రుక్మిణీదేవి అరండేల్
రుక్మిణీ దేవి నీలకంఠ శాస్త్రి | |
---|---|
జననం | రుక్మణి నీలకంఠ శాస్త్రి 1904 ఫిబ్రవరి 29 మదురై, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1986 ఫిబ్రవరి 24 | (వయసు 81)
క్రియాశీల సంవత్సరాలు | 1920–1986 |
జీవిత భాగస్వామి | జార్జ్ అరుండేల్ (m. 1920) |
పురస్కారాలు | పద్మభూషణ్ పురస్కారం (1956) సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (1967) |
పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ | |
In office 3 ఏప్రిల్ 1952 – 2 ఏప్రిల్ 1962 | |
నియోజకవర్గం | నామినేట్ చేయబడింది |
రుక్మిణీదేవి అరండేల్ (ఫిబ్రవరి 29, 1904 - ఫిబ్రవరి 24, 1986) (Rukmini Devi Arundale) తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.
జననం
[మార్చు]ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్త్రి, శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం (థియాసాఫికల్ సొసైటీ) లో చేరింది.
వివాహం
[మార్చు]ఈమె తన అభిరుచులతో, ఆలోచనలతో ఏకీభవించిన జి.ఎస్.అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16, అరండేల్ కు 40. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య ముంబైలో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది.
నాట్య అభ్యాసం
[మార్చు]వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా ననుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నా, ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.
అరంగేట్ట్రం
[మార్చు]రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలు అందుకుంది. రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ మొదలైన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శన జేమ్స్ కజిన్స్ అనే ఐర్లాండ్ కవిని ఆకర్షించింది.
నాట్య పాఠశాల ఆరంభం
[మార్చు]ఐర్లాండ్ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని, అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు. కవి జేమ్స్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ఈ నాట్య పాఠశాల "ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" అనే పేరుతో అనేక మంది ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. తరువాతి కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.
పాఠశాల నిర్వహణ
[మార్చు]నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు పి.చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్థుల సంఖ్య కేవలం నలుగురే. ఈ పాఠశాలలో నాట్యమే కాక సంగీతమూ నేర్పుతారు. అందమైన తోటలు, తామర కొలనులు, సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంగా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిబింబిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె చేసిన సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.
రాజ్యసభలో
[మార్చు]1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆమె అభిప్రాయాలతో ఏకీభవించి, 'ఈ విషయమై ప్రభుత్వమే ఒక పరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమ'ని కోరాడు.[1] రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య, మానవతావాద సంస్థలతో పనిచేసింది.
బిరుదులు
[మార్చు]రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం "పద్మభూషణ్" తోను, శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదుతోను ఆమెను సత్కరించాయి. భరతనాట్యానికి గుర్తింపు, గౌరవాన్ని కలిగించి, దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీదేవి అరండేల్ కు ప్రధాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్థులు అనేకమంది నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్నారు.
ఇతర విశేషాలు
[మార్చు]1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పరిశీలించాడు.[2] అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదు.[3]
మరణం
[మార్చు]ఫిబ్రవరి 24, 1986లో రుక్మిణీదేవి అరండేల్ తుదిశ్వాస విడిచింది.
మూలాలు
[మార్చు]- ↑ http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm Archived 2007-09-27 at the Wayback Machine సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007
- ↑ http://www.nla.gov.au/pub/nlanews/2006/jan06/article4.html Archived 2006-03-30 at the Wayback Machine సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007
- ↑ http://www.india-today.com/itoday/millennium/100people/rukmini.html Archived 2016-03-30 at the Wayback Machine సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007
బయటి లింకులు
[మార్చు]- కళాక్షేత్రం వారి వెబ్ సైటు Archived 2007-08-24 at the Wayback Machine
- జీవిత కథ
- మరొక వ్యాసం
- హిందూ పత్రికలో వ్యాసం Archived 2007-03-13 at the Wayback Machine
- 20వ శతాబ్దంలో 100మంది ప్రముఖ తమిళులు - రుక్మిణీదేవి అరండేల్[permanent dead link]
- రుక్మిణీదేవీ, కళాక్షేత్రం
- biography
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1904 జననాలు
- 1986 మరణాలు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- కళాకారులు