సబితం జలపాతం
సబితం జలపాతం పెద్దపల్లి జిల్లా లోని రామగుండం మండలంలోని సబితం గ్రామంలో ఉంది. గ్రామానికి దక్షిణదిశలో వున్న గుట్టల్లో ఆగ్నేయంగా వర్షాలవల్ల ఈ జలపాతం పుట్టింది.
ఈ జలపాతం 40 అడుగుల ఎత్తునుండి రెండు పాయలుగా కిందికి జాలువారుతూ ఉంటుంది. జలపాతం కింద చాలా లోతైన గుండం ఉంది. ఈ గుండంలోకి దిగడానికి ఎవరూ సాహసించరు. ఈ జలపాతానికి రెండు దిక్కుల్లో వున్న ఆకుపచ్చనిచెట్ల పచ్చదనం, జేగురురంగు రాతిబండలు, తెల్లనినీరు త్రివర్ణాలు అద్బుతదృశ్యాన్ని ఆవిష్కరిస్తుంటాయి.ఈ జలపాతం రామగుండంలో చూడదగిన పర్యాటక ప్రదేశం .
గుహాలయం
[మార్చు]సబితం జలపాతానికి ఎడమవైపున గుట్టలో తొలిచిన గుహాలయం ఉంది. ఈ గుహాలయంలో కుడివైపున మొదటిగుహలో రాతిగొడపై చెక్కిన అర్ధశిల్పాల్లో ఆసనస్థితిలో షణ్ముఖుడు, ముడిచిన జటాఝూటంతో ఆసనస్థితిలో నమస్కారముద్రతో శివుడు, (కాయోత్సర్గభంగిమ) స్థాణకస్థితిలో కుడిచేతిలో గదతో గణపతి కనిపిస్తారు. వీటికి ఎడమవైపున వున్న రాతిగోడలపై చెక్కినట్లు ఉలిగుర్తులు ఉన్నాయి. రెండవ (మధ్య) గుహాలయం మధ్య లింగాన్ని అమర్చే రంధ్రంలో తాత్కాలికంగా దానిలో రాతిముక్క పెట్టివుంది. మూడవ గుహాలయం ఖాళీగావుంది. వీటికి ఎదురుగా బయట విష్ణుమూర్తి, శివలింగం, నంది, సూర్యుడు, దుర్గ, నాగదేవతల నల్లరాతి శిల్పాలు కొత్తగా కట్టిన వేదికమీద ప్రతిష్ఠించి ఉన్నాయి.
గుహాలయాల స్తంభాలపై చెక్కిన డిజైన్లు బౌద్ధ ఆరామస్తంభాలవలె కనిపిస్తుండడంతో ఇక్కడ బౌద్ధులు ‘వస్సావాసం (వర్షాకాలంలో నివసించే తాత్కాలిక నివాసం)’ ఏర్పాటు చేసుకున్నట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు.