వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 39వ వారం
రుక్మిణీదేవి అరండేల్ చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది.
ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం లో చేరింది. తన అభిరుచులకతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది.
అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి బాలే నృత్యాన్ని అభ్యసించింది. మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆ విద్యను పది మందికి పంచి పెట్టడానికి "ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" ప్రారంభించింది. తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.
1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం "పద్మభూషణ్" తోను, శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదుతోను ఆమెను సత్కరించాయి. ...పూర్తివ్యాసం: పాతవి