వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 38వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.


పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పటమటపల్లె గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.


మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును వ్యతిరేకించాడు. ......పూర్తివ్యాసం: పాతవి