వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 52వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లా మొత్తం ఎటువైపు వెళ్ళినా చల్లగా పలకరించే పచ్చని పంటచేలు - విస్తృతంగా దిగుబడినందిస్తూ పచ్చగా కళకళలాడే కొబ్బరి తోటలు - అమృతమధురమైన ఫలాలందించే అరటి వనాలు - గోదారి గలగలలు - పంటచేల పదనిసలు - పశ్చిమగోదావరి....కాదు...కాదు.. ఇది ప్రకృతి గోదావరి. నైసర్గికంగా జిల్లాను మూడు సహజ ప్రాంతాలుగా విభజించవచ్చును - డెల్టా ప్రాంతము, మెరక భూముల ప్రాంతము, ఏజన్సీ (అటవీ) ప్రాంతము. జిల్లాను 46 రెవిన్యూ మండలములుగా విభజించినారు.

పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివశిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490. జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. జిల్లా ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు.


ఈ జిల్లా 73.95% (పురుషులు 78.43%, స్త్రీలు 69.45%) అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు తరువాత రెండవ స్థానంలో ఉన్నది. మొత్తం దేశంలో ఈ జిల్లా చదువుకొన్న వారి సంఖ్య ప్రకారం 31వ స్థానంలోను, అక్షరాస్యత శాతం ప్రకారం 149వ స్థానంలోను ఉన్నది... ...పూర్తివ్యాసం: పాతవి