Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 32వ వారం

వికీపీడియా నుండి

నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకమునుపు జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇతను జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయనను గురించి వర్ణించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు.


ఫిబ్రవరి 11, 1990లో జైలునుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. తన పూర్వపు ప్రతిస్పర్ధులనుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా అవార్డులు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్ధన లభించింది.


మండేలా కుటుంబం "తెంబు" వంశానికి చెందినది. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే వూరిలో 18 జూలై 1918న జన్మించాడు. మండేలా తండ్రి "గాడ్లా" కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. గాడ్లా 3వ భార్య "నోసెకెని ఫాన్నీ"కి జన్మించిన మగబిడ్డకు "రోలిహ్లాహ్లా" (అంటే కొమ్మలు లాగేవాడు -"దుడుకు స్వభావం కలవాడు" ) అని పేరు పెట్టారు. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం "ఉమ్జీ"లో అధికంగా గడచింది. ......పూర్తివ్యాసం: పాతవి