Jump to content

వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల

వికీపీడియా నుండి

వెన్నెల - గోరటి వెంకన్న


చీకటేసిన చిక్కుముడులను విప్పుకొని

వెలుగు వొంపిన పూల దుప్పటీ కప్పుకొని

కొనకొండల మీద మునవేళ్ళను మోపి

నింగి నుంచి జారి నేలపైకి వాలి


నోరారా నవ్వింది వెన్నెల

తన దారెల్లి పోతున్నది ఎన్నెల

ఎన్నెల ముద్దు టెన్నేల


గగన దేవత నుదుట వీభూది ఫలమోలె

గంగమ్మ సిగలోన తామర దళమోలె

ఆరండ పడవుల నీరెండ పూతోలె

కోరింత పవనాల కొంగమ్మ రెక్కోలె


కొబ్బెర పూలల్ల ఎన్నెల

సిబ్బి గంజి వోలె రాలింది ఎన్నెల

ఎన్నెల ముద్దు టెన్నెల


రేయి యేరయ్యి పారింది ఎన్నెల

ఎన్ని సోయగాలున్నవో ఎన్నెల

ముడుసుకున్న సెలయేటి పరువాల చెక్కిలీ నిమిరిందో

చేప కనుగవ చూసి చూపువాలేసిందో

తన వొయలు తడుముకుని తనువార మురిసిందొ

ఇసుక తిన్నెల మీద విప్పింది వలువల


చిరునవ్వు కన్నుల వెన్నెల

రేయి శిరసొంచి ముద్దాడె వెన్నెల


ముడుసుకున్న పొదల ముసుగులను గుంజింది

అలుపు తీరిన లేడి పొలుపులు వెలిగించింది

మురిపమునకే గరిక వంకలకు నడిపింది

కొరుకంగ తిలకించి పరికించి ఉరికించి

నీటి జాడల వైపు వెన్నెల

బాటలన్నీ వెలిగించింది వెన్నెల

ఉప్పురాశుల ఊరి ఉబికినట్టుగ పారి

కడలి కెరటాలపై తనుజేసె సవ్వారీ

వెండిరేకుల మించి గవ్వలను మెరిపించి

ఎగిసేటి అలలకు తళుకుల మెరుపద్ది

తలకిందులైనట్టి తాబేలు చిప్పోలె

ఎగిసేటి అలలకు తళుకుల నగిషద్ది

తలకిందులైనట్టి తాబేలు చిప్పోలె

నీట తన బింబమే చూపె ఎన్నేల


ఏటి అలలతో ఆటాడె ఎన్నెల

ఎన్నెల ముద్దుటెన్నెల


మేటిమబ్బులు నింగి కమ్ముకున్న రేయి

గూటిలోని పిట్ట గుడ్డోలె ఎన్నెల

తోపు సోకులు పండి పులకించె తరువాయి

తాటిరేకుల కల్లు నురుగోలె వెన్నెల


మొగలి పూల గుత్తి వెన్నెల

చమురు లేని దీపం వత్తి వెన్నెల


పున్నమీ రోజుల్లో పూల వెన్నెల పుట్ట

తనులేశ అమవాస పెరిగె చీకటి పుట్ట

ఆ చీకటికి దిగులునొందె రాళ్ళ గుట్ట

బాధ గని దివి నుంచి దిగివచ్చినాదేమొ

విప్పారు జిల్లెడు కొప్పులో కొలువయ్యి


ఫక్కున నవ్వింది వెన్నెల

పూల ముక్కెరై మెరిసింది వెన్నెల


అంజనపు పిట్టకు పంజరము ఎన్నెల

మాటేసె మెకములకు పీటముడి ఎన్నెల

కాటేసె విషకుండ్ల కంట నలుసు ఎన్నెల

పందికొక్కు కాలికీ పగ్గము ఎన్నెల


సిగమూగె సీకటిని ఎన్నెల

తరిమె పొగలేని సాంబ్రాణి


అందచందాలున్న నింగిలో వెన్నెల

అవనిపై మాన్యుల అంశల వెన్నెల


బుద్ధుని మునివేలి పద్మమున వెన్నెల

జైన తీర్థంకరుల జపమాలను వెన్నెల

హఠయోగి వేమన అచల నవ్వు వెన్నెల

వీరబ్రహ్మము వెండి బెత్తమున వెన్నెల

తిరుదాసరి బొంత చిరుగులో వెన్నెల

విరుపాక్ష సంఘాల చిరుశంఖున వెన్నెల

సూఫీల కొనగోట తొలువైన వెన్నెల


పరహితము కోసమై సర్వంబు నొదిలిన

నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెల