వినయము
"విద్యాదదాతి వినయమ్" అని ఆర్యోక్తి. విద్య యొక్క ముఖ్యమైన ప్రయోజనం వినయము. విద్య వలన పండితుడు గర్వించక వినయాన్ని కలిగి ఉంటే, ఆ విద్య ఉన్నతమైనదనీ, దానిని కలివున్నవాడు ఉత్తముడని హిందూ పురాణాలు వివరిస్తున్నాయి.
దుష్టులకు ధనం, వంశం, విద్య మదాన్ని కలిగిస్తాయని, అవే సత్పురుషులకు వినయాన్ని కలిగిస్తాయని మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రునకు వినయాన్ని గురించి వివరిస్తాడు.
కచుడు వినయ గుణం వల్ల శుక్రాచార్యుని వద్ద శిష్యునిగా చేరి "మృత సంజీవని" విద్యను పొందగలిగాడు.
"అన్నీ వున్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఎగిరెగిరి పడుతుంది" అని సామెత.
వినయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నా ముఖ్యమైనవి: క్రొత్త విషయాలు తెలుస్తాయి. విజ్ఞానం పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించి, అందరిచేత ప్రశంసించబడతారు. కీర్తి అన్ని ప్రాంతాలకు వ్యాపించి, ఉన్నత వ్యక్తులుగా గుర్తించబడతారు. సంపద కలుగుతుంది. శతృవులు నశించడం, మిత్రలాభం కలుగుతుంది.
శ్రీరాముడు చక్రవర్తి కుమారుడు అయినా విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం కాలినడకన వెళ్ళాడు. అందుమూలంగా ఎన్నో అస్త్రాలను విశ్వామిత్రుని వద్ద నుండి పొందాడు. అతని చేత ఇతర మునుల చేత ప్రశంసించబడ్డాడు. తాటకి, సుబాహులను చంపడం వల్ల రాముని పరాక్రమం, శివధనుస్సును ఎక్కుపెట్టడం వల్ల అతని కీర్తి అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. సాక్షాత్తు లక్ష్మీ దేవి అవతారమైన సీతాదేవిని వివాహమాడి అంతులేని సంపదలను పొందగలిగాడు. పరశురాముని విల్లును ఎక్కుపెట్టి అతనికి గర్వభంగం చేశాడు.