Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 33వ వారం

వికీపీడియా నుండి

రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్ధిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.


సుమారు ఆరు కోట్లమంది మృతికి కారణమయిన ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్త సిక్తమయినదిగా పేరొందింది. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వారిలో మూడింట రెండు వంతులు సాధారణ పౌరులేనని ఒక అంచనా. వీరిలో సుమారు ఒక కోటిమంది వరకూ తూర్పు ఐరోపాలోనూ సోవియెట్ యూనియన్ లోనూ నాజీ జర్మనీ జరిపిన యూదు జాతి నిర్మూలన కార్యక్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. (దీనికే హోలోకాస్ట్ అని పేరు). ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం కలిగించిన ఆర్ధిక నష్టం సుమారు పది లక్షల కోట్ల అమెరిన్ డాలర్లు (1944 నాటి డాలరు విలువ ప్రకారం) ఉంటుందని అంచనా.


1945లో మిత్ర రాజ్యాల కూటమి విజయంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ సమాఖ్య యుద్ధానంతర కాలంలో ప్రపంచంలో రెండు అగ్ర రాజ్యాలుగా ఎదిగి ఒకరితో ఒకరు ప్రచ్ఛన్న యుద్ధానికి తలపడ్డాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం సుమారు 45 సంవత్సరాల పాటు కొనసాగి, 1990లో సోవియట్ సమాఖ్య పతనంతో అంతమయింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితి నెలకొల్పబడింది. కాగా, ఈ యుద్ధం రగిల్చిన స్వతంత్ర కాంక్ష కారణంగా అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఐరోపా వలస వాదులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచి ఆయా దేశాలు అనతి కాలంలోనే స్వాతంత్ర్యాన్ని పొందాయి. ......పూర్తివ్యాసం: పాతవి