Jump to content

శనివారపు సుబ్బారావు

వికీపీడియా నుండి

శనివారపు సుబ్బారావు (1896 - 1940) తొలినాళ్లలో గ్రంథాలయోద్యమ ప్రముఖులల్లో ఒకరు. వీరు గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని జీవనాధారమైన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న సుప్రసిద్ధ దేశభక్తులు.

జీవిత విశేషాలు

[మార్చు]

శనివారపు సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన ముద్దాపురం గ్రామంలో రామయ్య, మాణిక్యాంబ దంపతులకు 1896 వ సంవత్సరములో జన్మించారు[1]. వీరు కాశీ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. ఈయన భార్య పేరు రామలక్ష్మి. వీరికి ముగ్గురు కుమారులు సంతానం.

పత్రికా నిర్వహణ

[మార్చు]

వీరు 1923లో నిడదవోలు నుండి పల్లెటూరు అనే వారపత్రికను ప్రారంభించారు. దీనిలో గ్రామంలో జరిగే అన్యాయాలను, అప్పటి ప్రభుత్వ యంత్రాంగంలోని అక్రమాలను నిర్భయంగా వ్రాసేవారు. బ్రిటీష్ వారిచే అల్లూరు సీతారమ రాజు కాల్చి వేత వార్తను తొలిసారిగా ప్రచురించి నందుకు ఈ పత్రిక బ్రిటిష్ వారి కోపానికి గురయ్యింది.

ప్రచురణకర్త

[మార్చు]

పల్లెటూరు పత్రిక నిలిచిపోయిన తర్వాత తణుకులో పల్లెటూరు గ్రంథమండలిని ప్రారంభించి పుస్తకాలను ప్రచురించసాగారు. వీరికి ముదిగంటి జగ్గన్నశాస్త్రి పుస్తక ప్రచురణలో చేదోడు వాదోడుగా ఉన్నారు. వీరు ఆనాడు దేశంలోని వయోజనులలో అలుముకున్న అవిద్య చీకట్లను తొలగించేందుకు వయోజన విద్యా కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ, వయోజనులకు ఉపయోగపడే పుస్తకాలను ప్రచురించడానికి పూనుకున్నారు. తమ మిత్రుల వద్ద వాటా ఒకింటికి 25 రూపాయలచొప్పున 50,000 రూపాయలు సేకరించి ఆ మూలధనంతో 1936లో ది హిందుస్తాన్ పబ్లిషింగ్ కంపెనీ అనే ప్రచురణ సంస్థను రాజమండ్రిలో స్థాపించి దానికి మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేశారు. ఈ సంస్థ ద్వారా రెండు సంవత్సరాలలో 15 పుస్తకాలను ప్రచురించారు. అణా ప్రచురణ శాఖ, పావలా ప్రచురణ శాఖ, అర్ధ రూపాయి ప్రచురణ శాఖలు ఏర్పరచి చిన్నచిన్న పుస్తకాలను జె.సి.కుమారప్ప, పట్టాభి సీతారామయ్య, నరసింహదేవర సత్యనారాయణ, ముదిగంటి జగ్గన్నశాస్త్రి, ఎన్.జి.రంగా, చెరుకువాడ వేంకట నరసింహం మొదలైన మేధావులచే వ్రాయించి ప్రచురించారు[1].

జాతీయోద్యమం

[మార్చు]

నిడదవోలులో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న వీరు మహాత్మాగాంధీ పిలుపు మేరకు తమ జీవనాధారమైన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.ఫలితంగా వీరు 1930లో జైలు శిక్షను అనుభవించారు. 1925లో చాగల్లు రైల్వేస్టేషన్ సమీపంలో ఆనందనికేతనం అనే పేరుతో ఒక గాంధీ ఆశ్రమాన్ని స్థాపించి దాని నిర్వహణ బాధ్యతను తల్లాప్రగడ ప్రకాశరాయుడు గారికి అప్పగించారు[1].

సాహిత్యం

[మార్చు]

వీరు తమ పత్రిక పల్లెటూరులోను, ఆంధ్రపత్రికలోను అసంఖ్యకమైన వ్యాసాలు వ్రాసి ప్రజలలో విజ్ఞానజ్యోతులను వెదజాల్లేవారు. ఆంధ్ర ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో కేశవరంలో కవిపండిత సమ్మేళనాన్ని నిర్వహించారు. వీరు "మాలవ్యా నెహ్రు పండితుల ఉపన్యాసములు", "వయోజనవిద్య", "రైతుఋణ సమస్య", "గ్రామ పునర్నిర్మాణము", "ప్రభుత్వధనము - మన బీదతనము" (బాలాంత్రపు సత్యనారాయణరావుతో కలిసి) మొదలైన గ్రంథాలను రచించారు.

వయోజనవిద్య

[మార్చు]

శనివారపు సుబ్బారావు కేవలము సంఘ సేవ కొరకు తనువెత్తిన పుణ్యమూర్తి. వీరు దేశభక్తి ఊపిరిగా జీవించారు. తర్వాత అయ్యంకి వెంకటరమణయ్య గారి సహకారంతో వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టారు. 1925-40 మద్య కాలములో ప్రతి గ్రంథాలయంలో ప్రతి పాఠశాలలోనూ వేలాదిగా వయోజన విద్యాకేంద్రాలు పెట్టారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారితో సరిసమానంగా వయోజన విద్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.

విద్యారంగం

[మార్చు]

సమాజాన్ని ప్రభావితులు చేయగలిగేది ఉపాధ్యాయులే అని సుబ్బారావు గారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి తాడేపల్లిగూడెం తాలూకా బోర్డుచే ఒక ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలను ఏర్పాటు చేయించారు. అందులో ప్రముఖులచే అనేక ప్రసంగాలు ఇప్పించి ఆ ఉపన్యాసాలను 500 పేజీల సంకలనంగా ప్రచురించారు. వీరు 1923లో తణుకు జాతీయ హైస్కూలుకు కార్యదర్శిగా పనిచేశారు. గ్రామీణ పునర్నిర్మాణ తరగతుల పేరుతో ఉపాద్యాయులకు శిక్షణనిచ్చారు. అద్యాపకులకు అద్యాపకుడు అని మహాత్మాగాంధీ గారిచే ప్రశసింపబడ్డారు. రాజమండ్రిలో రామదాసు కోఆపరేటివ్ ట్రైనింగ్ స్కూలు, ఆంధ్ర కాలేజి ఆఫ్ కామర్స్ అనే సంస్థలను స్థాపించారు.

మరణం

[మార్చు]

వివిధ రంగాలలో నిరంతరకృషి సలిపిన శనివారపు సుబ్బారావుగారు తమ 45వ యేట కృష్ణాయపాలెం గ్రామంలో 1940లో మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 సిద్ధాని, నాగభూషణం (21 May 1978). "వయోజన విద్యోద్యమ పితామహుడు - శ్రీ శనివారపు సుబ్బారావు". ఆంధ్రపత్రిక. Retrieved 14 October 2016.[permanent dead link]

గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము. పుట 85