శాలిహోత్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శాలిహోత్ర మహర్షి ప్రముఖ పశువైద్య శాస్త్రకారుడు. పశువైద్యమును గురుంచి మొట్ట మొదట అధర్వణవేదములో చెప్పబడింది. పశువులలో నులుపురుగుల నివారణకు అందు కొన్ని చికిత్సలు సూచించబడినవి.మానవుడు చికిత్సా విధానాన్ని పశుపక్ష్యాదుల నుండే గ్రహించెనని అధర్వణవేదమునందు స్పష్టపరచుచున్నది. వేదకాలమునాటికి ప్రారంభదశలో ఉన్న పశు వైద్యము అనంతరకాలమున విస్తరించి బృహత్ శాస్త్రమైనది. ఈ శాస్త్రగ్రంధములన్నియు మహర్షుల చేత, పేరెన్నికగల వైద్యులచేత రచించబడినవి. ఈ శాస్త్రకారులలో శాలిహోత్రుడు ప్రథమగణ్యుడై భారతీయ పశు వైద్యశాస్త్ర పితామహుడు అయినాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

శాలిహోత్రుని జన్మస్థలముగాని, కాలముకాని ఇదమిత్థమని నిర్ణయించుటకు తగినన్ని ఆధారాలు లభించలేదు. శాలిహోత్రుడు అశ్వఘోషుడు కుమారుడని కొందరనిరి. ప్రముఖ వైద్య శాస్త్రకారుడగు సుశ్రుతునికి శాలిహోత్రుడు సమకాలికుడుగా కనబడుచున్నాడు. వీరిరువురికి గురుశిష్య సంబంధమును సూచించు ఈ క్రింది శ్లోకము మద్రాసు పాచ్య లిఖిత పుస్తక భాండాగారములోని ఒక వైద్య గ్రంథ ప్రారంభమున ఉంది.

శాలిహోత్రం మునిశ్రేష్ఠం సుశ్రుత: పరిపృఛ్ఛతి

దీనిని అనుసరించి సుశ్రుతుడు శాలిహోత్రుని శిష్యుడుగా కనబడుచున్నాడు. సిద్ధ సంగ్రహమును రచించిన గణుడు శాలిహోత్రుని అశ్వాయుర్వేధనిధి అని మహాయతి అని శ్లాఘించాడు. శాలిహోత్రుడు హిమాలయ గుహలలో నివసించెడివాడట. శాలిహోత్రుడు గురింది ఒక కథ హరిహర చతురంగము అను సంస్కృత గ్రంథమునందు ఈ విధముగా ఉంది.

బ్రహ్మదేవుని సృష్టియాగమున శుభలక్షణ శోభితమై నాలుగు రెక్కలు గల తెల్లని ఉత్తమాశ్వము పుట్టి ఆకాశమునకు ఎగిరినది. దానికి బ్రహ్మ నీవు సముద్రములో నివసింపుమని ఆదేశించెను. దేవాసురులు సముద్ర మథనము జరిపినపుడు అది మరల జన్మించింది. దానిని రాక్షస చక్రవర్తియగు బలి వశపరుచుకొని దేవతలందరిని జయించెను. దేవతలు బ్రహ్మను చేరి తమకు కూడా ఒక ఉత్తమాశ్వమును ఇవ్వవలసినదిగా ప్రార్థించిరి. బ్రహ్మా వారికిట్లనెను. ఓ దేవతలారా! దక్షయజ్ఞమున శుభలక్షణాంవితములై నాలుగు రెక్కలు కల తెల్లని గుర్రములు జన్మించినవి. ఇవి దక్షాధ్వర ప్రాంతమున సంచరించుచు యజ్ఞసంభారములను నాశనము చేయుటచే దక్షుడు కోపించి రెక్కలు తెగునట్లుగా వాటికి శాపమిచ్చెను. అవి తమను అనుగ్రహించమని దక్షుని కోరినవి. దక్షుడు అశ్వమేధయాగము వలన వాటికి పుణ్యలోక ప్రాప్తి కలుగునని హిమాలయగుహలలో నివసించమని పంపెను. అందువలన అవి ఇప్పుడు హిమాలయగుహలలో శాలిహోత మహర్షి ఆశ్రమప్రాంతమున ఉన్నాయి. కనుక మీరు ఆ మహర్షి అనుగ్రహముతో వాటిని పొందుడు అని చెప్పెను. దేవతలు శాలిహోత్ర మునిని ప్రార్థించగా శాలిహోత్రుడు ఆ గుర్రములను దేవతలకు, మనుష్యులకు పంచి ఇచ్చెను. మానవులకిచ్చిన గుర్రముల వంశములోనివే ఇప్పుడు భూమిమీద గల గుర్రములు.

అభినవచంద్రుడు రచించిన అశ్వశాస్త్రమను కన్నడ గ్రంథమున ఈ కథ ఇట్లున్నది. గుర్రములు నాలుగు విధములుగా పుట్టి తమ తమ రెక్కలతో సంచరించుచు లోకహింస చేయుచుండగా బ్రహ్మ తన యజ్ఞమున పుట్టిన శాలిహోత్రుని ఆ గుర్రములను శిక్షించమని కోరెను. శాలిహోత్రుడు తన మంత్రాక్షర బలముతో ఆగుర్రముల రెక్కలను కత్తిరించి వాటిని దేవతలకి అప్పగించెను. అభినవచంద్రుడు శాలిహోత్రుని తురగ వ్యాపార కర్మకౌశలుడని, సకలశాస్త్ర కోవిదుడని, శాపానుగ్రహ సమర్ధుడని పేర్కొనెను.

అశ్వజాతిని శిక్షించుటకు, సంరక్షించుటకు శాలిహోత్రుడే ఆద్యుడని ఈ కథలు తెలుపుచున్నవి. ఈ శాలిహోత్రుడు బహుశా అనేక అశ్వమేధయాగములు చేసి అశ్వ శరీర రచన, వికృతి విజ్ఞానము మొదలగునవి అధ్యయనము చేసి అశ్వశాస్త్రమును రచించియుండెను. ఈతని రచన శాలిహోత్రియము ప్రపంచ ప్రసిద్ధ గన్న అశ్వశాస్త్రము. మొగలాయ్ చక్రవర్తి షాజహాన్ చిత్తూరు దండయాత్రలో ఈ గ్రంథమును సంపాదించి, దీనిని అరబీ భాషలోకి తర్జుమా చేయించెను. 17వ శతాబ్దిలో ఈ అరబీ గ్రంథము ఇంగ్లీషులోకి అనువదించబడింది. ఈ ఆంగ్ల అనువాదములు ఒకటి బెర్లిన్ లైబ్రరీలో, రెండవది లండన్ లైబ్రరీలోను ఉన్నాయి. అశ్వాయుర్వేదము అని దీనిని టిబెట్ భాషలోకి భాషాంతీకరించబడింది.

మద్రాసు పాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందు అశ్వచికిత్సాసారము అనుపేర శాలిహోత్రుడు రచించిన ఎనిమిది అధ్యాయముల గ్రంథము తెలుగు వివరణతో ఉంది. తంజావూరు సరస్వతీ మహలులో అశ్వాయుర్వేద సిద్ధయోగ సంగ్రహము, అశ్వశాంతి విధానము ఉన్నాయి. మైసూరు ప్రాచ్యలిఖిత పుస్తక భాంఢాగారమునందు అశ్వశాస్త్రము, అశ్వలక్షణ శాస్త్రము ఉన్నాయి. కాశీలో కవీంద్రాచార్య గ్రంథాలయమునందు అశ్వహృదయము శాలిహోత్రుని రచనలుగా ఉపలభ్దమగుచున్నవి.

కాళిదాసుని రఘువంశములో 5వ సర్గ, 73వ శ్లోక వ్యాఖ్యానమున మల్లినాధుడు శాలిహోత్రుని సింధుయోగ సంగ్రహము అను గ్రంథమును పేర్కొనెను. వాణీవిలాస వనమాలిక అను తెలుగు గ్రంథమున శాలిహోత్రుడు గజశాస్త్ర రచయితగా పేర్కొనబడినాడు.

పాండవులను గౌరవించిన ఈ శాలిహోత్రుడును, శాలిహోత్రియ రచయితయు భిన్నులై ఉందురేమో!

శాలిహోత్రము అనగా పశువైద్య కళకు వాడుకపేరు అని వివరించబడింది.భోజరాజు, జయదత్తుడు మొదలగువారు తాము రచించిన పశువైద్య శాస్త్రగ్రంధములకు శాలిహోత్రము అని పేరెడినారు. అశోకుడు దేశమంతటా పశువైద్యశాలలను ఏర్పాటుచేయించాడు.అందు పశువైద్యులను నియమించాడు.వారిని శాలిహోత్రులని పిలిచెడివారు.

మూలములు

[మార్చు]
  • 1981 భారతి మాస పత్రిక. వ్యాసము:భారతీయ పశువైద్య శాస్త్ర పితామహుడు- శాలిహోత్రుడు. వ్యాసకర్త: శ్రీ సూర్యదేవర రవికుమార్.