Jump to content

శివకాశి బాణాసంచా

వికీపీడియా నుండి

తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న శివకాశి పట్టణం భారతదేశంలో బాణాసంచా ఉత్పత్తికి ప్రఖ్యాతి చెందింది. బాణాసంచాను ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో పేల్చినప్పటికీ వివాహాలు, ఎన్నికల ఊరేగింపులు, నాయకుల పుట్టినరోజు వేడుకలు, క్రీడలలో విజయం సాధించినప్పుడు మొదలైన అనేక సందర్భాలలో ఉపయోగిస్తారు.

చరిత్ర

[మార్చు]

బాణాసంచా వినియోగం భారతదేశంలో 19వ శతాబ్దం తొలినాళ్లలో ప్రారంభమైంది. మొట్టమొదటి బాణాసంచా కర్మాగారం కలకత్తాలో ప్రారంభమైంది. శివకాశి ప్రాంతం నుండి పి.అయ్యన్ నాడర్, షణ్ముగ నాడర్ అనే ఇరువురు సోదరులు కలకత్తా వెళ్లి అక్కడ పనిచేశారు. వారు అగ్గిపెట్టెల, బాణాసంచా తయారీలో మెలకువలు నేర్చుకుని శివకాశికి తిరిగి వచ్చి 1923లో అగ్గిపెట్టెల పరిశ్రమ ప్రారంభించారు. తరువాత ఎనిమిది నెలలకు జర్మనీ నుండి యంత్రాలను దిగుమతి చేసుకుని అనిల్ బ్రాండ్, అయ్యన్ బ్రాండ్ పేరుతో బాణాసంచా ఉత్పత్తిని ప్రారంభించారు[1]. ఆ విధంగా ఈ పరిశ్రమ కలకత్తా నుండి శివకాశికి తరలించబడింది. 1940లో ప్రేలుడు పదార్థాల చట్టం ఏర్పాటై బాణాసంచా కర్మాగారాల లైసెన్సింగ్ విధానం, బాణాసంచా నిలువ, అమ్మకాలపై నియంత్రణ మొదలయ్యింది. శివకాశిలో 8000లకు పైగా బాణాసంచా ఉత్పత్తి చేసే పరిశ్రమలున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బాణాసంచాలో 90 శాతము ఇక్కడి నుండే వెలువడుతున్నది. ప్రతియేటా 800 నుండి 1000 కోట్ల రూపాయల బాణాసంచా వ్యాపారం ఇక్కడి నుండి నడుస్తున్నది. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశం ముఖ్యంగా శివకాశి 365 మిలియన్ డాలర్ల వార్షిక టర్నోవర్‌తో బాణాసంచా ఉత్పత్తిలో ముందున్నది[2].

ప్రమాదాలు

[మార్చు]

సుమారు 7 లక్షలమంది కార్మికులు ఈ బాణాసంచా పరిశ్రమలలో పనిచేస్తున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇక్కడ తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతియేటా 20-25 మంది ప్రేలుళ్ల వలన మరణిస్తున్నారు. ఈ పరిశ్రమలలో ఉపయోగించే రసాయనాల వలన కార్మికులు శ్వాసకోశ సంబంధ వ్యాధులకు తరచూ గురి అవుతున్నారు[3].

మూలాలు

[మార్చు]