వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 44వ వారం
అంకె లేదా సంఖ్య అనేది లెక్కించడానికీ, కొలవడానికీ ఉపయోగించే ఒక అంశం. భౌతికంగా అంకెలు అనేవి ప్రకృతిలో లేవు. ఇవి మానవుల మనసులో ఏర్పడిన విషయాలు. ప్రతి సంఖ్యకూ ఒక గుర్తు ను వాడుతారు. మానవజాతి నాగరికత, విజ్ఞానం ప్రగతికి మౌలికమైన అంశాలలో అంకెలు, వాటి గుర్తులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అంకెలు, వాటి సంబంధాలనూ విస్తృతపరచే విజ్ఞానాన్ని గణితం లేదా గణిత శాస్త్రం అంటారు.
సంఖ్యలలో అనేక రకాలు ఉన్నాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు, బీజీయసంఖ్యలు మొదలైనవి. లెక్కించటానికి వాడే 1, 2, 3, వగైరాలని సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల చరిత్ర మానవుడి చరిత్ర కంటె పురాతనమైనదని కొందరి నమ్మకం. పక్షులు గూటిలో పెట్టిన గుడ్లలోంచి ఒకటో, రెండో గుడ్లు మనం తీసేస్తే కొన్ని గుడ్లు లోపించాయనే విషయం తల్లి పక్షి గ్రహించగలదని ప్రయోగాత్మకంగా నిరూపించేరు. కనుక లెక్కపెట్టగలగటం అనే పని ఒక్క మానవుడే కాదు, తదితర జీవులు కూడా చెయ్యగలవన్న మాట.
మానవులకి జంతువులకి తేడా ఏమిటంటే, మానవుడు లెక్కించేటప్పుడు భాష వాడతాడు. కాని మనిషి లెక్కించేటప్పుడు వాడే భాషకి, దాని వెనక ఉన్న భావానికి మధ్య ఉండే లంకె తెగడానికి కొంత కాలం పట్టింది. ఉదాహరణకి, ఫీజీ ద్వీప వాసులు పది పడవల్ని బోలో అంటారు, కానీ పది కొబ్బరికాయలని కోరో అంటారు. అంటే వారి భాషలో పది అనే భావానికి మాటలేదు. మన భాషలలో కూడ వెతికితే ఈ రకం మాటలు దొరుకుతాయి...పూర్తివ్యాసం: పాతవి