వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 18వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య ఒకడు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది. క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.

జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట. మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. మరొక కధ: బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.

పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు అని తెలుస్తున్నది. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి