Jump to content

సంకు అప్పారావు

వికీపీడియా నుండి
సంకు అప్పారావు
జననంజూన్ 16, 1917
భీమవరం తాలూకా కొందేపాడు గ్రామం
మరణంమే 29, 1992
స్వగృహం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్
విద్యతణుకు హైస్కూలు
వృత్తిఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు, సి పి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పిల్లలుమనోరమ, సూర్యకుమారి, సుజాత, విజయకుమార్, రవి
కుటుంబంలక్ష్మీకాంతం (భార్య)

కామ్రేడ్ సంకు అప్పారావు స్వాతంత్య్ర సమరయోధులు, తొలితరం కమ్యూనిస్టు నాయకులు, రాష్ట్ర రైతుసంఘ నాయకులు. వీరు 1917లో జూన్ 16న భీమవరం తాలూకా కొందేపాడు గ్రామంలో జన్మించారు. తుది శ్వాస వరకు ఆయన తన జీవితాన్ని రైతుల కోసం శ్రామిక రాజ్య సాధన కోసం అంకితం చేశారు. 1992 మే 29న ఏలూరులో తన స్వగృహంలో మరణించారు.

చదువు

[మార్చు]

తణుకు హైస్కూల్ లో చదువుకున్నారు. అప్పుడు అక్కడే చదువుతున్న చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు, ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, దూసనపూడి విరాటరాజు గార్లు సహాధ్యాయులుగా వున్నారు. తర్వాత వారు ఏఏ పార్టీలలో వున్నా వారి స్నేహం నిరంతరాయంగా కొనసాగింది. అప్పారావు విద్యార్థి, యువజన ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు.

కొన్ని ముఖ్య ఘట్టాలు

[మార్చు]

పశ్చిమ గోదావరిజిల్లాలో తొలితరం కమ్యూనిస్టులలో ఆయన ఒకరు. 1937 లోనే పార్టీ సభ్యత్వం పొందారు. కమ్యూనిస్టు పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినందున కాంగ్రెస్ లో భాగంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ లో చేరి పనిచేశారు.

కొత్తపట్నం రాజకీయ పాఠశాల

[మార్చు]

1937 లో మే నెలలో ఆనాటి గుంటూరు జిల్లా కొత్తపట్నం లో జరిగిన తొలి రాజకీయ పాఠశాలలో పాల్గొన్నారు. మధ్యలోనే ప్రభుత్వం ఆ పాఠశాలను నిషేధించి పోలీసులతో దాడి చేయించి దొరికిన వారిని అరెస్టు చేయించింది. అప్పారావు ని అరెస్టు చేసి ఒంగోలు, తెనాలి సబ్ జైళ్ళ లో నిర్బంధిచారు. ఆ సందర్భంలో ఆయన పోలీసుల చిత్రహింసలకు గురి అయ్యారు.

1937లో చారిత్రాత్మకమైన రక్షణయాత్ర

[మార్చు]

రాష్ట్ర రైతు నాయకులు కొమ్మారెడ్డి సత్య నారాయణమూర్తి, చలసాని వాసుదేవరావు గార్ల నాయకత్వాన ఇచ్ఛాపురం నుండి తడ వరకు సాగినప్పుడు జిల్లాలో ఆ మూల నుండి ఈ మూల వరకు వందల గ్రామాలలో రైతు సంఘం గురించి, జమిందారీ వ్యతిరేక పోరాటాల గురించి రైతు సంఘం ప్రచారం గావించింది. జిల్లాలో ఈ యాత్ర జయప్రదం కావడంలో అప్పారావు ముఖ్య పాత్ర పోషించారు.

జమీందారీ వ్యతిరేక పోరాటాలు

[మార్చు]

1939 చరిత్ర ప్రసిద్ధమైన కాళీపట్నం జమీందారీ వ్యతిరేక పోరాటం జరిగింది. నర్సాపురం తాలూకా కాళీపట్నం గ్రామం లో జమీందారు, రైతులను దగా చేసి 7,500 ఎకరాలకు తన స్వంత భూమి అని చెప్పి అమ్మకం పెట్టాడు. పోలీసులను పెట్టుకొని 144 సెక్షన్ పెట్టించి రైతులను బెదిరించి లొంగదీయడానికి ప్రయత్నించాడు. రైతు నాయకులు సంకు అప్పారావు, గొట్టుముక్కల వెంకట్రామరాజు, కృత్తివెంటి వెంకటేశ్వరరావు, కాళీపట్నం వెళ్లి మొత్తం రిపోర్టు సేకరించి నర్సాపురం తాలూకా రైతు సంఘానికి నివేదిక సమర్పించారు. ఇందుపై సత్యాగ్రహ పోరాటం జరపాలని తాలూకా కాంగ్రెస్ నిర్ణ యించింది. 7-3-39న సత్యాగ్రహం ప్రారంభమైంది. కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు, రైతులు, స్త్రీలు, పురుషులు వందలాది మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కాళీపట్నం జమీందారీ భూములను సాగు చేసుకుంటున్న రైతులను పోలీసులతో బలవంతంగా తొలగించడాన్ని ప్రతిఘటిస్తూ సాగిన రైతు సత్యాగ్రహం తొలి బృందానికి సంకు అప్పారావు నాయకత్వం వహించి అరెస్టు అయ్యారు.

1943-44 సంవత్సరాలలో జరిగిన కలవలపల్లి - సూరాపురం జమీందారీ రైతుల పోరాటంలో, గోపాలపురం జమీందారీ వ్యతిరేక పోరాటంలో, కానూరు -- పెండ్యాల లంక రైతుల పోరాటంలో అప్పారావు ప్రముఖ పాత్ర పోషించారు.

రహస్య జీవితం

[మార్చు]

1940-52 మధ్యకాలంలో ఆయనపై అరెస్టు వారెంటు వున్నందున పోలీసులకు చిక్కకుండా 10 సంవత్సరాల 6 నెలల పాటు రహస్య జీవితం గడిపారు. రహస్య జీవిత కాలం లో కూడా జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. అప్పారావు ను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు కొందేపాడు గ్రామం పై పలు సార్లు దాడులు చేశారు. అయన పొలం లోని పైరును కోసుకు పోయారు. ఆచూకీ చెప్పమని 70 సంవత్సరాల ముదుసలి తండ్రి ని కొట్టారు. ఇంట్లోని సామానులను ధ్వంసం చేశారు. సంకు అప్పారావు భార్య లక్ష్మీ కాంతం గారిని 6 నెలలపాటు పోలీసులు గృహ నిర్బంధలో ఉంచారు. నిర్బంధ కాలం ముగిసిన తర్వాత లక్ష్మీకాంతం గారు మహిళా సంఘం కార్యకలాపాలలో క్రియాశీల పాత్ర పోషించారు. జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలుగా దీర్ఘకాలం పనిచేశారు.

ఎన్నికలు

[మార్చు]

1952 ఎన్నికలలో పోలవరం నుండి పోటీచేసి కేవలం 450 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీ చేసి శాసనమండలికి ఎన్నికయ్యారు. అత్తిలి, ఏలూరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన వివిధ ఎన్నికల్లో సి పి ఐ అభ్యర్థి గా పోటీ చేశారు.

ఇతర ఉద్యమాలు

[మార్చు]

సంకు అప్పారావు నిరంతర పోరాట యోధుడు. 1970 దశకంలో గోదావరి బ్యారేజీ నిర్మాణానికి సాగిన ఉద్యమాన్ని ప్రభుత్వ హామీ లభించేవరకూ రైతులను సమీకరించి ఆందోళన సాగించారు. పోలవరం ప్రాజెక్టు సాధనకు సాగిన అన్ని ఉద్యమాలలో ప్రముఖ పాత్రధారిగా ఉన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో జరిగిన అనేక రైతు పోరాటాలకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. 1992 మే 29 న ఏలూరులో తన స్వగృహంలో మరణించారు.

మూలాలు

[మార్చు]

సంకు అప్పారావు శత జయంతి విశేష సంచిక