వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 48వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Saluri Rajeswara Rao statue at Salur.jpg

సాలూరు రాజేశ్వరరావు (1922-1999) పేరెన్నికగన్న తెలుగు సినిమా సంగీత దర్శకుడు. సాలూరు మండలములోని శివరామపురం గ్రామంలో జన్మించాడు. అతి చిన్న వయసులోనే సంగీతం నేర్చుకొని అన్నతొ కలిసి కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. 1933-34 మధ్యకాలంలో గ్రామఫోను రికార్డుల ద్వారా అతని ప్రతిభ యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.'శ్రీకృష్ణలీలలు' (1935) చిత్రంలో 'కృష్ణ' పాత్రధారిగా తన పదమూడేళ్ళ వయసులో తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. 'శశిరేఖాపరిణయం' అతని రెండవ చిత్రం. తరువాత కలకత్తాలో ఉద్దండులవద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నాడు. 1938లో మద్రాసుకు తిరిగి వచ్చి సంగీతబృందాన్ని యేర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పని చేశాడు. 'జయప్రద'(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించాడు.

సినీ సంగీతదర్శకునిగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు (1940). సాలూరి ప్రతిభను యావద్భారత దేశానికి తెలియ జెప్పిన చిత్రం చంద్రలేఖ (1948). కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలని,లాటిన్‌ అమెరికన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మిళితం చేసి, ఆ కాలంలో వూహించలేనటువంటి పెద్ద వాద్యబృందంతో సృష్టించిన చిత్రమది. ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి (1951). నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు. తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం విప్రనారాయణ.

శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్‌ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు- ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించాడు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో అందె వేసిన చేయి. తన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200 కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో తప్పక పేర్కొనవలసిన చిత్రాలు రాజు పేద, మిస్సమ్మ, భలేరాముడు, మాయాబజార్‌ (4 పాటలు మాత్రమే), అప్పుచేసి పప్పుకూడు, చెంచులక్ష్మి, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన, భక్త ప్రహ్లాద.... పూర్తివ్యాసం: పాతవి