Jump to content

వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/తటస్థ దృక్కోణం

వికీపీడియా నుండి

వికీపీడియాలో ఉండే విజ్ఞానసర్వస్వపరమైన కంటెంట్ అంతా తటస్థ దృక్కోణం నుంచి రాయాలి. అంటే సమాచారాన్ని న్యాయంగా, విషయానికి తగినంత మేరకు రాయాలి. సాధ్యమైనంత వరకూ రాసేవారిలోని పాక్షికత సమాచారంలో కనిపించకుండా చూసుకోవాలి. ఒక్కో అంశానికి చాలా కోణాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక రాజకీయ నేత జీవితం మీదో, చరిత్రలో ఓ అంశం మీదో రకరకాల కోణాలు ఉండవచ్చు. అలాంటప్పుడు ఏదో ఒక అంశాన్నే ప్రతిబింబించకుండా ఆయా కోణాలన్నిటినీ వాటి వాటి ప్రాధాన్యత ప్రకారం ప్రతిబింబించాలి. వీటన్నిటినీ నమ్మదగ్గ మూలాలు, ఆధారాలతో సమర్థించాలి.

తటస్థత లోపించడం అంటే ఒక అంశం గురించి వ్యతిరేకంగా రాయడం అనే అనుకోనక్కరలేదు. అతిగా ప్రశంసిస్తూ రాసినా తటస్థత దెబ్బతింటుంది. ప్రముఖ, ప్రసిద్ధ, గొప్ప, అద్భుతం వంటి పదాలు మన పత్రికా పరిభాషలో, ఇతర సందర్భాల్లోనూ చాలా లోతుగా ఇమిడిపోయాయి. వికీపీడియాలో రాసేప్పుడు వీటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఒక వ్యక్తి నిజంగానే గొప్పవాడేనని మన అభిప్రాయం కావచ్చు, కానీ మనం దాన్ని వికీపీడియాలో నేరుగా రాసేయకూడదు. అవసరమైతే ఆ వ్యక్తి గురించి పరిశోధన చేసిన వ్యక్తి చెప్పిన మాటలు కొటేషన్‌లా ఇవ్వవచ్చు, మనంగా చెప్పకూడదు. ఉదాహరణకు షేక్‌స్పియర్‌ ఆంగ్లభాషలోకెల్లా గొప్ప సాహిత్యాకారుడు, ప్రపంచంలోకెల్లా గొప్ప నాటకకర్త అని నేరుగా రాయకూడదు. దానికి బదులు ఆ ముక్క అన్నదెవరో షేక్స్‌పియర్ సాహిత్యంపైనా, ప్రపంచ సాహిత్యంపైనా పరిశోధనలు చేసిన పండితుడనుకోండి. ఫలానా వ్యక్తి షేక్స్‌పియర్ గురించి ఇలా అన్నాడని రాసి నమ్మదగ్గ మూలం ఇవ్వాలి.

అలానే వ్యక్తుల గురించి, సంస్థల గురించి ఇంటర్నెట్‌లో నమ్మదగని వెబ్‌సైట్లలో గాసిప్స్ చలామణి అవుతూంటాయి. వాటిని నిజాలుగా రాసేయకూడదు. ఏదైనా వివాదం నమ్మదగ్గ మూలాల్లో ప్రస్తావన పొందితే, దానిపై మరీ అత్యుత్సాహం చూపకుండా, అలాగని తగ్గించి చెప్పకుండా బాలన్సుగా రాయాలి.

ఈ పనిపట్టండి

[మార్చు]
  1. మాయాబజార్ వ్యాసం ఈ వెర్షన్ చదివి చూడండి.
  2. ఇందులో తటస్థ దృక్కోణం విషయమై సమస్యలు ఏమున్నాయో ఆలోచించుకోండి.
  3. ఆపైన ఈ లింకు తెరిచి సమస్యలేమిటో సంగ్రహంగా చూడండి.