శిలావరణం
శిలావరణం అంటే భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పైపొర. ఇందులో రాళ్లు ఖనిజాలు లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో లితోస్పియర్ అంటారు. లితో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం. స్పేయిరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాథాలు వంటివి ఉంటాయి. వీటిలో పలు అంశాలు గాలి నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి. పై పొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది. సూర్యకిరణాలకు ఈ శిలావరణం వేడెక్కినప్పుడు, తరువాత చల్లబడినప్పుడు అది గాలిని నీటిని ప్రభావితం చేస్తుంది. మానవులతో సహా అనేక జీవులు, ఈ మండలంపై నివసిస్తున్నాయి. ఈ గట్టిపొరలో ఉండే రాళ్లని మట్టి, ఇతర వస్తువులు అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
భూ స్వరూపాలు
[మార్చు]మనం నివసిస్తున్న నేలకు సంబంధించినది శిలావరణం. భూమి పై పొర (క్రస్ట్) సమతలంగా లేదు. లోతైన అగాథాలు నీటితో నిండి మహాసముద్రాలుగాను, మిగిలినది ఖండాలుగా ఉన్నాయి. వీటిని భూ శాస్ర్తజ్ఞులు మొదటి శ్రేణి భూ స్వరూపాలు అంటారు. భూమి పై పొరను ప్రాథమికంగా మహాసముద్రాలు, ఖండాలుగా విభజిస్తారు.
ఖండాల ఉపరితలం సమతలంగా లేదు. వీటిలో మైదానప్రాంతాలు, పీఠభూములు, ఎత్తైన పర్వతాలూ ఉన్నాయి. పర్వతాలు మైదానాలు పీఠభూములను రెండవ శ్రేణి భూ స్వరూపాలు అంటారు
జిగ్ సా పజిల్ కదులుతున్న ఫలకాలు
[మార్చు]ఎన్నో సంవత్సరాల సునిశిత అధ్యయనం ద్వారా ఖండాలు మహాసముద్రాలు కూడ ఫలకాలు అనే అతి పెద్ద రాళ్ల మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. భూమిలో పెద్ద ఫలకాలు, అనేక చిన్న ఫలకాలూ ఉన్నాయి. ఈ ఫలకాలు మద్యపొరపై తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి. అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు. ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది. రెండు ఫలకాలు కలిసే చోట ఒకదానికొకటి నెట్టుకుంటాయి. ఒకదానిమీద మరొకటి ఎంతో వత్తిడి చూపుతుంది. ఒక ఫలకం కిందికి మద్యపొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాల వంటివి సంభవిస్తాయి.
సముద్ర నేల విస్తరంచడం
[మార్చు]సముద్రాలలోని భూమి పై పొరను అధ్యయనం చేస్తున్న భూ శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహాసముద్రాలలో మద్యభాగంలో మిట్టలు పర్వతశ్రేణులు ఉంటాయి అని గమనించారు. మద్య పొర నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి. మిట్ట ప్రాంతంలో నేల పైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్లతో కూడిన సముద్రపు కొత్త నేల తయారవుతుంది. ఆ తరువాత ఇది మిట్టనుంచి రెండు వైపులా విస్తరిస్తుంది. అంటే భూమి మీద మహా సముద్ర మద్య ప్రాంతంలోని మిట్టలలో అత్యంత తాజాగా ఏర్పడిన పై పొర ఉంటుంది. తాజాగా ఏర్పడిన పై పొర, ఫలకాన్ని మిట్టనుంచి దూరంగా నెడుతుంది. సముద్రపు నేల విస్తరణ అన్న ప్రక్రియకు ఇది దారి తీస్తుంది
అంచుల వద్ద నాటకీయ పరిణామాలు
[మార్చు]పలకల అంచుల వద్ద లేదా పలకలు కలిసే సరిహద్దుల వద్ద భూ చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త పైపొర ఏర్పడి మహాసముద్రాల మద్య భాగంలో మిట్టల వద్ద సముద్రపు నేల విస్తరించడానికి ఎలా దారి తీసిందో, అదే విధంగా పలకలు కలిసే చోట కదులుతూ ఉన్న ఫలకం కిందకు వెళ్తుంది. వాస్తవానికి ఈ పలక అంచు, మద్యపొరలోకి వెళ్లి అక్కడి వేడికి ద్రవంగా మారుతుంది. మద్యపొరలోకి వెళుతున్న పలక దానితో పాటు మొత్తం పలకాన్ని తనతోపాటు లాగుతూ ఉంటుంది. ఇది తిరిగి మహాసముద్రపు మిట్టప్రాంతం వద్ద కొత్తగా ఏర్పడిన సముద్రపు నేలను లాగుతుంది. ఉదాహరణకు ఇండియా ఫలక యూరేసియా పలకను నెడుతూ, హిమాలయాలు ఉన్నచోట దాని కిందకు వెళుతుంది. అనేక ఫలకాల అంచుల వద్ద అగ్ని పర్వతాలున్నాయి. భూకంపాలు సంభవిస్తుంటాయి. అగ్నిపర్వతాలు పేలటానికి భూకంపాలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఇవే.
ఆకస్మిక నిదాన కదలికలు
[మార్చు]శిలావరణంలో జరుగుతున్న రెండు రకాలు
[మార్చు]మొదటిది పైపొర ఏర్పాటుకు దారి తీసే నిదాన కదలికలు ఖండ ఫలకాల కదలికలు అంతిమంగా అవి మద్య పొరలో కలవటం. రెండవ రకం మార్పులు అకస్మాత్తుగా అగ్ని పర్వతాలు పేలటం భూకంపాలు సంభవించటం. ఈ ఆకస్మిక కదలికలు విధ్వంసకరంగా ఉండి, చాలా నష్టం జరుగుతుంది. అదే సమయంలో ఇవి భూస్వరూపంలో మార్పులకు దారి తీస్తాయి.
అగ్నిపర్వతాలు
[మార్చు]భూగర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో గొట్టం వలె ఉండే భాగాల నుండి బయటకు వస్తుంది. బయటకు ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్నిపర్వతం అంటారు. కరిగిన పదార్థంతో పాటు భూమి లోపలి పొరల్లోంచి నీటి ఆవిరి పొగ, అనేక రకాల వాయువులు ఎగజిమ్ముతాయి. పొగ, బూడిద, ధూళి వంటివి వాతావరణంలో కలుస్తాయి. కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది. వీటిని అగ్ని శిలలు అంటారు.
లావాలో కొంతభాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టి పడుతుంది. వీటిని లోపలికి ఏర్పడిన భూస్వరూపాలు అంటారు. ఇవి సాదారణంగా పురాతన శిలలతో కప్పబడి, భూమి లోపల ఉంటాయి. కప్పి ఉన్న శిలలు భూమి కోత వల్ల తొలగిపోయినప్పుడు, ఈ లోపలి శిలలు బయటపడతాయి. భూమి ఉపరితలం పైకి వచ్చిన లావాలో కొంతభాగం బయటకి చొచ్చుకు వచ్చిన భూ స్వరూపాలు అంటారు. అయితే, ఇవన్నీ అగ్ని పర్వతాల నుంచి వచ్చినవే కానవసరం లేదు. భూమిలో ఉన్న పగుళ్ల నుంచి బయటకు వచ్చి చుట్టు పక్కలకు వ్యాపించటం వల్ల కొన్ని ఏర్పడతాయి.