Jump to content

సారపు ధర్మమున్ విమల సత్యము

వికీపీడియా నుండి
సారపు ధర్మమున్ విమల సత్యము
కవి పేరుతిక్కన
మూల గ్రంథంఆంధ్రమహా భారతం
విభాగంఉద్యోగపర్వం
అధ్యాయంతృతీయాధ్యాయం
గ్రంథంలో ఆలపించిన పాత్రకృష్ణుడు
దేశంభారతదేశం
భాషతెలుగు
విషయము(లు)సత్యాన్ని, ధర్మాన్ని దక్షత ఉండీ రక్షించకపోతే అది ఆ సమర్థునికే చేటు. సత్య ధర్మాలను రక్షించేందుకు ఎటూ భగవంతుడు ఉండనే ఉన్నాడు.
సందర్భంపాండవుల పక్షాన కురుసభకు రాయబారిగా వచ్చిన కృష్ణుడు కురువృద్ధుడైన భీష్ముడికి మంచిని బోధిస్తున్న సందర్భంలోనిది
ఛందస్సుఉత్పలమాల

సారపు ధర్మమున్ విమల సత్యము పద్యం ఆంధ్రమహాభారతములో ఉద్యోగ పర్వంలో తృతీయాశ్వసం లో తిక్కన చెప్పిన పద్యమిది. అత్యంత ప్రాచుర్యం పొందిన, తెలుగు సమాజంలో సూక్తిగా, వ్యాఖ్యగా పలుమార్లు పలు సందర్భాల్లో తిరిగితిరిగి చెప్పుకున్న పద్యమిది.

పద్యం

[మార్చు]

ఉ. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్

తాత్పర్యం

[మార్చు]

సారమైన ధర్మం పాపం చేతా, ఏ మాలిన్యమూలేని సత్యం బొంకు చేతా గట్టెక్కలేక చెడిపోయే దశను సమర్థులైనవారు ఉపేక్ష చేస్తే అది వారికి చేటు తెస్తుంది. కాని ధర్మాన్ని గట్టెక్కించేది సత్య శుభస్థితిని యోగ్యులకు సమకూర్చేదీ అయిన దైవము ఎల్లవేళలా ఉంటుంది.[1]

సందర్భం

[మార్చు]

మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో భీష్మునితో శ్రీకృష్ణుని సంభాషణలో భాగమైనదీ పద్యం. సమర్థత కలిగివుండీ సత్యము, ధర్మము పాడయ్యేప్పుడు భీష్ముడి వంటి దక్షుడు కాపాడకపోతే ఆయనే పాడవుతాడని, కానీ ఆ సత్య ధర్మాలను కాపాడేందుకు భగవంతుడు ఉండనే ఉన్నాడని ఈ పద్యంతో చెప్తాడు. అయితే ఆ భగవంతుడు తానే కావడం విశేషం, భావి భారత యుద్ధంలో ధర్మం జయిస్తుందని, ఏ కారణంతోనైనా అధర్మపక్షం వహించడం భీష్మునికి చేటు అని చెప్తాడు.[2]

విశేషాలు

[మార్చు]

అలంకారాలు

[మార్చు]

సారపు ధర్మమున్ విమల సత్యము పద్యంలో క్రమాలంకారం ఉంది. సారపు ధర్మము, విమల సత్యము పాపము చేత, బొంకుచే అనడంలో ధర్మాన్ని పాపము, సత్యాన్ని బొంకుకు అన్వయించుకోవాల్సి వుంటుంది.[3]

ప్రాచుర్యం

[మార్చు]

ఈ పద్యం మహాభారతంలోని చాలా ప్రసిద్ధమైన పద్యాల్లో ఒకటి. ప్రతి పండితుడు, పౌరాణికుడు, ప్రవాచకుడు ఏదోక సందర్భంలో ఉదహరించేది.[3]

మూలాలు

[మార్చు]
  1. శలాక, రఘునాధశర్మ. "నేర్చుకుందాం:సారపు ధర్మమున్". ఆంధ్రభూమి. Archived from the original on 21 అక్టోబరు 2015. Retrieved 21 October 2015.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. దీవి, సుబ్బారావు. "ధర్మం, సత్యం శాశ్వతం". సాక్షి. Archived from the original on 21 అక్టోబరు 2015. Retrieved 21 October 2015.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 విశ్వనాథ, సత్యనారాయణ (2007). సాహిత్య సురభి (2 ed.). విజయవాడ: విశ్వనాథ పబ్లికేషన్స్. pp. 61, 62.