వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 18వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డెహ్రాడూన్

డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని, ఆ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఇది డెహ్రాడూన్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ నగరం గఢ్వాల్ ప్రాంతంలో భాగం. గఢ్వాల్ డివిజనల్ కమీషనర్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇది ఢిల్లీకి ఉత్తరాన 248 కి.మీ. (154 మై.) దూరాన ఏడవ జాతీయ రహదారిపై ఉంది. రైలు మార్గం (డెహ్రాడూన్ రైల్వే స్టేషన్), విమానాశ్రయం (జాలీ గ్రాంట్ విమానాశ్రయం) తోనూ బాగా అనుసంధానించబడి ఉంది. నగర పరిపాలనను డెహ్రాడూన్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్ శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నగరంలో నిర్వహిస్తారు. డెహ్రాడూన్, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) చుట్టూ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ ప్రయత్నాల్లో ఒకటి. ఇది ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం లోకి వలసలను తగ్గించి అక్కడ జనాభా విస్ఫోటనాన్ని తగ్గించడానికీ, హిమాలయాల్లో ఒక స్మార్ట్ సిటీ గానూ ఇది అభివృద్ధి చెందుతోంది. డెహ్రాడూన్ హిమాలయాలకు దిగువన ఉన్న డూన్ వ్యాలీలో ఉంది. తూర్పున గంగానదికి ఉపనది అయిన సోంగ్ నది, పశ్చిమాన యమునా ఉపనది అయిన అసన్ నది ప్రవహిస్తున్నాయి. ఈ నగరం, దాని సుందరమైన ప్రకృతి అందాలకూ, కొద్దిగా తేలికపాటి వాతావరణానికీ ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ప్రాంతానికి ఇది ప్రవేశ ద్వారంగా ఉంది. ఇది ముస్సోరీ, ధనౌల్తి, చక్రతా, న్యూ టెహ్రీ, ఉత్తర‌కాశి, హర్సిల్, చోప్తా - తుంగనాథ్, ఔలి వంటి హిమాలయ పర్యాటక ప్రాంతాలకూ దోడితల్, దయారా బుగిలియాల్‌లోని పూల లోయ వంటి ప్రసిద్ధ వేసవి, శీతాకాల హైకింగ్ గమ్యస్థానాలకూ, కేదార్‌కాంత, హర్ కీ దున్, హేమకుంట్ సాహిబ్ వంటి క్యాంపింగ్ స్థలాలకూ సమీపంలో ఉంది. హిందూ పవిత్ర నగరాలైన హరిద్వార్, రిషికేశ్ , చోటా చార్ ధామ్ హిమాలయ తీర్థయాత్ర సర్క్యూట్‌తో పాటు, యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కూడా డెహ్రాడూన్ ద్వారా చేరుకోవచ్చు. డెహ్రాడూన్ బాస్మతి బియ్యానికి, బేకరీ ఉత్పత్తులకు కూడా ప్రసిద్ధి చెందింది.
(ఇంకా…)