వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 50వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాబా ఆమ్టే డిసెంబర్ 26, 1914న మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింగన్‌ఘాట్‌లో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపిన మహనీయుడు.

బాబా ఆమ్టే మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్‌ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. బాబా అనేది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే బాబా ఆమ్టే గానే పిల్వబడ్డాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. 1946లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాత కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.


బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించినది. కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు. కుష్టురోగులకై బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్ మరియు అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించినాడు. సమాజసేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ కై బాబాఆమ్తేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథశరణాలయాన్ని కలిగిఉంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5000కు పైగా నివసిస్తున్నారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి