Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 34వ వారం

వికీపీడియా నుండి

చతుర్వేదాలు హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు (ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య) అనీ కూడా అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదానికి నిగమము (అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము) అని కూడా పేరుంది.

మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. అలా నాలుగు వేదాలు మనకు లభించాయి. (1) ఋగ్వేదము (2) యజుర్వేదము (3) సామవేదము (4) అధర్వణవేదము. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే.

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు. అవి -

  1. మంత్ర సంహిత:ఇది వేదాలలోని మంత్రభాగం. స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేదసంహిత అత్యంత పురాతన, ప్రముఖ గ్రంథము. యజుర్వేదసంహిత ఎక్కువగా వచనరూపంలో ఉంది. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది.
  2. బ్రాహ్మణము: సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది.
  3. ఆరణ్యకము: అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి.
  4. ఉపనిషత్తులు - ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో 108 ముఖ్యమైనవి.

యజ్ఞ నిర్వహణలో నలుగురు పురోహితులుంటారు. (1) హోత: ఋగ్వేదంలోని స్తోత్రాలను పఠించేవాడు. (2) అధ్వర్యుడు: యజుర్వేదంలో చెప్పిన ప్రకారం యజ్ఞకర్మలను యధావిధిగా నిర్వహించేవాడు. (3) ఉద్గాత: సామగీతాలను గానం చేసేవాడు. (4) బ్రహ్మ: అధర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని పర్యవేక్షించేవాడు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి