వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
(వెంపరాల సూర్యనారాయణశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి
జననం1896
India ఇందుపల్లి
వృత్తితెలుగు పండితులు
మతంహిందూ
తండ్రివేంకట చయనులు
తల్లిమణికర్ణికా సోమిదేవి

వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి (జ: 1896) తెలుగు పండితుడు, కవి.

జీవిత విశేషాలు

[మార్చు]

సూర్యనారాయణ శాస్త్రి వెలనాటిశాఖకు చెందిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వారి తండ్రి వేంకటచయనులు ఆహితాగ్నులు, చయనాంత క్రతువు అనుష్టానం చేసినవారు. ఇతని తల్లి మణికర్ణికా సోమిదేవి. అతని జన్మస్థానము ఇందుపల్లి. పెంచుకొన్న తలిదండ్రులు కామమ్మ, రామయ్య. దుర్ముఖి నామ సంవత్సర- అధిక జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు పుట్టాడు.

విద్యాభ్యాసం

[మార్చు]

వీరు చిన్ననాట మరువాడ కాశీపతి శాస్త్రి వద్ద కాళిదాస త్రయము చదువుకున్నాడు. తర్వాతి చావలి లక్ష్మీనరసింహశాస్త్రి వద్ద సాహిత్య గ్రంథములు, లఘుకౌముది అధ్యయనం చేశాడు. తెలుగు సాహిత్య రచన పట్ల అభిరుచి ఈ దశలోనే అంకురించింది. 1925 ప్రాంతమున పిఠాపురంలో ఉండి దర్భా సర్వేశ్వరశాస్త్రి కడ వీరు వ్యాకరణ శాస్త్రాధ్యయనము చేశాడు.

మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రి గారికి వీరు 'మునిత్రయ చరిత్రము' నంకిత మొసంగిరి. ప్రత్యేకముగా "రాయడు శాస్త్రి యశశ్చంద్రిక" కావ్యము రచించి మహామహోపాధ్యాయుల షష్టిపూర్తి సన్మాన సందర్భమున నర్పించిరి. ఇవన్నియు నేల పేర్కొనుచుంటి ననగా, శ్రీ సూర్యనారాయణశాస్త్రిగారి హృదయములో పండిత గురువులపట్ల నిట్టి భక్తి ప్రపత్తు లున్నవనుటకు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

సంస్కృతాంధ్ర వైదుషీ భూషితులైన వీరు 1930 సం.లో అమలాపురము బోర్డు హైస్కూలున తెలుగు పండితులుగా బ్రవేశించి రెండేండ్లు అచ్చటనుండిరి. తరువాత కాకినాడ నేషనల్ స్కూలులో మఱిరెండేండ్లు పండితోద్యోగము. పిదప, పాణంగిపల్లి జమీందారు శ్రీనబ్నివీను కృష్ణారావు పంతులు (బి.ఏ) గారికి సంస్కృతాంధ్రోపాధ్యాయత్వము. 1925 నుంచి 1937 వరకూ శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు కార్యాలయంలో పండితులుగా ఉద్యోగం నిర్వహించాడు.

సాహిత్య రచన

[మార్చు]

వీరి రచనలు: వేంకటేశ్వర శతకము, మునిత్రయ చరిత్రము, శ్రీ శంకర విజయము.[1] 4. శబర శంకర విలాసము 5. మదాలసా విలాసము[2] - ఇత్యాదులు. శాస్త్రి 'శంకరవిజయము' ప్రబంధకర్తగా మంచివిఖ్యాతి పొందాడు.

పాణంగిపల్లి జమీందారు సబ్నవీసు కృష్ణారావు పంతులుకు ఉపాధ్యాయునిగా ఉన్న దశలోనే ప్రొద్దుటూరి 'కవి' వ్యాసపు పోటీపరీక్షలో ద్వితీయ బహుమానము. ఈ పురస్కారము కారణముగా జమీందారు "కవిసింహ కంకణము" చే సూర్యనారాయణ శాస్త్రిగారిని బహూకరించెను. "జీమూతవాహనచరిత్ర" మను ఖండకావ్యము పాణంగిపల్లి ప్రభువునకు శాస్త్రిగారంకిత మిచ్చినారనుట ప్రకృతము తలచుకోవలసిన విషయము. ఇది యిటులుండగా, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు కార్యాలయమున బండితులుగా నుండి వీరు కావించిన వాజ్మయసేవ మఱచిపోరానిది. ఈ యుద్యోగము వలన శాస్త్రిగారి మేధాసంపద మఱింత మెఱుగులు దేఱినది. ఆంధ్రప్రబందములలోని రహస్యములు వెంపరాలవారికి దెలిసినన్ని వేఱొకరికి దెలియవేమో యనిపించును. ఆయన కున్న ప్రయోగపరిజ్ఞానము నిస్సమానమైనది. ఆయనకు వేలకొలది పద్యములు నోటికి వచ్చును. ఒక ప్రయోగమునకు బది యుదాహరణ పద్యములు వెంట వెంటనే చదివి చూపగలరన్నది యతిశయముగా నన్నమాట గాదు. ఇట్టి ధారణాపాటవముగల వీరు సూర్యరాయ నిఘంటు కార్యాలయమునకు జేసిన యువకృతి కృతజ్ఞతకు బాత్రమైనది.

మఱి, శాస్త్రులుగారి కవితారచనలోని విశిష్టత యేమనగా, వారు ప్రయోగవైచిత్ర్యమును వలచిన రచయిత లగుటచే నడుగడుగున నూతన ప్రయోగములు కనబఱచెదరు. ఇంచుమించుగా వారి కావ్యములోని పెక్కు ఘట్టములు భట్టి కావ్యమును స్ఫురణకు దెచ్చుచుండును. పాణినీయము నామూలచూడము చుళుకించినవారు కావున వారి కవిత యిటు లుండుటలో నబ్బురమేమి? ప్రయోగదృష్టి యెంత యున్నదో శాస్త్రులు గారికి రసదృష్టియు నంతేయున్నది. ఆ హేతువున వారి కృతులు పండిత హృదయరంజకములై యున్నవి.

ఈతీరైన సాధుప్రౌడశయ్యలో శాస్త్రులుగారు "శంకరవిజయము" మహాప్రబంధముగా నంతరించిరి. ఆకృతి శాశ్వతముగానుండుటకు జాలియున్నది. మహాకవితా పట్టము శంకర విజయమువలన శాస్త్రులుగారికి లభించుచున్న దనుటలో విప్రతివన్ను లుండరు. వారు రచించుచున్న 'విద్యారణ్య చరిత్ర' తెలుగు కవితాశాఖకు కైనేత కాగలయది. ఆస్తిక బుద్ధి సంపన్నులు, వ్యుత్పన్నులునైన సూర్యనారాయణశాస్త్రి గారు తీసికొన్న యితివృత్తములన్నియు సుపవిత్రములై యుండుట సుప్రశంసార్హమైన విషయము.[3]

వారసత్వం

[మార్చు]

వెంపరాలవారు మనుచరిత్రకు రాసిన వ్యాఖ్యానం చూడండి. అలాంటి వ్యాఖ్యానం ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఎక్కడన్నా తయారవుతుందేమో చెప్పండి.... రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు యూనివర్సిటీల్లో ఎప్పుడూ ఉద్యోగం చెయ్యలేదు, వేదం వేంకటరాయశాస్త్రిగారు యూనివర్సిటీల్లో ఎప్పుడూ ఉద్యోగం చెయ్యలేదు. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు కూడా అంతే. వాళ్ల పాండిత్య ప్రయోజనం మనం పొందలేకపోయాం.

వెల్చేరు నారాయణరావుచేరా, ఎన్. గోపి తెలుగు పరిశోధనపై నారాయణరావుతో చేసిన ఇంటర్వ్యూలో

తెలుగు సాహిత్య విమర్శలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రి రాసిన మనుచరిత్ర విమర్శ ప్రామాణికతకు పేరొందింది. డిగ్రీలు లేని పాండిత్యం కావడాన విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి విస్తారమైన సంప్రదాయ పాండిత్యం ఉన్నవారికి ఉద్యోగం లభించకపోవడం విశ్వవిద్యాలయ తెలుగు సాహిత్య పరిశోధన వ్యవస్థకే లోటు తెచ్చిందని తర్వాతి పరిశోధకులు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ వ్యవస్థలోని తెలుగు సాహిత్య విమర్శల్లో ప్రామాణ్యాలు లోపించడం, సంప్రదాయిక సంస్కృత సాహిత్య విమర్శ పద్ధతుల నుంచి ప్రయోజనం పొందకపోవడం వంటివి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి వంటి పండితులు విశ్వవిద్యాలయాలు తమ విభాగాల్లోకి స్వీకరించే ప్రయత్నం చేయకపోవడం వల్లనే వచ్చిందని సాహిత్య పరిశోధకుడు వెల్చేరు నారాయణరావు పేర్కొన్నాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. శ్రీ శంకర విజయము. విజయవాడ: వెంకట్రామ అండ్ కో. 1952.
  2. మదాలసా విలాసము. భారత డిజిటల్ లైబ్రరీ. 1952.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  3. మధునాపంతుల, సత్యనారాయణశాస్త్రి (1950). ఆంధ్ర రచయితలు-మొదటి భాగం. భాగముఅద్దేపల్లి అండ్ కో. pp. 547–550.
  4. చేకూరి, రామారావు; ఎన్., గోపి (March 2017). "తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్వ్యూ". ఈమాట. Retrieved 2 April 2018. అప్పటికి తెలుగు దేశంలో పండితులుగా ఉన్నవాళ్ళు చేస్తున్న సాహిత్యవిమర్శ అప్పటి సంప్రదాయాల్లో క్షుణ్ణంగా ఉండేది అని నేను నమ్ముతున్నాను. అయితే దాని ప్రయోజనాలు విశ్వవిద్యాలయాలు పొందలేదు. ఎంచేత పొందలేదంటే డిగ్రీలు లేకపోతే ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనే పద్ధతి ఉంది కాబట్టి