Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 04వ వారం

వికీపీడియా నుండి

గుమ్మడి

తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.జూలై 9, 1927 మ.జనవరి 26, 2010 ) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.

గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.

ఎన్ టి ఆర్ తో నటించిన తోడు దొంగలు (1954) మరియు మహామంత్రి తిమ్మరుసు (1962) సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. రాష్ట్రపతి బహమతి మొదటిదానికి రాగా, రెండవదానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహ నటుడు గా ఎంపికయ్యాడు. మాయా బజార్ (1957), మా ఇంటి మహలక్ష్మి (1959), కులదైవం (1960), కుల గోత్రాలు(1962), జ్యోతి(1977), నెలవంక (1981), మరో మలుపు(1982),ఏకలవ్య(1982), ఈ చరిత్ర ఏ సిరాతో? (1982), గాజు బొమ్మలు (1983), పెళ్లి పుస్తకం (1991) గుమ్మడికి పేరుతెచ్చిన సినిమాలలో కొన్ని. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసు(1962)లో కధానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఇంకా…