వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 32వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉన్నది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. చక్కని బీచిలు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంధాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆప్రాంత అనే పేరు కూడా వాడబడింది.


1498లో వాస్కో డ గామా కేరళ లో కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండ్లాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకొనలేదు. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.


పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉన్నది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి. గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల ఎర్రనేల. లోపలి నదీతీరాలలో నల్లరేగడి నేల ఉన్నది. గోవా, కర్ణాటక సరిహద్దులలో మోలెమ్, అన్‌మోడ్ల మధ్యనున్న శిలలు భారత ఉపఖండంలోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి