Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 50వ వారం

వికీపీడియా నుండి

తులసి ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.

హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము.

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు,గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.

తులసికి సంబంధించి హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన నమ్మకాలు: తులసి విష్ణువునకు ప్రియమైన భక్తురాలు. విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు. తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది. తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి. ...పూర్తివ్యాసం: పాతవి