శ్మశాన కక్ష్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్మశాన కక్ష్య అంటే ఉపగ్రహాల జీవిత కాలం పూర్తయ్యాక వాటిని తరలించే కక్ష్య. ఇది సాధారణంగా ఉపగ్రహాలు పరిభ్రమించే కక్ష్యలకు ఆవల ఉంటుంది. దీన్ని చెత్తబుట్ట కక్ష్య అనీ, డిస్పోజల్ కక్ష్య అనీ కూడా అంటారు. ఈ కక్ష్య సమన్వయ కక్ష్యకు బాగా ఆవల ఉంటుంది. దీన్ని అధిసమన్వయ కక్ష్య అని అనవచ్చు. పనిచేసే ఉపగ్రహాలకు గుద్దుకునే అవకాశాలను తగ్గించడం కోసం వీటిని శ్మశాన కక్ష్యకు తరలిస్తారు. అలా తరలించిన ఉపగ్రహాలలోని అంతర్గత శక్తిని తొలగించి నిర్వీర్యం చేస్తారు.

ఉపగ్రహాన్ని కక్ష్య నుండి భూమి వైపు లాగి, భూ వాతావరణంలో మండిపోయేలా చేసేందుకు (డీ-ఆర్బిట్) కావలసిన వేగం బాగా ఎక్కువైనపుడు ఈ శ్మశాన కక్ష్యకు తరలిస్తారు. భూ స్థిర కక్ష్యలో ఉన్న ఉపగ్రహాన్ని భూమి వైపు లాగివేసేందుకు అవసరమైన డెల్టా-వి 1,500 మీటర్లు/సెకండు. అయితే దీన్ని శ్మశాన కక్ష్యలోకి పంపేందుకు అవసరమైన డెల్టా-వి కేవలం 11 మీటర్లు/సెకండు.[1]

భూ స్థిర కక్ష్యలోను, భూ సమవర్తన కక్ష్యలోనూ ఉండే ఉపగ్రహాల శ్మశాన కక్ష్య, ఆయా కక్ష్యలకు కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. భూస్థిర కక్ష్య నుండి  ఉపగ్రహాన్ని శ్మశాన కక్ష్యలోకి పంపేందుకు అవసరమైన  ఇంధనం ఆ ఉపగ్రహపు మూణ్ణెల్ల  స్టేషన్ కీపింగ్ కు సమానం. బదిలీ చేసేటపుడు విశ్వసనీయమైన ఎత్తు నియంత్రణ కూడా అవసరం. 2005 వరకు శ్మశాన కక్ష్యలోకి పంపడానికి చేసిన  ప్రయత్నాల్లో మూడవ వంతు మాత్రమే విజయవంతమయ్యాయి.[2] అయితే 2011 నాటికి మాత్రం జీవిత కాలం ముగిసిన భూ సమన్వయ ఉపగ్రహాలు చాలావరకు శ్మశాన కక్ష్యలోకి పంపారని తెలుస్తోంది.[3]

Inter-Agency Space Debris Coordination Committee (IADC) [4] ప్రకారం భూ స్థిర కక్ష్యకు పైన ఉండవలసిన కనీస పెరిజీ ఎత్తు :

సౌర ధార్మిక వత్తిడి గుణకం (సోలార్ రేడియేషన్ కోఎఫిషిఎంట్) (1.2 నుండి 1.5 N·m−2 or Pa)  

- ఉపగ్రహ ఏస్పెక్ట్ ఏరియా [m²]కు ద్రవ్యరాశి [kg]కీ గల నిష్పత్తి. భూ స్థిర కక్ష్యా క్షేత్రమైన 200 కిలోమీటర్లు, సూర్య చంద్రుల గురుత్వాకర్షణ  ప్రభావాన్నిఎదుర్కొనేందుకు 35 కిలోమీటర్లను (235 కిమీ) కనీస ఆవశ్యకతగా ఈ సమీకరణంలో పొందుపరచారు. సమీకరణంలోని మిగతా భాగం సౌర ధార్మిక వత్తిడి, ఉపగ్రహ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

అమెరికాలో 2002, మార్చి 18 నుండి ప్రయోగించిన భూస్థిర ఉపగ్రహాలు సమాచార రంగంలో పనిచేసేందుకు లైసెన్సు కావాలంటే వాటి జీవిత కాలాంతాన శ్మశాన కక్ష్యలోకి పంపిస్తామనే ఒప్పందం చేసి తీరాలి.[5] అమెరికా ప్రభుత్వ నిబంధన ప్రకారం అవసరమైన ఎత్తు  ~300 కిలోమీటర్లు.[6]

మూలాలు, వనరులు[మార్చు]