శివరంజని
శివరంజని సినిమా కోసం ఇక్కడ చూడండి.
శివరంజని రాగం హిందుస్తానీ జన్యం, లలిత సంగీతంలో సుప్రసిద్ధమైనది. సాధారణంగా కరుణ రసాన్ని బాగా పరిపోషించగల జన్య రాగంగా పేరొందింది.
రాగ లక్షణాలు
[మార్చు]శివరంజని (హిందుస్తానీ) ఔడవ రాగం, అంటే ఆరోహణలోనూ అవరోహణలోనూ ఐదు స్వరాలే ఉన్న రాగం. శివరంజని రాగానికి హిందుస్తానీ కాఫీ ఠఠ్ రాగం మూలం. ఈ రాగం మోహన రాగానికి స్వరపరంగా చాలా దగ్గరగా ఉంటుంది. మోహన రాగంలోని తీవ్ర గాంధారం బదులు కోమల గాంధారం వాడితే శివరంజని అవుతుంది. ఐతే తీవ్ర స్వరం, కోమల స్వరంతో మారడంతో రాగచ్చాల్లో స్ఫుటమైన మార్పులు రావడం విశేషం. శివరంజనిలో నిషిద్ధ స్వరాలైన మధ్యమం, నిషాదం వాడితే దాన్ని మిశ్ర శివరంజని అంటారు. శివరంజని రాగలక్షణాలు సాంకేతికంగా ఇలా చూపుతారు::;[1] ఆరోహణ స రిగా ప – ధ – స (పై షడ్జమం)
- అవరోహణ
స (పై షడ్జమం) ధ ప –గా s – రి స s
సంప్రదాయం, చరిత్ర
[మార్చు]శివరంజనిగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఈ రాగానికి మూలం హిందుస్తానీ సంగీతంలోని కాఫీ ఠఠ్. కర్ణాటక సంగీతానికి చెందిన శివరంజనితో ఈ రాగానికి ఏ సంబంధం లేదు. నిజానికి ఈ రాగం 1940ల తర్వాతే ముఖ్యంగా లలిత సంగీతంలో ప్రాచుర్యం పొందింది.[1]
ఉదాహరణలు
[మార్చు]శివరంజని రాగాన్ని సినిమా, లలిత సంగీతాల్లో తరచుగా వాడుతుంటారు. వాటిలో కొన్ని ప్రఖ్యాతమైన ఉదాహరణలు:
- తూర్పు పడమర సినిమాలో రమేష్ నాయుడు స్వరపరిచిన శివరంజనీ.. నవరాగిణీ పాట శివరంజని రాగానికి ఉదాహరణ. ఆయనే సంగీత దర్శకత్వం వహించిన శివరంజని సినిమాలోని అభినవ తారవో పాటలో పల్లవి వరకూ శివరంజని రాగంలోనే ఉంటుంది. రమేష్ నాయుడు స్వరపరిచిన మేఘ సందేశంలోని ఆకాశ దేశాన ఆషాఢ మాసాన అన్న ప్రజాదరణ పొందిన గీతం కూడా ఇదే రాగంలో చేశారు.[1]
- ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఓ ప్రయోగం చేశారు. సాధారణంగా శివరంజని రాగం విషాదాన్ని బాగా పలికిస్తుందని పేరు, ఐతే ఇళయరాజా అబ్బనీ తియ్యనీ దెబ్బ అన్న పాటను శివరంజని రాగంలో చేసి విజయం సాధించారు. అదే కోవలోకి ఘంటసాల స్వరపరిచిన ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే (బందిపోటు) పాట కూడా శివరంజని రాగంలో చేసిన యుగళ గీతమే.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 విష్ణుభొట్ల, లక్ష్మన్న (మార్చి 2016). మాచవరం, మాధవ్; పాణిని, శంఖవరం (eds.). "శివరంజని". ఈమాట. రాగలహరి. Retrieved 30 March 2016.