వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 21వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిదంబరం తమిళనాడు లోని కడలూరు జిల్లాకు చెందిన మునిసిపాలిటీ మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు చెన్నై కి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది. ఇక్కడ పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజు గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉన్నది. శైవులకు దేవాలయం లేదా తమిళం లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. ఈ ఆలయం 'విరాట్ హృదయ పద్మ స్థలం' అంటే కమలం వంటి విశ్వపు గుండెలో ఉన్నదని ప్రతీతి. పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు. బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడిలో స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు: (1) సంపూర్ణ రూపం - నటరాజు రూపంలోని స్వామి (2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్ (3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం

చిదంబరంలో శివుడు తన దేవేరి శక్తి లేదా శివకామినితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు ....పూర్తివ్యాసం: పాతవి