వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 52వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము మరియు ఒక మండలము మరియు ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ ఉండే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలు. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.


సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన ధూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించారు. క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.


ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఇక్కడి అనేక శివలింగాలు బహు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్టింపబడినవిగా భావిస్తారు. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. .....పూర్తివ్యాసం: పాతవి