద్రపరచండి.
అయితే మీరు రాసిన గద్యాన్ని ఒక ఆకృతిలో పెట్టదలిస్తే దానికి అనుగుణంగా తగు అలంకారాలు చెయ్యాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొంత భాగాన్ని బొద్దుగా చెయ్యడం, ఇటాలిక్కుగా మార్చడం, ఒక కొత్త విభాగం తయారుచెయ్యడం, ఒక జాబితాను కూర్చడం, ఒక నిర్వచనాన్ని రాయడం వంటి అనేక అలంకారాలు ఈ ఎడిటరు ద్వారా చెయ్యవచ్చు. అయితే ఈ ఎడిటరు, ఏది రాస్తే అదే, ఎలా రాస్తే అలానే కనపడే WYSYWYG రకం కాదు. ఫలానా అలంకారం కావాలంటే ఫలానా విధంగా రాయాలి అనే పద్ధతులున్నాయి. ఆయా పద్ధతులను Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి పేజీలో చూడండి.
కొత్తపేజీని సృష్టించడం:ఈ క్రింది పెట్టెలో వ్యాసం పేరు రాసి, వ్యాసాన్ని సృష్టించు మీట నొక్కండి. కొత్త ఎడిట్ పేజీ ప్రత్యక్షం అవుతుంది. అందులో రాయదలచినది రాసి, పేజీ క్రింద భాగములో పేజీ భద్రపరచు మీట నొక్కి భద్రపరచండి.
కొత్త పేజీని సృష్టించేందుకు వేరే మార్గం కూడా ఉంది. ఏదో ఒక పేజీయొక్క మార్చు లింకును నొక్కండి. ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి దానికి లింకులు ఇవ్వడి. లింకులు ఇవ్వడమంటే [[ ]] బ్రాకెట్లను ఆ పేరుకు రెండువైపులా చేర్చడమే! ఉదాహరణకు మా ఊరు అనే పేజీని సృష్టించాలనుకుందాం.. ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కి, ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో, అన్నిటి కంటె పైన [[మా ఊరు]] అని రాసి, ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో మా ఊరు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, మా ఊరు పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు రాయదలచింది రాసేసి, భద్రపరచండి. అంతే.. పేజీ తయారు!
మూసలు, వర్గాలు
[మార్చు]వికీపీడియాలో తరచూ వాడే పేజీలు మూసలు, వర్గాలు. మూసలు వ్యాసాలను రచించడంలో ఉపకరిస్తాయి. వర్గాలు పేజీలను వెతకడంలో ఉపకరిస్తాయి.
మూసలు
[మార్చు]ఏదైనా ఒక సమాచారం అనేక పేజీలకు సామాన్యంగా ఉంటే, సదరు సమాచారాన్ని ప్రతీ పేజీలోనూ రాసేపనిలేకుండా చేసిన ఏర్పాటు, మూస. ఆ సమాచారంతో ఓ కొత్త పేజీని తయారుచేస్తాం. అదే మూస. ఈ మూస పేరును మా..త్రం ఆయా పేజీల్లో రాస్తే చాలు, సదరు సమాచారం ఆ పేజీల్లో వచ్చి చేరుతుంది. దీనివలన ప్రతీపేజీలోను ఆ సమాచారం రాసే అవసరం తప్పుతుంది. మరింత సమాచారం కొరకు Wikipedia:మూస చూడండి.
మూసను మామూలు పేజీని సృష్టించినట్లే సృష్టించవచ్చు. అయితే కొత్త మూసను సృష్టించేటపుడు రెండు పద్ధతులలో సూచించవచ్చు. మామూలు పేజీలను సూచించినట్లుగా [[మూస:నా మూస]] లాగా రాయవచ్చు. అలాగే {{నా మూస}} లాగా కూడా రాయవచ్చు. మొదటి పద్ధతిలో స్క్వేరు బ్రాకెట్టులు వాడాము, ముందు నేం స్పేసును రాసాము. రెండో పద్ధతిలో మీసాల బ్రాకెట్టును వాడాము, నేం స్పేసును రాయలేదు.
ఉదాహరణకు నామూస అనే మూసను ఎలా సృష్టించాలో చూద్దాం..
ఏదో ఒక పేజీయొక్క మార్చు లింకును నొక్కండి. ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన మూస పేరునుపేజీ పేరును [[మూస:నా మూస]] అని గానీ, లేదా {{నా మూస}} అని గాని రాయండి. ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో నా మూస అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, నా మూస పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు రాయదలచింది రాసేసి, భద్రపరచండి. అంతే.. మూస తయారు!
ఈ మూసను ఏదైనా పేజీలో వాడేటపుడు ఆ పేజీలో మీరు వాడదలచిన చోట ఇలా రాయాలి: {{నా మూస}}. అంతే! ఆ మూసలో ఉన్న సమాచారం ఈ పేజీలోకి వచ్చి చేరుతుంది.
[[మూస:నా మూస]], {{నా మూస}} ల మధ్య తేడాలు:
కొత్త మూసను సృష్టించేటపుడు, ఈ రెంటి మధ్య తేడా ఏమీ లేదు. ఏ పద్ధతిలోనైనా రాయవచ్చు. అయితే, సృష్టించిన మూసను వివిధ పేజీల్లో వాడేటపుడు మాత్రం తేడా ఉంటుంది. ఉదాహరణగా అనువాదము అనే మూసను తీసుకుందాం.
[[మూస:అనువాదము]] అని రాసినపుడు మూసలో రాసిన గద్యం ఈ పేజీకి చేరదు, ఆ మూస పేజీకి లింకు మాత్రమే ఏర్పడుతుంది, ఇలాగ: మూస:అనువాదము
{{మూస:అనువాదము}} అని రాసినపుడు మూసలో రాసిన గద్యం ఈ పేజీకి చేరుతుంది, కింది విధంగా:
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి |
వర్గాలు
[మార్చు]- ఒకే విధమైన లక్షణాలు కలిగిన పేజీలను ఒక సమూహంగా చేర్చడమే వర్గీకరణ. ఈ సమూహాలే వర్గాలు. ఒక ఉదాహరణ: అక్కినేని నాగేశ్వరరావు, అల్లూరి సీతారామ రాజు, పింగళి వెంకయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పొట్టి శ్రీరాములు, బాపు, బి.నాగిరెడ్డి మొదలైన వారంతా సుప్రసిద్ధ ఆంధ్రులు. ఈ వ్యాసాలన్నిటినీ సుప్రసిద్ధ ఆంధ్రులు వర్గానికి చేర్చవచ్చు. అలాగే, అల్లూరి సీతారామ రాజు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు స్వాతంత్ర్య సమర యోధులు. ఈ వ్యాసాలను స్వాతంత్ర్య సమర యోధులు వర్గంలో కూడా చేర్చవచ్చు. ఒక్కో పేజీని ఎన్ని వర్గాలలోకైనా చేర్చవచ్చు.. అవి తార్కికంగా ఉంటే చాలు. వర్గాల కారణంగా పేజీల శోధన సులువవుతుంది. వికీపీడియాకు ఒక చక్కటి ఆకృతి ఏర్పడుతుంది కూడా. వర్గాల గురించి మరింత సమాచారం కోసం Wikipedia:వర్గీకరణ చూడండి. ఒక పేజీని ఏదైనా వర్గంలోకి చేర్చడమంటే ఆ పేజీలో సదరు వర్గం పేరును చేర్చడమే! ఆ పేజీలో అన్నిటికంటే చివరన, ఇతర భాషా లింకులకు పైన [[వర్గం:వర్గం పేరు]] అని రాయాలి. దాంతో ఆ పేజీ సదరు వర్గం లోకి చేరిపోతుంది.
సభ్యత్వం
[మార్చు]వికీపీడియాలో రాయాలంటే మీరు సభ్యత్వం తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. కాని, తీసుకుంటే మంచిది.
- సభ్యత్వం లేకుండా, లాగిన్ అవకుండా రాస్తే, మీ రచనలు మీ పేరిట ఉండవు. ఏదో ఐపీ అడ్రసు పేరిట చేరుతాయి.
- మీతో చర్చించడం ఇతరులకు సౌకర్యంగా ఉండదు. ఓ శంకరరావు గారితోటో, లక్ష్మి గారితోటో కలిసి పనిచెయ్యడానికి బాగుంటుందిగానీ, 66.221.78.112 తో కలిసి పని చెయ్యాలంటే కష్టమే కదండీ! చర్చలో పాల్గొన్నపుడు తాము ఎవరితో చర్చిస్తున్నామో మిగతా సభ్యులకు తెలుస్తుంది. అంచేత వారు మరింత చొరవగా చర్చలో పాల్గొనగలుగుతారు.
- అన్నిటికీ మించి, అజ్ఞాతంగా రాస్తున్నపుడు, మీ పేరుకు బదులు మీ ఐ.పి.అడ్రసు నమోదవుతుంది. అదే అడ్రసుతో ఇతరులు కూడా రాసే సంభావ్యత ఉంది. ఒకవేళ వారు తప్పుడు పనులు చేస్తే..దానిపై నిర్వాహకులు చర్య తీసుకుంటే.., దానికి మీరు అనవసరంగా బలవుతారు.. అన్యాపదేశంగా బాధ్యులూ అవుతారు.
అంచేత మీరు సభ్యులుగా నమోదయి, లాగిన్ అయిన తర్వాతే రచనలు చేస్తే మంచిది. సభ్యులైన వారికి మాత్రమే నిర్వాహకుని హోదా లభించే అవకాశం ఉంది.
ఏది వికీపీడియా కాదు
[మార్చు]- వికీపీడియా వంటల పుస్తకమా?
కాదు
- వికీపీడియా సినిమా పాటల పుస్తకమా?
కాదు
- వికీపీడియా మొలకల నర్సరీ మాత్రమేనా?
కాదు
- వికీపీడియా అనాథ పేజీల ఆశ్రమమా?
కాదు
- వికీపీడియా వ్యాసమంటే విషయం గురించిన ఉపోద్ఘాతం/నిర్వచనం/పరిచయం మాత్రమేనా ?
కాదు
- వికీలో ఏదో ఒకటి రాసి తీరాల్సిన అవసరం ఏమైనా ఉందా?
లేదు
- పుంఖానుపుంఖంగా మొలకలు తయారు చేసి వికీలో పడెయ్యాల్సిన అవసరం ఉందా?
వికీపీడియాకైతే లేదు
- సమాచారమేమీ లేకుండా కేవలం శీర్షికలు, ఉపశీర్షికలతో పేజీలు నింపెయ్యడం అవసరమా?
వికీపీడియాకు అలాంటి పేజీల అవసరం లే...దు