వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 15వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Bhadrakaliamma l.jpg

శ్రీ భద్రకాళీ దేవస్థానము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, వరంగల్ నగరమునందు ఉన్నది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై రంగంపేట నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరమున గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉన్నది. ఆమె 8 చేతులతో - కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకము : ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలము, ఛిన్నమస్తకము, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నది.

ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లూ 'ప్రతాపరుద్ర చరిత్రము' మరియి 'సిద్ధేశ్వర చరిత్రము' గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను కారుమాటలతోనైన జయించాలనే ఉద్దేశ్యంతో "ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా?" అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది. కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి, "రేపు పౌర్ణమి" అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఆ సంకట స్థితినుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసులలో ప్రధానుదైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై "నీ మాట నే నిలుపుతా" నని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగ శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటినుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు సృష్టమవుతుంది.

క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. .... పూర్తివ్యాసం పాతవి