వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 12వ వారం
పాలకొల్లు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 10 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, పాలకొలను అని పిలిచేవారు. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు(ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). తదనంతరం ప్రతిరోజూ చేయబడే అభిషేకక్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.
ఇంకా....పూర్తివ్యాసం పాతవి