వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 45వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమరావతి, గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరాన ఉన్నది. అమరావతికి సమీపంలోని ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. ఆ కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. అప్పటి అమరావతి స్తూపము ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ స్తూపము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది.


స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు - ఒక వేదిక, దానిపైన అర్ధ గోళాకృతి అండము, అండముపై ఒక హర్మిక, దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము, అండము, హర్మికల మధ్య గళము, చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు. మహాచైత్య గర్భంలోనూ, ఇతర భాగాలలోనూ పవిత్ర ధాతువులున్న పది మంజూషికలు లభించాయి. ఆచార్య నాగార్జునుడు ఇక్కడి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో హుయాన్ త్సాంగ్ 'అభిధమ్మ పిటకం' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిధిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ. 1700 నాటికి స్తూపము శిధిలావస్థకు చేరుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. "దీపాలదిన్నె" గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.


ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. అమరావతి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట. అమరావతి శిల్ప కళారీతి శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని విర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం. .....పూర్తివ్యాసం: పాతవి