సాధు వరదరాజం పంతులు
సాధు వరదరాజం పంతులు తమిళనాడులో తెలుగు భాష కోసం కృషి చేసిన వారిలో ఒకడు.[1] అతను తమిళ భాషను రెండవ అధికార భాషగా గుర్తించాలని పోరాడిన వ్యక్తి.
బాల్యం - ఉద్యోగం
[మార్చు]సాధు వరదరాజం పంతులు తిరునల్వేలి జిల్లాలోని వీరరాఘవపురంలో 1889 ఆగస్టు 20న జన్మించాడు[2]. అతని తండ్రి రామకృష్ణయ్య పంతులు తమిళ నాడులో వివిధ ప్రభుత్వోద్యోగాలలోను, ఎట్టియాపురం సంస్థానంలో దివాన్ గాను పనిచేశాడు. ఈ సంస్థానాన్ని పాలించే ఎట్టియాపురం తెలుగు రాజులు తెలుగు సంగీత సాహిత్యాలను ఆదరించారు. పట్టభద్రు డయిన తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంవారి తమిళ్ లెక్సికన్ (తమిళ శబ్దకోసం) కార్యాలయంలో ఒక చిన్న గుమాస్తాగా చేరి ఆఫీసు మేనేజరుగా చాలా కాలం పనిచేసి పదవీవిరమణ చేసాడు. తమిళ నిఘంటు కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అతనికి తెలుగు మీద అభిమానం ఏర్పడింది.
తెలుగు భాష మీద ప్రావీణ్యం
[మార్చు]తెలుగు సాహిత్యంలో పరిచయం లేదు. తెలుగు మీద ఇష్టంతో తెలుగు లిపి నేర్చుకున్నాడు. తెలుగు భాషలో ప్రావీణ్యం కోసం తెలుగు శతకాలు, భాస్కర రామాయణం, పోతన భాగవతం, వీరేశలింగంగారి రచనలు, ఆంధ్రపత్రిక లు చదివాడు. తాను నేర్చుకున్నదే కాక అతని యింట్లో వాళ్ళకు కూడా తెలుగు నేర్పాడు. దీని వలన వరదరాజం పంతులు భార్య జయలక్ష్మమ్మ, కుమారుడు శివసుబ్రహ్మణ్యం తెలుగులో ప్రావీణ్యం సంపాదించారు.
తెలుగు కోసం ఉద్యమం
[మార్చు]1920 సంవత్సర జనాభా లెక్కల ప్రకారం ఆ ప్రాంతాలలో నివసిస్తున్న 38 లక్షల మంది తెలుగు వారికి తెలుగు మాట్లాడడం వచ్చినా వ్రాయడం, చదవడం రాదు. 1924 లో దక్షిణాంధ్ర భాషా వర్దిని అనే సంస్థను స్థాపించి తెలుగు నేర్పించే తరగతులు నిర్వహించారు. భాషావ్యాప్తికి లిపి అడ్డం రాకూడదు అన్న ఉద్దేశ్యంతో తమిళనాడులో తెలుగు ప్రచారానికి తమిళ లిపిలో తెలుగు రచనలను అచ్చువేయించాడు. 1935 లో "దక్షిణాంధ్ర పత్రిక" అనే ఒక పత్రికను పెట్టి ఉచితంగా ప్రతులను పంచాడు. 3 నెలలకొక సారి ప్రచురించే ఈ త్రైమాసిక పత్రిక తమిళలిపిలో తెలుగు భాష చోటు చేసుకొంది. ఇందులో తెలుగు, ఆంగ్లంలో కూడా వ్యాసాలు వచ్చాయి. 1942 దాక నడిచిన ఈ పత్రికలో తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలను సంపాదకీయాలుగా రాసేవాడు . అక్కడి తెలుగు వారు అతనికి 'దక్షిణాంధ్ర పితామహ', 'భాషోద్ధారక' అనే బిరుదులు ఇచ్చి గౌరవించారు. వరదరాజం పంతులుగారు “దయచేసి తెలుగును కాపాడుడు” అనే పెద్ద బ్యానరును భుజానికి తగిలించుకొని తమిళదేశమంతా తిరిగాడు. తమిళనాడులోని తెలుగువారిలో క్షీణిస్తున్న తెలుగుకు స్వంత ఖర్చులతో ఒక ఉద్యమంలా ప్రచారం చేశాడు. అతని కృషి వలన తంజావూరు, మధురై, పుదుక్కోట రాజ్యాలలో తెలుగు భాష మీద మమకారం పెరిగింది. ఈ విధంగా తెలుగు వ్యాప్తికి, పరిరక్షణకు జీవితం వెచ్చించిన వరదరాజం పంతులు 1972లో, 83వ ఏట మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ gdurgaprasad (2012-12-23). "తమిళనాట తెలుగు మాణిక్యాలు – సాక్షి – కర్ణాటక". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-09-07.
- ↑ "తమిళ నాట తెలుగు నిలిపిన ఘనుడు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-09-24. Retrieved 2020-09-07.