వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 34వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముల్లా నస్రుద్దీన్, ఒక సూఫీ, కవి, పండితుడు మరియు హాస్యభరితమైన విద్వాంసుడు. ఇతడు మధ్య యుగంలో 13వ శతాబ్దంలో అక్సెహీర్ మరియు కోన్యా లలో సెల్జుక్‌ల కాలంలో జీవించాడు. కానీ దగ్గరి తూర్పు దేశాలు, మధ్యప్రాచ్యము, మరియు మధ్య ఆసియా దేశాలు, ఉజ్బెగ్ లు ముల్లా నస్రుద్దీన్ తమ వాడేనంటూ చెప్పుకొంటారు. ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి - "హోద్జా", ముల్లాహ్ లేదా ఎఫెందీ వంటివి. ఉయిఘుర్ టర్కీ ప్రజలలో జానపద హీరో. చైనా లో కూడా ఆఫందీ లేదా ఎఫెంటీ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ముల్లా నస్రుద్దీన్ అనటోలియా లో జీవించాడు; 13వ శతాబ్దంలో 'సివ్రీహిసార్' లోని 'హోర్తూ' గ్రామంలో జన్మించాడు. తరువాత, అక్సెహీర్ లో స్థిరనివాసమేర్పరచుకొన్నాడు, తరువాత 'కోన్యా' కు తన నివాసాన్ని మార్చి అక్కడే మరణించాడు.


నస్రుద్దీన్ పనులను చూసి ఎవరైనా ఇతనికి పిచ్చివాని క్రింద జమకట్టేవారు. కాని ఇతని చేష్టల హేతువులను చూసి పండితులు సైతం ముక్కు మీద వేలేసుకొనేవారు. ఇతను తను చేసే ప్రతి పనినీ లేదా సంభాషణనూ హేతువుతోనూ తర్కంతోనూ చేసేవాడు. సాదా సీదా జీవనం గడిపిననూ వేదాంతిగా, హాస్యరసజ్ఞుడిగా, ఛలోక్తులు విసిరేవాడిగా, విమర్శకులను సైతం మాటలుడిగేలా చేసేవాడు. ఆధునిక కాలంలో ఇతని గురించి అనేక కథలూ, వివిధ తరగతులలో పాఠ్యాంశాలలోనూ చూడవచ్చును. తెలుగులోనూ అనేక కథలు చూడవచ్చును. ఇతని పాత్ర చిత్రణ వివిధ భాషలలో, జానపదాలలోనూ, కథలలోనూ, హాస్య సాహిత్యాలలోనూ చూడవచ్చును. నస్రుద్దీన్ కథలు ప్రపంచ మంతటా ప్రసిద్ధి, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో. నస్రుద్దీన్ కథలు వ్యంగమునకు వ్యంగోక్తులకు, హాస్యమునకు, తర్కము మరియు విజ్ఞానానికి మచ్చు తునకలు. కడుపుబ్బ నవ్వించే ఇతని కథలు, ముల్లా దో పియాజా, బీర్బల్ , తెనాలి రామకృష్ణ లను గుర్తుకు తెస్తాయి.


"అంతర్జాతీయ నస్రుద్దీన్ హోద్జా ఉత్సవాలు" అక్సెహీర్ లో ప్రతి సంవత్సరము జూలై 5-10 వరకూ జరుగుతాయి. ఇతడి కథలలో సూఫీతత్వము, వేదాంతము కానవస్తుంది. ఈ కథలకు చెందిన అతిప్రాచీన వ్రాత ప్రతి 1571 లో కనుగొనబడింది. ఇతని గౌరవార్థం, యునెస్కో వారు 1996-1997 వ సంవత్సరాన్ని, "అంతర్జాతీయ నస్రుద్దీన్ సంవత్సరం" గా ప్రకటించారు. ......పూర్తివ్యాసం: పాతవి