Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 33వ వారం

వికీపీడియా నుండి


ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - మార్చి 4, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధున్ని నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.


షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి